icon icon icon
icon icon icon

పేర్ని కిట్టు గ్యాంగ్‌ దుశ్శాసన పర్వం

మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు ప్రోత్సాహంతో ఆయన అనుచరులు దుశ్శాసన ఘట్టాన్ని మరిపించేలా అరాచకానికి పాల్పడ్డారు. ఓ మహిళ మెడలో తాళి తెంచేందుకు ప్రయత్నించారు.

Updated : 03 May 2024 06:48 IST

బందరులో జనసేన కార్యకర్త కుటుంబంపై పైశాచిక దాడి
కిట్టు ప్రోత్సాహం.. ఆపై గంజాయి మత్తులో బీభత్సం
మహిళ తాళి తెంచేందుకు అనుచరుల యత్నం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-మచిలీపట్నం కలెక్టరేట్‌: మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు ప్రోత్సాహంతో ఆయన అనుచరులు దుశ్శాసన ఘట్టాన్ని మరిపించేలా అరాచకానికి పాల్పడ్డారు. ఓ మహిళ మెడలో తాళి తెంచేందుకు ప్రయత్నించారు. రాసేందుకూ వీల్లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ మహిళపై పిడిగుద్దులు కురిపించారు. పిల్లలను సైతం భయభ్రాంతులకు గురిచేశారు. అప్పుడే వచ్చిన ఆమె భర్త ఇదేమని ప్రశ్నిస్తే ఆయనపైనా దౌర్జన్యం చేశారు. సాయం చేయండి మహాప్రభో అంటూ అందుబాటులో ఉన్న పోలీసు నంబర్లకు ప్రయత్నించినా స్పందించలేదు. పరుగున పోలీసుస్టేషన్‌కు వెళ్లిన బాధితులను గంజాయి బ్యాచ్‌.. పోలీసుల సాక్షిగా ‘ఏరా మా మీదే ఫిర్యాదు చేసేంత మగాడివా? నీకు రాజకీయలెందుకురా’ అంటూ తిడుతూ దాడికి పాల్పడ్డారు. విషయం తెలిసిన ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకునేవరకూ పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకోలేదు. ప్రతిపక్షాల ఆందోళనతో మచిలీపట్నం ఉద్రిక్తంగా మారింది. పోలీసుస్టేషన్‌లోనే బాధితులపై చేయిచేసుకోవడం 15 రోజుల్లో ఇది రెండోసారి. ఈ ఘటన కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, పారామిలటరీ బలగాలు ఇక్కడే ఉన్నా.. కిట్టు ఆగడాలకు అడ్డుకట్ట వేయలేదు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

బాణసంచా ఎందుకు కాల్చారని అడిగినందుకు...

బందరులో వైకాపా తరఫున మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీచేస్తున్నారు. గురువారం బందరు 8వ డివిజన్‌ విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆడంబరంగా ప్రచారం నిర్వహించారు. ఇదే కాలనీలో జనసేన కార్యకర్త కర్రి మహేష్‌ నివాసం ఉంది. స్వర్ణకారుడైన ఆయన గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బ్యాంకులో అప్రయిజర్‌గా పనిచేస్తున్నారు. పేర్ని కిట్టు ప్రచారవాహనం మహేష్‌ నివాసానికి చేరుకోగానే పెద్దఎత్తున బాణసంచా కాల్చగా, నిప్పురవ్వలు ఇంట్లోకి దూసుకెళ్లాయి. దీంతో అక్కడున్న మహిళలు బాణసంచా ఎందుకు కాలుస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన పేర్ని కిట్టు అనుచరులు మహేష్‌ నివాసంపై దాడిచేశారు. అందిన వస్తువునల్లా ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. పూలకుండీలు ధ్వంసం చేశారు. మహేష్‌ భార్య హేమలతపై దాడి చేశారు. ఆమె మెడలోని తాళిబొట్టును లాగేశారు. అడ్డుకున్న ఆమె అత్తగారు జ్ఞానప్రసూనాంబను నెట్టేయడంతో ఆమె తలకు గాయమైంది. హేమలతపై పైశాచికంగా వ్యవహరించారు. అక్కడే ఉన్న హేమలత కుమారుడు సాయికృష్ణ రామబ్రహ్మం, కుటుంబసభ్యులు గోకుల్‌, నాగబాబులపైనా చేయి చేసుకున్నారు. ఇది జరుగుతున్న సమయంలోనే అక్కడికి మహేష్‌ చేరుకున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించగా ఆయనపైనా దాడిచేశారు. తమను రక్షించాలంటూ బాధితులు 100కు, పోలీసుస్టేషన్లకు, ఎస్పీ సెల్‌ఫోన్‌కు కాల్‌ చేసినా స్పందించలేదు. ప్రచార వాహనంలోనే కూర్చున్న పేర్ని కిట్టు.. అనుచరులను ప్రోత్సహించారు. వారంతా అక్కడి నుంచి వెళ్లిన తర్వాత.. బాధితులు పక్కనే ఉన్న పోలీసుస్టేషన్‌కు వెళ్లారు.

పోలీసుల ముందే మరోసారి

పోలీసుస్టేషన్‌కు వెళ్లి పరిస్థితి వివరిస్తుంటే.. అక్కడికి కిట్టు అనుచరులు చేరుకున్నారు. మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల ముందే ముష్టిఘాతాలు కురిపించారు. అక్కడ సీసీ టీవీ ఉందన్న భయం కూడా లేదు. అయినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మచిలీపట్నం జనసేన అభ్యర్థి, ఎంపీ వల్లభనేని బాలశౌరి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర అక్కడికి చేరుకున్నారు. తెదేపా నేతల రాకతో పోలీసుల్లో కదలిక వచ్చి అప్పుడు ఇరువర్గాలతో సంప్రదింపులకు సిద్ధమయ్యారు. పోలీసుస్టేషన్‌లో న్యాయం జరగదంటూ ఒక్కసారిగా తెదేపా, జనసేన కార్యకర్తలు పక్కనే ఉన్న ఎస్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి కార్యాలయంలో లేరు. అక్కడే ఉన్న పోలీసు అధికారులతో ఎంపీ బాలశౌరి వాగ్వాదానికి దిగారు. బందరులో పోలీసులు ఉన్నారా.. అంటూ ప్రశ్నించారు. డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్‌, ఇతర పోలీసు అధికారులు సంయమనం పాటించాలని ఆయనకు సర్దిచెప్పారు. అక్కడి నుంచే ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. తాను 24 గంటల్లో చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీ సేకరిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

వైకాపా మచిలీపట్నం అభ్యర్థి పేర్ని కిట్టుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ బాలశౌరి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర మీడియాతో చెప్పారు. పేర్ని కిట్టుతో పాటు, దాడికి పాల్పడినవారిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే శుక్రవారం పేర్ని నాని ఇంటివద్ద నిరసన తెలుపుతామన్నారు. కిట్టు ఆగడాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ పట్ల అతి జుగుప్సాకరంగా వ్యవహరించారని, దీనిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదుచేసి శిక్షించాలని డిమాండు చేశారు. ఇటీవల తాలూకా పోలీసు స్టేషన్‌ మీదకు వెళ్లి తండ్రీకొడుకులు నానా రాద్ధాంతం చేస్తే ఎస్‌ఐనే వీఆర్‌కు పంపారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img