logo

ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు

జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్‌ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated : 03 May 2024 09:01 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు: జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్‌ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 19 రోజులు 40 నుంచి 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో పార్లమెంటు ఎన్నికలు రావడంతో నేతలు ఓవైపు వేడిని భరించలేక, మరోవైపు ఓటర్లను సకాలంలో కలవలేక ఏంచేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికితోడు ప్రచార సమయం కూడా తక్కువగా ఉండటంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల యత్నాలు చేస్తున్నారు.  

మధ్యాహ్నం కల్యాణ మండపాల్లో సమావేశాలు: జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌ చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుండగా, కొడంగల్‌ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోకి వస్తోంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు, అనుయాయులు మైకులు అందుకుందామనుకున్నా, ఎండ దెబ్బతో ప్రజలను సమీకరించడం కష్టమవుతోంది. దీంతో ఉదయం 11 గంటల లోపు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు గ్రామాలు, తండాలు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. ఎక్కువగా ఉదయం 11 గంటలలోపే ప్రచార కార్యక్రమాలు ముగించేసుకొని, మధ్యాహ్నం కల్యాణ మండపాల్లో ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి తమ వాణి వినిపించేందుకు తాపత్రయపడుతున్నారు. 

ఏ అవకాశాన్నీ వదలడం లేదు        

పార్లమెంటు ఎన్నికల్లో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి జిల్లాలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, భారాస, భాజపాలు పట్టణాలు, పల్లెలు, తండాలు, వీధులు అనే వ్యత్యాసం లేకుండా ప్రచారం పర్వం కొనసాగిస్తున్నాయి. ప్రత్యర్థుల బలహీనతలు, తమ బలాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారానికి కేవలం 9 రోజులు, ఓటింగ్‌కు పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో తమ విజయావకాశాలను మెరుగుపర్చుకోవడానికి అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడంలేదు. వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని విధాలా యత్నిస్తున్నారు.  

పని ప్రదేశాలకు వెళ్తూ.. ఫోన్లు చేస్తూ..

చాలా మంది నాయకులు ఎండ వేడెక్కక ముందే ఉపాధిహామీ కూలీలు పనిచేసే ప్రదేశానికి వెళ్లి ప్రచారం చేస్తుండగా, మరికొంత మంది ఉదయం నడకకు వచ్చిన ఓటర్లతో తమ పార్టీకే ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కొందరు మధ్యాహ్నం వేళ పేరున్న నాయకులకు ఫోన్లు చేసి ఓట్లు అడుగుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారానే అధికంగా ప్రచారం చేస్తున్నారు. సమయం తక్కువగా ఉండటంతోపాటు ప్రతి గ్రామానికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు వెళ్లేందుకు కుదరడంలేదు. దీంతో గ్రామస్థాయి నాయకులకే ప్రచార బాధ్యతలు అప్పగించి, మండల స్థాయి నాయకులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగే విధంగా చూస్తున్నారు. మధ్యాహ్నం వేళ ప్రచార రథాలు గ్రామాల్లోని చెట్ల నీడన దర్శన మిస్తున్నాయి. వాటిని నడిపే వారు కాస్త చల్లటి నీడలో సేద దీరుతున్నారు.సాయంత్రం  స్పీకర్ల పాటలతో హోరెత్తిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని