logo

చాకుతో దాడి: యువకుడి హతం

గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్‌ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్‌ దాస్‌ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.

Published : 20 Apr 2024 02:41 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్‌ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్‌ దాస్‌ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది. దీంతో సునీల్‌పై ఆ యువకుడు చాకుతో దాడి చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని చెరువులో పడేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్డీపీఓ, ఠాణా ఐఐసీ, సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. చెరువులో మృతదేహాన్ని బయటకు తీసి పరీక్ష చేయించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

గంజాం జిల్లా ఉత్తర ఘుముసుర అటవీ డివిజన్‌లో ముజాగడ అటవీ రేంజ్‌ పరిధిలోని నిధియాపల్లి, ఖారిగుడ గ్రామాల సమీపంలోని తోటల్లో 18 ఏనుగుల గుంపు సంచరిస్తోంది. గురువారం ఈ గుంపు భంజనగర్‌-ఫుల్బాణీ ప్రధాన రహదారిని దాటగా.. ఆ సమయంలో ఇరువైపులా వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించకుండా అటవీ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.


అనుమానాస్పదంగా మహిళ మృతి

గుణుపురం, న్యూస్‌టుడే: బయాగుడ గ్రామంలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ జిల్లా గుణుపురం సమితి బయాగుడకు చెందిన సురేంద్ర సబర ఇంటికి వచ్చే సరికి ఆయన భార్య సంతోషి బవురి(26) చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంతోషి తల్లి జిల్లి సబర కుమార్తెను ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. రెండేళ్ల క్రితం వివాహం జరిగితే అన్ని లాంఛనాలు ఇచ్చినా ఆమెను మానసికంగా వేధించేవాడని అన్నారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐఐసీ ఉత్తమ్‌కుమార్‌ దర్యాప్తు ప్రారంభించారు.


రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లా కేస్‌పూర్‌ పరిధి తెమనీపోల్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మిడ్నాపూర్‌ వెళ్తున్న ఒక మారుతీ వ్యాన్‌ తెమినిపోల్‌ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఒక కారుని బలంగా ఢీకొట్టింది. వ్యానులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, చోదకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కేస్‌ పూర్‌ ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో మిడ్నాపూర్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియ రాలేదు.


మాంగనీస్‌ అక్రమ రవాణా

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితి నుంచి ఆంధ్రాకు మాంగనీస్‌ అక్రమంగా తరలిస్తున్న లారీని అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీ అధికారి డొంబురు నాయక్‌ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. సదర్‌ సమితి లెల్లిగుమ్మ అటవీ ప్రాంతం నుంచి తరచూ మాంగనీస్‌ అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి విజయనగరం జిల్లాకు చెందిన వి.వెంకటేశ్వరావు(32), సీహెచ్‌ నరసింహరావు(35), ఎ.తరున్‌ కుమార్‌(39) లారీలో మాంగనీస్‌ తరలిస్తుండగా గుమ్మ సమీపంలో పట్టుకున్నారు. కేసు నమోదు చేసి లారీని సీజ్‌ చేశారు.


విమానాశ్రయంలో 3.8 కిలోల పసిడి స్వాధీనం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌ బిజు విమానాశ్రయంలో శుక్రవారం ఐటీ అధికారులు ఒక వ్యక్తి నుంచి 3.8 కిలోల పసిడి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడు ముంబయి ఫేషన్‌ జ్యూయలరీకి పసిడి తరలించే యత్నం చేస్తూ పట్టుబడినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ నెల 17న ఈ విమానాశ్రయంలో కిలో పసిడి బ్యాంకాక్‌ నుంచి తీసుకొచ్చిన నిందితున్ని ఐటీ అధికారులు అరెస్ట్‌ చేశారు.


మద్యం మత్తులో హత్య

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా చందిలి ఠాణా పత్రపుట్‌కు చెందిన సుదేస్‌ పరిబాక శుక్రవారం మద్యం మత్తులో బురిసి పెద్దంటి (40)ని కర్రతో కొట్టి హత్య చేశాడు. సుదేస్‌ మద్యం సేవించి శీతల పానీయం కోసం బురిసి దుకాణానికి వెళ్లాడు. అక్కడ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో దాడిచేయగా బురిసి మృతి చెందాడు. గ్రామస్థులు నిందితుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఐఐసీ ప్రసన్న కూమార బెహరా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని