logo

రాయగడలో ఎన్నికల వే‘ఢీ’

రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్‌ లోక్‌సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది.

Published : 02 May 2024 02:40 IST

బిజద, కాంగ్రెస్‌ తరఫున ఖరారైన నవీన్‌, రాహుల్‌, రేవంత్‌ పర్యటన
మోదీని రంగంలోకి దింపేందుకు భాజపా నిర్ణయం

నవీన్‌  , రాహుల్‌గాంధీ

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్‌ లోక్‌సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు అగ్ర నేతలను ప్రచారం కోసం రంగంలోకి దింపుతున్నాయి. దీంతో జిల్లాలో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిజద తరఫున ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిల రాయగడ పర్యటన ఇప్పటికే ఖరారైంది. భాజపా తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు చేస్తుండడం గమనార్హం. రాష్ట్రం నుంచి ఒకే ఒక్క సీటుని 2019 ఎన్నికల్లో గెలుచుకున్న కొరాపుట్‌ లోక్‌సభ స్థానాన్ని మరోసారి చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం మే 3న రాయగడ పర్యటనకు రానున్న రాహుల్‌ గాంధీతో ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతోపాటు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో మూడు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీటికి సంబంధించి ఎంపీ సప్తగిరి ఉలక పర్యవేక్షణలో ఏర్పాట్లను మొదలుపెడుతున్నారు. రాహుల్‌ గాంధీ పర్యటన మరుసటి రోజే (మే 4న) రాయగడ చేరుకోనున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ టికిరిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారని బిజద వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు దీనికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రేవంత్‌ రెడ్డి

మూడు నియోజకవర్గాలకు 30 మంది

జిల్లాలో ఉన్న మూడు శాసనసభ నియోజకవర్గాల కోసం ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో రాయగడ నియోజకవర్గానికి 10 మంది పోటీలో నిలుస్తుండగా, గుణుపురంలో 12 మంది, బిసంకటక్‌లో ఎనిమిది మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మూడు స్థానాల్లో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని మరింత హోరెత్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని