logo

అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ

నవరంగపూర్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Published : 24 Apr 2024 02:08 IST

నరసింగ్‌ బొత్ర, హరాబతి గండ్‌, సోమనాథ్‌ పూజారి, లిపికా మాఝి, సన్‌రాజ్‌ గండ్‌

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: నవరంగపూర్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. నవరంగపూర్‌ నియోజకవర్గంలో బిజద, భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులుగా కౌసల్య ప్రధాని, గౌరీశంకర్‌ మాఝి, దిలీప్‌ ప్రధానికి ఆయా పార్టీలు టికెట్‌ కేటాయించాయి. గౌరీశంకర్‌ గత ఎన్నికల్లో బిజద అభ్యర్థి సదాశివ్‌ ప్రధానితో తలపడి ఓటమి చవిచూశారు. ఈసారి ఆ పార్టీ సదాశివ్‌కు బదులుగా ఆయన భార్య కౌసల్యకు టికెట్‌ ఇచ్చింది. పదేళ్ల అనుభవం ఉన్న గౌరీతో కౌసల్య, దిలీప్‌ తలపడనున్నారు.

ఉమ్మర్‌కోట్‌లో...

ఉమ్మర్‌కోట్‌ నియోజకవర్గంలో బిజద నబీనా నాయక్‌కు, భాజపా సిటింగ్‌ ఎమ్మెల్యే నిత్యానంద్‌ గండ్‌కు, కాంగ్రెస్‌ సన్‌రాజ్‌గండ్‌కు టికెట్లు కేటాయించాయి. పదేళ్లపైనే అనుభవం ఉన్న నిత్యానంద్‌కు మద్దతుదారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉమ్మర్‌కోట్‌ మాజీ ఎమ్మెల్యే సుభాష్‌గండ్‌ భార్య నబీనా గండ్‌, రాయ్‌ఘర్‌ సమితి బిజద అధ్యక్షురాలిగా చేశారు. వీరిద్దరితో కొత్త అభ్యర్థి సన్‌రాజ్‌ గండ్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

జొరిగావ్‌లో... 20

జొరిగావ్‌ నియోజకవర్గంలో బిజద అభ్యర్థి రమేష్‌చంద్ర మాఝి రాజకీయాల్లో దాదాపు ఇరవయ్యేళ్ల అనుభవజ్ఞుడు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన రాజకీయ యుక్తులు తెలిసిన సీనియర్‌ నేత. ఆయనకు పోటీగా భాజపా నరసింగ్‌ బొత్రను, కాంగ్రెస్‌ హరాబతి గండ్‌ను బరిలో దించింది. హరాబతి ఆదివాసీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు చేరువవుతుండగా, నరసింగ్‌ తనదైన శైలిలో భాజపా పథకాలు ప్రజలకు గుర్తు చేస్తూ ప్రచారంలో జోరు పెంచారు.

డాబుగావ్‌లో...

డాబుగావ్‌ నియోజకవర్గంలో బిజద తరఫున సిటింగ్‌ ఎమ్మెల్యే మనోహర్‌ రంధారి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుండగా, నూతన అభ్యర్థులైన సోమ్‌నాథ్‌ పూజారి (భాజపా), డా.లిపికామాఝి (కాంగ్రెస్‌) బరిలో దిగనున్నారు. డాక్టర్‌ చదివిన లిపికా తండ్రి భుజబల్‌ మాఝి బాటలో నడుస్తూ ప్రజలకు సేవ చేసేందుకు 2022లో రాజకీయ ప్రస్థానం ఆరంభించింది. మరోవైపు సోమనాథ్‌ గతంలో జిల్లా పరిషత్‌ అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడనున్నారు.  నవరంగపూర్‌లో బిజద, కాంగ్రెస్‌ అభ్యర్థులకు, ఉమ్మర్‌కోట్‌లో బిజద అభ్యర్థి నబీనాకు వ్యతిరేకత ఎదురైంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కృషి చేస్తున్న వారికి కాకుండా నూతన అభ్యర్థులకు అధిష్ఠానం టికెట్‌ కేటాయించడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నవరంగపూర్‌లో బిజద నేత మంజుల మాఝి, కాంగ్రెస్‌ నేత దిబాకర్‌ పూజారి, ఉమ్మర్‌కోట్‌లో డా।।సురేష్‌ డంఖర్‌ వ్యతిరేకత తెలుపుతూ పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు భుజబల్‌ తన కుటుంబంలో నాలుగు టికెట్లు దక్కించుకున్నాడని జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఆరోపిస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో నలుగురు అనుభవంతులతో ఎనిమిది మంది కొత్త అభ్యర్థులు పోటీపడుతుండడం అందిరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని