Garry Kasparov: రాహుల్‌ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్‌

ముందు రాయ్‌బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్‌ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. 

Published : 04 May 2024 10:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముందు రాయ్‌బరేలీలో గెలవాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని ఉద్దేశించి చెస్‌ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ (Garry Kasparov) చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. దాంతో కాస్పరోవ్‌ వివరణ ఇస్తూ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఎన్నికల ప్రచారానికి వెళుతూ ఇటీవల రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తన ఫోన్‌లో చెస్‌ ఆడాడు. గ్యారీ కాస్పరోవ్‌ తన అభిమాన చెస్‌ క్రీడాకారుడు అని, అతనొక నాన్‌ లీనియర్‌ థింకర్‌ అని పేర్కొన్నారు. రాజకీయాలకు, చదరంగానికి దగ్గరి సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. ఆటపై ఒక్కసారి దృష్టి సారిస్తే ప్రత్యర్థి పావులు సైతం మన సొంతమవుతాయన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చెస్‌ ప్లేయర్‌ అని పేర్కొన్నారు. దీనిపై ఒక యూజర్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘‘చెస్‌ దిగ్గజాలు కాస్పరోవ్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌ చాలా తొందరగా ఆట నుంచి రిటైర్‌ అయ్యారు. వారికి మన కాలంలోని గొప్ప మేధావిని ఎదుర్కొనే అవకాశం రాలేదు’’ అని పోస్టు చేశారు. ఈ క్రమంలోనే ‘‘ముందు రాయ్‌బరేలీలో గెలవాలి’’ అంటూ ఈ రష్యన్ లెజెండ్‌ సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ఆయన వివరణ ఇచ్చారు.

‘ రాహుల్‌గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?

‘‘నేను సరదాగా చేసిన పోస్టు ఇంత చర్చకు దారితీస్తుందని అనుకోలేదు. నేను గతంలో చెప్పినట్టుగా.. నాకు అత్యంత ప్రియమైన చదరంగంలో రాజకీయాలు కనిపిస్తున్నాయని అర్థమవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చెస్‌ ప్లేయర్‌ అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యను ఎద్దేవా చేస్తూ నటుడు రణ్‌వీర్ షోరే ఓ వీడియోను షేర్ చేశారు. దానిని రీపోస్ట్‌ చేస్తూ గ్యారీ పైవిధంగా స్పందించారు.

రష్యాకు చెందిన 61 ఏళ్ల కాస్పరోవ్‌ చదరంగంలో ఎన్నో ఘనతలు సాధించారు. ఎన్నోసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. 2005లో ఆటకు వీడ్కోలు పలికిన ఆయన.. తరచూ అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఆయన గత కొన్నేళ్ల క్రితం తన దేశం నుంచి పారిపోయి క్రొయేషియాలో ఉంటున్నారు. రష్యా ఇటీవలే కాస్పరోవ్‌ను ‘ఉగ్రవాదులు, అతివాదుల’ జాబితాలో చేర్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని