ఫులే సామాజిక ఉద్యమాలు శ్లాఘనీయం
ఫులే విగ్రహం వద్ద కలెక్టర్ ప్రవీణ్ కుమార్,
ఎస్పీ మలికా గార్గ్, జేసీ, మేయర్
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి మహాత్మా జ్యోతీరావ్ ఫులే సాగించిన సామాజిక ఉద్యమాలు శ్లాఘనీయమని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కొనియాడారు. ఫులే వర్ధంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఫులే విగ్రహానికి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్పీ మలికా గార్గ్, జేసీ కృష్ణవేణి, నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యతోనే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్పిన మహనీయుడని, సతీ సహగమనం వంటివి రూపుమాపడానికి ప్రజలను జాగృతి చేశారని శ్లాఘించారు. ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ.. సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఫులే సాగించిన పోరాటాలు స్మరణీయం అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.రవిచంద్ర, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి అంజలి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.