logo

శివారు.. పట్టించుకోలేదు జగన్‌ సారు..!

అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్‌ సర్కార్‌ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.

Published : 19 Apr 2024 04:22 IST

చందాలతో కంకర రోడ్డు 

అయిదేళ్ల పాలనలో పట్టించుకోని వైకాపా ప్రభుత్వం

 పలుమార్లు  విన్నవించుకున్నా.. స్పందన కరవు  
అవస్థల మధ్య అక్కడి ప్రజల జీవనం

అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్‌ సర్కార్‌ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది. వెరసి అడగడుగునా సమస్యలతో శివారు ప్రాంతాల ప్రజలు సతమతమవుతున్నారు. అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారు. జీవన ప్రమాణాలు క్షీణించాయి. మౌలిక వసతులు కల్పనలో వైకాపా ప్రభుత్వం విఫలం అయిందని వారంతా వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు తమ కష్టాలు తీర్చలేదని ఆవేదన చెందుతున్నారు.

-న్యూస్‌టుడే, పలాస, ఇచ్ఛాపురం


పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో శివారులో ఉన్న మీలగారంపాడు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో జీడి తోటల మధ్య ఉంది. ఆ తోటల మధ్య నుంచే రాకపోకలు చేస్తుంటారు. సరైన రోడ్డులేక ఇక్కట్లు నిత్యకృత్యమయ్యాయి. సమస్య పరిష్కరించకపోవడంతో విసుగు చెంది చందాలు వేసుకుని కంకర రోడ్డు వేసుకున్నారు.


ఒక్కటి కూడా పరిష్కరించలేదు

కోసంగిపురం నుంచి అడవికొత్తూరుకు వెళ్లాలంటే సుమారు 2 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ గ్రామంలో తక్కువ సంఖ్యలో ఇళ్లు ఉండటంతో పాలకులు పట్టించుకోవడం లేదు. రోడ్లు లేవు, కాలువ వ్యవస్థ సరిగా ఉండదు. వైకాపా అయిదేళ్ల పాలనతో ఏ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్థులు తెలిపారు.

మీలగారంపాడుకు దారి


రాత్రయితే భయం  

మా గ్రామంలో 46 ఇళ్లు ఉండేవి. తుపాను విరుచుకు పడడంతో ప్రస్తుతం 26 మాత్రమే ఉన్నాయి. కాశీబుగ్గ కు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరం. ఎన్నో సమస్యలు గ్రామాన్ని పీడిస్తున్నాయి. రోడ్డు వేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. తరచూ ఎలుగుబంట్లు వస్తాయి. చీకటిలో వాటి దాడికి గురవుతామని భయపడుతున్నాం. వీధి దీపాలు వేయాలని పలుమార్లు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు కోరితే.. స్పందన కరవైంది. 

 -వాసుదేవ్‌, యశోదమ్మ, మీలగారంపాడు, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం


మేమే శుభ్రం చేసుకుంటున్నాం

తాళభద్ర-ఉప్పరపేట కూడలి వద్ద రోడ్డుపైనే పడేస్తున్న చెత్త

పారిశుద్ధ్య కార్మికులు మా గ్రామానికి అప్పుడప్పుడు వస్తున్నారు. దీంతో చెత్త నిల్వలు పేరుకుంటున్నాయి. చేసేదేం లేక మేమే చెత్తను సేకరించి గ్రామం బయట పడేస్తున్నారు.  
- ఆర్‌.నరహరి, పాయకరాంపురం, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం


పన్నుల భారం భరించలేకపోతున్నాం

తమ ప్రాంతంలో కాలువలు సక్రమంగా లేవు. పన్నులు మాత్రం పెంచేస్తున్నారు. కాలువ నిర్మాణం కూడా చేయకపోవడంతో అందరికీ ఇబ్బంది తప్పడం లేదు. మురుగుపారేలా కాలువలు, రోడ్లు వేసి, వీధి దీపాలు ఏర్పాటుచేయాలని చెప్పినా చేయలేదు.

-ఎం.సురేఖ, ఇచ్ఛాపురం


బావి నీరే దిక్కు

మేము ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో రత్తకన్నలో ఉంటున్నాం. కాలువలు లేవు. రహదారి కూడా వేయాల్సి ఉంది. వీధి దీపాలు అమర్చాలి. మాకు పన్ను భారం నానాటికీ పెరిగిపోతోంది. బావినీటినే తాగేందుకు ఉపయోగిస్తున్నాం. కుళాయిలు కొన్ని ప్రాంతాలలోనే ఉన్నాయి. వాడుకనీరు, మురుగునీరు రోడ్లమీదే ప్రవహిస్తున్నాయి. -జి.పరశయ్య, రత్తకన్న


పురపాలక సంఘం: పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం

  • వార్డులు మొత్తం : 31
  • శివారు ప్రాంతాలు : 9
  •  గ్రామాలు  : 12
  •  శివారు ప్రాంతాల జనాభా : 3 వేలు

పురపాలకసంఘం : ఇచ్ఛాపురం

  • వార్డులు : 23
  • శివారు ప్రాంతాలు : 15
  •  శివారు ప్రాంతాలలో జనాభా : 9వేలు
  •  శివారు ప్రాంతాలు : కొండపోలమ్మకాలనీ, రత్తకన్న రోడ్లు, బెల్లుపడ, అచ్చమ్మపేట, సంతపేట, వాంబేకాలనీ, గాంధీనగర్‌, కస్పావీధులు, కండ్రవీధి, బెల్లుపడకాలనీ

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని