logo

రాజకీయం మారుతోంది..!

జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది

Published : 19 Apr 2024 04:48 IST

 ఎన్నికల వేళ అధికార పార్టీకి ఎదురుదెబ్బ

తెదేపా గూటికి చేరుతున్న వైకాపా నేతలు

తెదేపాలో చేరిన వైకాపా జిల్లా కోశాధికారి తులసీవరప్రసాద్‌, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో మామిడి గోవిందరావు

 న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం), పొందూరు, రణస్థలం, మెళియాపుట్టి, కొత్తూరు: జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది. ప్రచారాలు సైతం ఊపందుకున్నాయి. మరికొద్ది రోజుల్లో పోలింగ్‌ జరగనున్న తరుణంలో అధికార వైకాపాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కీలక నేతలంతా గడప దాటుతున్నారు. అసంతృప్తిని తట్టుకోలేక ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో తెదేపాలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో సైతం పెద్ద ఎత్తున వైకాపా కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాయి. గురువారం పెద్దఎత్తున వైకాపా నుంచి తెదేపాలో చేరికలు కొనసాగాయి.

తెదేపాలో చేరిన కొత్తూరు ఉప ఎంపీపీ

పాతపట్నం నియోజకవర్గ రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామం గురువారం చోటు చేసుకుంది. కొత్తూరు మండలంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వైకాపా తరఫున ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన సీనియర్‌ నాయకుడు ఎల్‌.తులసీవరప్రసాద్‌తో పాటు వైకాపా ఎంపీటీసీ సభ్యులు చింతాడ శ్రావణి, వీర్రాజు, కృష్ణవేణి, సింహాచలం, గౌరీకుమార్‌, సుమతి, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, వందలాది మంది వైకాపాను వీడారు. ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరావు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా తులసీవరప్రసాద్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు.

  •  మెళియాపుట్టికి చెందిన పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. మెళియాపుట్టి సర్పంచి కుమారుడు రేఖాన వాసు, ఉప సర్పంచి మాడుగుల భానూజీరావు, వార్డు సభ్యులు గాలి రామారావును తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
  •  శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ తెదేపా బలం పెరుగుతోంది. పలువురు తటస్థులు, వైకాపా నాయకులు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ను కలిసి మద్దతు తెలిపారు. నగరంలోని ఆయన కార్యాలయంలో గుత్తు చిన్నారావు, అల్లంశెట్టి జనార్దనరావు, పేట పద్మ, బెవర రమణ, రెడ్డి ఎర్రయ్య, తదితరులకు కండువాలు వేసి శంకర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేస్తామని వారంతా పేర్కొన్నారు.
  • పొందూరు మండలంలో వైకాపాబలహీనపడుతోంది. కింతలి గ్రామంలో సర్పంచి పైడి రాంప్రసాద్‌, ఎంపీటీసీ సభ్యుడు కూటికుప్పల హనుమంతురావు ఆధ్వర్యంలో 95 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. తెదేపా ఆమదాలవలస అభ్యర్థి కూన రవికుమార్‌ సమక్షంలో వారంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
  • లావేరు మండలం లింగాలవలస వైకాపా సర్పంచి లుకలాపు అప్పలనాయుడు ఎచ్చెర్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావును కలిశారు. త్వరలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో భాజపాలో చేరనున్నట్లు ప్రకటించారు. మెంటాడలో 110 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని