logo

రెండో రోజు.. ప్రధాన పార్టీల జోరు

నామినేషన్ల పర్వంలో రెండో రోజు సందడిగా సాగింది. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థులు బోణీ చేయగా.. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.

Published : 20 Apr 2024 05:03 IST

ఆరు అసెంబ్లీ స్థానాలకు 13 నామినేషన్ల దాఖలు

పాతపట్నంలో నామినేషన్‌ వేసేందుకు ర్యాలీగా వెళ్తున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు, చిత్రంలో ఎంపీ రామ్మెహన్‌నాయుడు, కూటమి శ్రేణులు

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, కలెక్టరేట్‌, అరసవల్లి, టెక్కలి, పాతపట్నం: నామినేషన్ల పర్వంలో రెండో రోజు సందడిగా సాగింది. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థులు బోణీ చేయగా.. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలకు చేరుకున్నారు. కొందరు తమ పేరిట ముహూర్తం చూసుకొని నామపత్రాలు దాఖలు చేశారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు 13 మంది, శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం నుంచి పేరాడ తిలక్‌ (వైకాపా), ఇప్పిలి సీతరాజు (జై భారత్‌ నేషనల్‌ పార్టీ), బి.తిరుపతిరావు (భారత పిరమిడ్‌ పార్టీ) నామినేషన్లు వేశారు.


పోర్టు ఉపాధి దువ్వాడకే..

‘మూలపేట పోర్టు వస్తే అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఉద్యోగాలు వస్తాయి’ అని వైకాపా నాయకులు పదేపదే చెబుతుంటే స్థానికులు ఆశగా ఎదురు చూశారు. శుక్రవారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ నామినేషన్‌ ర్యాలీలోనూ మూలపేట పోర్టు గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన అఫిడవిట్‌ను పరిశీలిస్తే ఉపాధి ఎవరికి దొరికిందో బయట పడింది. విశ్వసముద్ర ఇంజినీరింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట గుత్తేదారు అవతారమెత్తిన దువ్వాడ శ్రీనివాస్‌ ఆయా ప్రాజెక్టులకు అవసరమైన రాయి, ఇసుక, కంకర సరఫరా చేసే పనులు పొందినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మూలపేట పోర్టుకు సంబంధించి సామగ్రి సరఫరా చేస్తుండటంతో తనకు ఆదాయం సమకూరుతోందని వెల్లడించారు. పోర్టు వస్తే అందరికీ ఉపాధి వస్తుందని చెప్పిన ఆయన తాను ఉపాధి పొందితే జిల్లా అంతా ఉపాధి పొందినట్లేనని భావిస్తున్నారంటూ వైకాపా నేతలే గుసగుసలాడటం గమనార్హం.

పలాసలో ఆర్వో భరత్‌నాయక్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష

జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సామూన్‌కు నామపత్రం అందజేస్తున్న వైకాపా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌,
 చిత్రంలో సభాపతి సీతారాం, మంత్రులు ధర్మాన, అప్పలరాజు, ఎమ్మెల్యే కృష్ణదాస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని