logo

మాటల మామ.. సంక్షేమం మమ..!

రాష్ట్రంలోని పిల్లలందరికీ తనకు తాను మేనమామగా ప్రకటించుకున్న సీఎం జగన్‌ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను ఎంతో ఉద్ధరించినట్లు గొప్పలు చెబుతారు.

Updated : 20 Apr 2024 05:50 IST

బీసీ,  ఎస్సీ వసతిగృహాల్లో కనీస వసతులు కరవు
విద్యార్థుల అవస్థలు పట్టించుకోని వైకాపా ప్రభుత్వం

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, బూర్జ, రణస్థలం, కంచిలి, కవిటి గ్రామీణం, సారవకోట రాష్ట్రంలోని పిల్లలందరికీ తనకు తాను మేనమామగా ప్రకటించుకున్న సీఎం జగన్‌ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను ఎంతో ఉద్ధరించినట్లు గొప్పలు చెబుతారు. ‘నా ఎస్సీలు...నా బీసీలు..నా మైనార్టీలు..’ అంటూ ఎక్కడ లేని ప్రేమ  ఒలకబోసే ముఖ్యమంత్రి ఆ చిన్నారుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. అయిదేళ్ల పాలనలో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సరైన వసతుల్లేక అవస్థలు పడుతున్నారని తెలిసినా కన్నెత్తి చూడలేదు. మంచాలు, కిటికీలకు తలుపులు, తాగునీటి సౌకర్యం లేకపోయినా మామ కరుణించలేదు. దోమలు విజృంభిస్తుండటంతో ఇరుకు గదుల్లో నిద్రించేందుకు సతమతమవుతున్నా.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. జిల్లాలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో నెలకొన్న పరిస్థితులపై  ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.


పెచ్చులూడుతున్నాయి చూడు మావయ్య..

ఎల్‌ఎన్‌పేట సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. 30 ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం శిథిలమైంది. పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. ఊచలు బయటకు కనిపిస్తుండటంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. నేలబావి/వంశధార నదిలో స్నానాలు చేస్తున్నారు. మరుగుదొడ్లకు విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళ ఇబ్బంది పడుతున్నారు.


తాగునీటికి వెతలు

నరసన్నపేట బీసీ బాలుర వసతి గృహాన్ని ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. ఇరుకు గదుల్లో విద్యార్థులు సతమతమవుతున్నారు. తాగునీటి సదుపాయం అంతంతమాత్రమే. సాంఘిక సంక్షేమశాఖ కళాశాల బాలుర వసతి గృహంలోనూ విద్యార్థులు బయట నీరు కొనుగోలు చేసుకుంటున్నారు. పక్కనే గ్రామ పంచాయతీ నీళ్ల ట్యాంకు ఉన్నా కొరత తప్పడంలేదు.

ఊడిపోయిన మెష్‌లు..

సారవకోట సమీకృత వసతిగృహంలో 114 మంది విద్యార్థులు ఉన్నారు. 12 గదులకు సంబంధించి చాలావరకు కిటికీల తలుపులు దెబ్బతిన్నాయి. మెష్‌లు కొంతవరకు ఊడిపోయాయి. పంకాల్లో కొన్ని పని చేయట్లేదు. దోమల బెడదతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

అంతా అధ్వానమే..

బూర్జ మండలం కొల్లివలస గురుకులంలో అయిదు నుంచి ఇంటర్‌ వరకు 640 మంది వసతి పొందుతున్నారు. మంచాలు లేవు. చాలావరకు పంకాలు పని చేయడం లేదు. కిటికీలు, తలుపులు తుప్పు పట్టి పాడయ్యాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులకు నీటి సరఫరా లేక అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్ల వెనక భాగంలో పనికి రాని మొక్కలు పెరిగాయి. గచ్చుకు నాచు పట్టి ఉంది. ప్రహరీ దెబ్బతింది. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఆర్వో ప్లాంట్‌ నిరుపయోగంగా మారింది.

15 మందికి ఒకే పంకా

కవిటి మండలం రాజపురం బీసీ వసతిగృహంలో 110 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరు గదులకు అయిదింట్లో రెండు చొప్పున పంకాలు ఉన్నాయి. ఒక గదిలో ఒకటే ఉంది. ఇక్కడ 15 మంది విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.  


ఇక్కడే 85 మందికి వసతి

రణస్థలం మండలం పాతర్లపల్లిలో శిథిలావస్థకు చేరిన తుపాను రక్షిత భవనంలో బీసీ బాలుర వసతిగృహం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 85 మంది విద్యార్థులు ఉన్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.


సమస్యలతో సావాసం..

కంచిలి మండలం ఎంఎస్‌ పల్లి బీసీ బాలుర వసతిగృహంలో 72 మంది విద్యార్థులు ఉన్నారు. మరుగుదొడ్లు వినియోగించడానికి నీటి సమస్య ఉంది. కొన్ని కిటికీలకు తలుపులు లేకపోవడంతో రాత్రి వేళ దోమలు విజృంభిస్తున్నాయి. పాములు, కుక్కలు పరిసరాల్లో సంచరిస్తున్నాయి.  


విద్యార్థినులు 240 మంది.. మరుగుదొడ్లు ఆరు

శ్రీకాకుళం నగరం మహిళా కళాశాల ప్రాంగణంలోని బీసీ విద్యార్థినుల వసతిగృహం (3)లో 240 మంది ఉన్నారు. తాగునీరు సక్రమంగా రాకపోవడంతో బయట నుంచి క్యాన్లు, సీసాల్లో తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఆరు మరుగుదొడ్లు నిర్వహణలో ఉన్నాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 60 మందికి గదులు, మంచాలు లేక హాల్‌లో నేలపై నిద్రిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని