logo

ఉద్దానం రైతులను ఏం ఉద్ధరించారు..

ఉద్దానం ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పలాస ప్రాంతం. ఉద్యాన పంటలకు పేరు పొందిన ఈ ప్రాంతంలో వర్షాభావంతో రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

Published : 29 Apr 2024 05:46 IST

గిట్టుబాటు ధరను పట్టించుకోని వైకాపా సర్కారు
మంత్రి ఇలాకాలో అయిదేళ్లుగా అవస్థలు

బొడ్డపాడు మాకన్నపల్లి గ్రామాల మధ్య పూతలేని జీడి చెట్లు (అంతర చిత్రంలో పూత మాడిపోయిన దృశ్యం)

ఉద్దానం ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పలాస ప్రాంతం. ఉద్యాన పంటలకు పేరు పొందిన ఈ ప్రాంతంలో వర్షాభావంతో రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి రావడం కోసం అన్నదాతలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోసిన జగన్‌, ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్పారు. తీరా సీఎం అయ్యాక కనీసం వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మంత్రి అప్పలరాజు ఇలాకాలో అయిదేళ్లుగా అవస్థలు పడుతున్నా స్పందన కరవైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలో పండించే జీడి మామిడి, కొబ్బరి, మునగ, పనస పంటలకు స్థానికంగా, విదేశాల్లోనూ మార్కెట్‌ ఉన్నా నాలుగేళ్లుగా మద్దతు ధర లేదని రైతులు వాపోతున్నారు.  

న్యూస్‌టుడే, పలాస, కాశీబుగ్గ


తగ్గిన దిగుబడి..

ప్రస్తుత సీజన్‌లో జీడి మామిడి పంటకు పూత బాగా వచ్చినా సకాలంలో వర్షం పడక పోవటంతో మొత్తం ఎండిపోయింది. దీంతో గతంలో ఎకరాకు 4 నుంచి 5 బస్తాలు దిగుబడి వచ్చేది ఈ ఏడాది ఎకరాకు ఒక్క బస్తా సైతం రాని దుస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు శ్రమపడుతున్నా తెల్ల పురుగు, బంక పురుగు చేరి జీడిపంటను నాశనం చేస్తున్నాయి. 2018 వరకు బస్తాకు రూ.14 వేల వరకు ధర పలికినా అయిదేళ్లుగా జీడిపిక్కలకు మద్దతు ధర రాకపోవడంతో పెట్టుబడి సైతం రాని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది బస్తా ధర రూ.7,500 నుంచి రూ.8 వేలు పలుకుతుండటం, పిక్కలు దిగుబడి లేక పోవడంతో ఏం చేయాలో తెలియడం లేదని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తుపానుల ప్రభావంతో ఇబ్బందుల రెట్టింపు

ఉద్దానంలో జీడి తర్వాత ఆదాయం ఇచ్చే కొబ్బరి పంట పరిస్థితి దయనీయంగా మారింది. తిత్లీ తుపాను తర్వాత చాలా వరకు కొబ్బరి చెట్లు నేలకొరగడం, కొత్తగా వేసిన చెట్లు ఆదాయం ఇవ్వక పోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. వైకాపా హయాంలో జీడి, కొబ్బరి రైతుల్లో కొంతమందికి మాత్రమే పరిహారం అందటంతో మిగతా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాస మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని ఉద్దాన రైతులంతా విన్నవించినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటంతో ఉసూరుమంటూ అరకొరగా పండే పంటలను కాపాడుకుంటున్నారు.

రూ.వెయ్యి హామీ గాలికి

జీడి పంటకు మద్దతు ధర లేకపోవటంతో ప్రభుత్వం రైతులకు పరిహారం అందించేందుకు ముందుకొచ్చింది. జీడి వ్యాపారులంతా 80 కేజీల బస్తాకు రూ.9 వేల చొప్పున రైతులకు చెల్లింపులు చేయాలని, ప్రభుత్వం నుంచి వ్యాపారుల ఖాతాలకు రూ.1000 జమ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన సమయానికి ముందే రైతులంతా జీడి పిక్కలు వ్యాపారులకు అమ్మడంతో అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అప్పగించారు. కానీ అయిదేళ్లుగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగక పోవడంతో జీడిరైతులంతా మద్దతు ధర రూ.16వేలు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దిగుబడి తగ్గింది

గతంతో పోల్చుకుంటే పిక్కల దిగుబడి గణనీయంగా తగ్గింది. వర్షాభావంతో ఎకరాకు 40 కేజీలు సైతం రావడం లేదు. భూమిలో వేడి, పై నుంచి ఎండ వేడిమికి జీడి పూత మాడిపోయి రాలి పోయింది. మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇప్పటివరకు స్పందన లేదు. జీడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

 పోతనపల్లి తాతారావు, బొడ్డపాడు, పలాస మండలం

మొక్కలు సరఫరా చేయలేదు

తిత్లీ తుపాను తర్వాత మొక్కలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా అంటు మొక్కలు సరఫరా చేయక పోవడంతో బాపట్ల నుంచి ఒక్కో మొక్కకు రూ.200 చెల్లించి తెప్పించుకుంటున్నాం. ప్రభుత్వం జీడి తోటల్లో బోర్లు ఏర్పాటు చేస్తే పంటలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.

తామాడ త్రిలోచనరావు, మాజీ సర్పంచ్‌, బొడ్డపాడు, పలాస మండలం

కరవు ప్రాంతంగా ప్రకటించాలి

ఈ ఏడాది జీడి, పనస, కొబ్బరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. దీంతో పలాస మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదు. దీంతో రైతులు ఇటు పంట చేతికందక, అటు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. మద్దతు ధరను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలి. 

తెప్పల అజయ్‌కుమార్‌, కన్వీనర్‌, రాష్ట్ర జీడి రైతు సంఘం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని