logo

హత్య కేసులో ముగ్గురి అరెస్టు

హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్‌లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.

Updated : 25 Apr 2024 06:50 IST

అంగప్పన్‌, కుమరేశన్‌, తమీముల్‌ అన్సారీ

ప్యారిస్‌, న్యూస్‌టుడే: హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్‌లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడు మాత్తూర్‌కి చెందిన నవీన్‌కుమార్‌(27)గా తెలిసింది. అతన్ని హత్య చేసిన కుమరేశన్‌, అంగప్పన్‌, తమీముల్‌ అన్సారీలను అరెస్టు చేశారు. నవీన్‌కుమార్‌ తన స్నేహితుడైన కుమరేశన్‌తో కలిసి తరచూ మద్యం తాగేవాడని, కొద్దిరోజుల కిందట వారి మధ్య నగదు విషయంలో గొడవ జరిగనట్లు తెలిసింది. నవీన్‌కుమార్‌ కోపంతో కుమరేశన్‌ కుమార్తెను హత్య చేసినట్లు తెలిసింది. దీంతో కుమరేశన్‌ తన స్నేహితులతో కలిసి నవీన్‌కుమార్‌ను హత్య చేసినట్లు తేలింది.


రౌడీ దారుణ హత్య

సైదాపేట, న్యూస్‌టుడే: రౌడీ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. పుదుకోట్టై జిల్లా పొన్నమరావతి దగ్గర అరియాండిపట్టి గ్రామంలో కాలువ ఒడ్డున ఒకరు హత్యకు గురయ్యాడని పొన్నమరావతి పోలీసులకు బుధవారం ఉదయం సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి చూశారు. గొంతుకోసిన స్థితిలో ఆ వ్యక్తి హత్యకు గురై కనిపించాడు. దర్యాప్తులో హత్యకు గురైన వ్యక్తి అంజుపులిపట్టికి చెందిన రామన్‌ కుమారుడు అడైక్కప్పన్‌ (24)గా తెలిసింది. భవన నిర్మాణ కార్మికుడైన అతను కోయంబత్తూరులో పని చేస్తున్నట్లు గుర్తించారు. రౌడీయిజం చేస్తుంటాడని, సెలవులో ఊరికి వచ్చినప్పుడు హత్యకు గురైనట్లు తెలిసింది. అడైక్కప్పన్‌పై పలు కేసులు ఉన్నట్లు తేలింది.


యువకుడు..

అరుణ్‌కుమార్‌(పాత చిత్రం)

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: గుమ్మిడిపూండి సమీప కాయలార్‌మేడుకు చెందిన అరుణ్‌కుమార్‌ (26). ఇతన్ని ఓ దాడి కేసుకు సంబంధించి పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసి పుళల్‌ జైల్లో ఉంచారు. ఈ నేపథ్యంలో బెయిల్‌పై బయటకు వచ్చిన అతను బుధవారం ఈగువారుపాళ్యంలో స్నేహితులతో మద్యం తాగుతుండగా ఓ ముఠా మారణాయుధాలతో అతనిపై దాడిచేసి హతమార్చింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.    


వివాహ వేడుకకు వెళ్తుండగా విషాదం

సైదాపేట, న్యూస్‌టుడే: వివాహ వేడుకకు వెళ్తుండగా కారు బోల్తా పడి మహిళ సహా ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుచ్చి కొట్టపట్టు వెంకటేశ్వరనగర్‌ ప్రాంతానికి చెందిన గోపి(57), విజయలక్ష్మి(51) దంపతులు. గోపి మణప్పారై పంచాయతీ యూనియన్‌ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఆయన సోదరుడు కన్నన్‌(47). ఈ ముగ్గురూ కారులో శివకాశిలో జరిగే బంధువుల వివాహ వేడుకలకు బయల్దేరారు. తిరుచ్చి- మదురై జాతీయ రహదారిలో తువరంకురిచ్చి వద్ద కారు రోడ్డు పక్కన బోల్తాకొట్టింది. విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. గోపి, కన్నన్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. కన్నన్‌ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. చికిత్స పొందుతూ గోపి ప్రాణాలు విడిచాడు.


బస్సు బోల్తాపడి ఒకరి మృతి.. 25 మందికి గాయాలు

సైదాపేట, న్యూస్‌టుడే: కుంభకోణం నుంచి తంజావూరుకు 40 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఉదయం ప్రభుత్వ బస్సు బయలుదేరింది. అయ్యంపేట వద్ద ప్రమాదవశాత్తు రోడ్డుపక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో 25 మందికి పైగా ప్రయాణికులు గాయాల పాలయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మి (50) అనే మహిళ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని