logo

పాత గూటికి పన్నీర్‌?

లోక్‌సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

Published : 20 May 2024 06:29 IST

మళ్లీ అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు యత్నాలు
ఎడప్పాడికి మాజీ మంత్రుల సలహా
ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో భారీ మార్పులు

లోక్‌సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తమిళనాడు సహా దక్షణాది రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో మరికొన్ని చోట్ల జరగాల్సి ఉంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తమిళనాడులో డీఎంకే కూటమికి పోటీగా అన్నాడీఎంకే, భాజపాలు వేర్వేరు కూటములు ఏర్పాటు చేసి ఎన్నికలు ఎదుర్కొన్నాయి. దీంతో ఓట్లు చీలి డీఎంకేకే అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంకేకు పోటీగా మెగా కూటమి ఏర్పాటు చేయాలన్న అన్నాడీఎంకే వ్యూహం నెరవేరలేదు. డీఎండీకేతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే పీఎంకేను కూడా కూటమిలోకి తేగలిగి ఉంటే డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చి ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో ఓ పన్నీర్‌సెల్వం ప్రత్యేక వర్గంగా భాజపా కూటమిలో చేరారు. రామనాథఫురంలో పోటీ చేసిన ఆయన విజయం సాధిస్తారా? లేదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

న్యూస్‌టుడే, సైదాపేట

భాజపాతో ఉంటే బాగుండేది..

అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురై ప్రత్యేక పార్టీ పెట్టిన టీటీవీ దినకరన్‌ కూడా భాజపాతో చేతులు కలిపారు. ఇలా ఓపీఎస్, టీటీవీలు అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా చేతులు కలపడం అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బగా అంతా భావిస్తున్నారు. అదే సమయంలో భాజపా కూటమి నుంచి బయటకు వచ్చి ఉండకూడదని అన్నాడీఎంకే ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. భాజపా కూటమిలో ఉండి ఓపీఎస్, టీటీవీలను అక్కున చేర్చుకుని ఉంటే తప్పకుండా కూటమి బలంగా ఉండేదేనని రాజకీయ నిపుణుల భావన. భాజపా కూటమిలో అన్నాడీఎంకే ఉండి పీఎంకే కూడా కూటమిలో చేరుంటే తప్పకుండా డీఎంకేకు సవాల్‌ విసిరుండొచ్చనేది పలువురి అభిప్రాయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్లు చీలి డీఎంకేకు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.

కొత్త సమస్యలు రావొచ్చేమో..

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సమైక్య అన్నాడీఎంకేను మళ్లీ ఏర్పాటు చేస్తే ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మాజీ మంత్రులు దీని గురించి ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి వద్ద మాట్లాడినట్లు సమాచారం. దీనికోసం పన్నీర్‌ను మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని, తద్వారా పార్టీ బలోపేతం అవుతుందని వారు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తెరవెనుక యత్నాలు జరుగుతున్నాయి కూడా. అయితే ఓపీఎస్‌ పార్టీలోకి వస్తే మళ్లీ అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం వస్తుందని భయపడుతున్నారు. ఇప్పటివరకు ఆయన వల్ల ఏర్పడిన సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాని నేపథ్యంలో ఆయనతో కలిసి ఎలా పని చేయాలని కొందరు పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఇలా ఓపీఎస్‌ను మళ్లీ పార్టీలోకి తేవడం గురించి అన్నాడీఎంకేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోతే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని