logo

ఆ నలుగురు నలిగిపోతున్నారు!

శ్మశానవాటిక సమస్య లేని గ్రామం లేదు. అంతిమ సంస్కారం ముగిసే వరకు నిలబడటానికి నిలువ నీడ ఉండదు. దప్పికతీర్చే వసతి కనిపించదు.

Updated : 19 May 2024 05:55 IST

అంతిమ యాత్రలో అవస్థలెన్నో

శ్మశానవాటికల్లో వసతులు కరవు

ఆచంట వేమవరంలో రేవు పరిస్థితి ఇది

పాలకొల్లు, న్యూస్‌టుడే: శ్మశానవాటిక సమస్య లేని గ్రామం లేదు. అంతిమ సంస్కారం ముగిసే వరకు నిలబడటానికి నిలువ నీడ ఉండదు. దప్పికతీర్చే వసతి కనిపించదు. ఇంకొన్ని గ్రామాల్లో అన్నీ ఉన్నా స్నానం చేయడానికి సౌకర్యాల్లేవు. పలు గ్రామాల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఒక్కటే శ్మశానవాటిక ఉండటంతో సరిహద్దు తగాదాలున్నాయి. ఆక్రమణలతో కుచించుకుపోయినవి మరికొన్ని ఉన్నాయి. 

  • యలమంచిలిలో శ్మశానవాటిక లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులను గమనించి విశాఖపట్నంలో స్థిరపడిన దాత తాళ్లూరి సత్యనారాయణ 15 ఏళ్ల క్రితం ఎకరా స్థలం కొనుగోలు చేసి రూ.30 లక్షలు పైబడి వెచ్చించి శ్మశానవాటికను నిర్మించి గ్రామస్థులకు అప్పగించారు. గడిచిన అయిదేళ్లుగా గోదావరి కోతకు గురై దాత అందించిన శ్మశానవాటిక నదీగర్భంలో కలిసిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోయాడు. వసతులు కల్పించలేని ప్రభుత్వం కనీసం దాతలు నిర్మించినవాటికైనా రక్షణ కల్పించడంలో విఫలమవుతోంది.  జిల్లాలోని వందలాది గ్రామాల్లో నెలకొన్న శ్మశానవాటికల సమస్యకు ఇదొక ఉదాహరణ.
  • మొగల్తూరు మండలం పేరుపాలెంనార్తు పంచాయతీ పరిధి నెల్లిపల్లవపాలెంలో శ్మశానవాటికకు మార్గంలేక మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది. శ్మశానవాటికలకు మార్గాన్ని కూడా ఏర్పాటుచేయలేని ప్రభుత్వ పనితీరుకు ఇది అద్దం పడుతోంది.

ఫిర్యాదిచ్చినా పట్టించుకోరా.

పోడూరు, న్యూస్‌టుడే: పోడూరు  రుద్రభూమిలో గ్రామంలోని చెత్తాచెదారం తీసుకెళ్లి వేయడంతో కుచించుకుపోయి కొన్ని సామాజిక వర్గాలవారికి చోటులేని పరిస్థితి. కవిటం, పోడూరు తదితర గ్రామాల్లో దాతల దాతృత్వంతో ఏర్పడిన శ్మశానవాటికలు తప్ప ప్రభుత్వం సౌకర్యాలు కల్పించినవి లేవు. వేడంగి, పి.పోలవరం, మట్టపర్రు తదితర గ్రామాల్లో రుద్రభూమి కోసం సామాజికవర్గాల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. అధికారుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగాయే తప్ప సమస్యలైతే పరిష్కారం కాలేదు. 

పోడూరు శ్మశానవాటికలో చెత్తాచెదారం దాటుకొని మృతదేహాన్ని తీసుకువస్తూ..

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట, కోడేరు గోదావరి తీరం మినహా మిగిలిన 10 గ్రామాల్లో కనీస వసతులు లేవు. తాగడానికి మంచి నీళ్ల మాట ఎలా ఉన్నా, స్నానం చేయడానికి నీళ్లు కూడా లేని దుస్థితి. కూర్చోవడానికి షెడ్లు లేకుండా పోయాయి. ఆచంట వేమవరంలో  నీళ్లు కూడా లేక కిలోమీటరున్నర నుంచి డబ్బాలతో నీళ్లు తెచ్చుకుని స్నానాలు చేయాల్సిన పరిస్థితి.

ఉమ్మడి జిల్లాలో గత అయిదేళ్లలో ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించిన స్పందన, ఇంటింటికీ మన ప్రభుత్వం కార్యక్రమాల్లో వందలాది వినతిపత్రాలు శ్మశానవాటికలకు సంబంధించినవే వచ్చినా అన్నింటినీ బుట్ట దాఖలు చేసిన దుస్థితి. ఫలితంగా అంతిమయాత్రకు వెళ్తున్న ఆ నలుగురుతో పాటు వెంట వెళ్లినవారంతా నలిగిపోతున్నారు. కొన్ని గ్రామాలతోపాటు పట్టణాల్లో శ్మశానవాటికలనే చెత్తను డంపింగ్‌ చేయడానికి ఉపయోగిస్తున్నారు. పాలకొల్లు పట్టణంలో రూ.కోట్లు వెచ్చించి తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన కైలాసవనం నిర్వహణ వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. 

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: సగంచెరువు, లంకలకోడేరు గ్రామాల్లో శ్మశానం పక్కనే డంపింగ్‌ యార్డ్‌ ఉండటంతో అంతిమ సంస్కారాలకు వీలు లేకుండా ఉంది. కూర్చోవడానికి సదుపాయాలు లేవు. 
నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణం పొన్నపల్లి వద్ద ఉన్న శ్మశానవాటికలో సరైన వసతి సౌకర్యం లేదు. గోదావరికి వరదొస్తే ఇబ్బందులు ఎదుర్కొనాల్సిందే. ఇక్కడ భవన నిర్మాణం పూర్తిచేయలేదు. మొగల్తూరు, పడమటిపాలెం తదితర ప్రాంతాల్లో స్నానాలు చేసేందుకు కాలువల వద్దకు వెళ్లాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని