logo

రైల్వేలైను మారుస్తుంటే ఎంపీ మిథున్‌రెడ్డి ఏం చేశారు?

కడప-బెంగళూరు రైల్వేలైను మారుస్తుంటే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి చూస్తూ ఎందుకు ఉండిపోయారని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.  రాయచోటి పట్టణంలోని ఓ కల్యాణమండపంలో ఆదివారం వివిధ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 29 Apr 2024 04:03 IST

భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపు

మాట్లాడుతున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పక్కన నాయకులు

రాయచోటి, న్యూస్‌టుడే, కడప-బెంగళూరు రైల్వేలైను మారుస్తుంటే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి చూస్తూ ఎందుకు ఉండిపోయారని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.  రాయచోటి పట్టణంలోని ఓ కల్యాణమండపంలో ఆదివారం వివిధ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప-బెంగళూరు మధ్య కేవలం 355 కిలోమీటర్ల రైల్వేలైన్‌ నిర్మాణానికి గత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు చేపట్టిందన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.159 కోట్లు చెల్లించామన్నారు. పెండ్లిమర్రి వరకు చేసిన పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయన్నారు. ఎంపీగా ఉన్న మిథున్‌రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పనులెందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటా నిధులు కేటాయించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోగా, రైల్వేలైనును రాయచోటి, మదనపల్లె మీదుగా కాకుండా పులివెందుల, ముదిగుబ్బ మీదుగా తీసుకెళ్లాలని వైకాపా ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు సిఫార్సు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి ఎందుకు అడ్డుకోలేకపోయారని ధ్వజమెత్తారు. ఎస్జీటీ అనుమతి లేకుండా పుంగనూరు, మదనపల్లెలో మూడు ప్రాజెక్టులు తీసుకొచ్చి రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, తాను సీఎంగా ఉన్న సమయంలో 2.60 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించానన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు అన్ని సామాజిక వర్గాలు, యువత కృషిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి, తెదేపా నాయకులు, ప్రైవేటు విద్యాసంస్థల రాష్ట్ర ఐకాస నాయకులు, కురభ సంఘం నాయకులు, ముస్లిం మైనార్టీలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని