logo

ఆయిల్‌ ట్యాంకర్ల కుంభకోణంలో నిందితుడి అరెస్టు

ఆయిల్‌ ట్యాంకర్లే లేకుండా, వాటికి ఆర్‌సీలు సృష్టించిన కేసులో విజయవాడ కొండపల్లికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిని గూడూరు రూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నందిగామ ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే విఠల్‌..

Published : 23 Jan 2022 03:39 IST

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆయిల్‌ ట్యాంకర్లే లేకుండా, వాటికి ఆర్‌సీలు సృష్టించిన కేసులో విజయవాడ కొండపల్లికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిని గూడూరు రూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నందిగామ ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే విఠల్‌.. ఈ మొత్తం కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. ఈయన ఎంవీఐ, ఆర్టీవో పాత్ర పోషించి, వారి లాగిన్‌ ఐడీ ద్వారా ఈ కుంభకోణానికి తెర తీసినట్లు స్పష్టమైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోయర్‌ సుభాన్‌సిరి రవాణాశాఖ కార్యాలయంలో ఈ కుంభకోణానికి తొలి అడుగు పడింది. అక్కడి సిబ్బంది.. లేని ట్యాంకర్ల వివరాలను అప్‌లోడ్‌ చేసి ఎన్‌ఓసీలు జారీ చేశారు. వీటి ఆధారంగా కృష్ణాజిల్లాకు లేని 11 ఆయిల్‌ ట్యాంకర్లు బదిలీ అయ్యాయి. విద్యాధరపురం లేబర్‌కాలనీకి చెందిన సయ్యద్‌ గౌస్‌ మొహిద్దీన్‌ పేరుతో 5, కొండపల్లికి చెందిన సత్యనారాయణ పేరుతో మరో 5, గొల్లపూడికి చెందిన శివరామప్రసాద్‌ పేరుతో 1 చొప్పున మొత్తం 11 ఆయిల్‌ ట్యాంకర్లు రిజిస్టర్‌ అయ్యాయి. ఈ వ్యవహారం మొత్తాన్ని నందిగామ ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే విఠల్‌ తెర వెనుక ఉండి నడిపించారు. రవాణాశాఖ అధికారుల అంతర్గత విచారణలో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘటనపై కృష్ణా జిల్లా ఉపరవాణా కమిషనర్‌ ఎం.పురేంద్ర సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పరారీలోనే నిందితులు: కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రధాన సూత్రధారి విఠల్‌తో పాటు సయ్యద్‌ గౌస్‌ మొహిద్దీన్‌, సత్యనారాయణ, శివరామప్రసాద్‌లు పరారీలో ఉన్నారు. వీరిలో సత్యనారాయణను గూడూరు రూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం విజయవాడ పోలీసులు గాలింపు చేపట్టారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా గూడూరు రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి సత్యనారాయణను పీటీ వారెంటుపై విజయవాడకు తీసుకువచ్చేందుకు సూర్యారావుపేట పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇతడిని న్యాయస్థానం అనుమతితో విచారిస్తే.. మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని