logo

కాబోయే అమ్మ ... కాస్త జాగ్రత్త ..!

హైదరాబాద్‌లో సంక్రాంతి వేడుకలు చేసుకుని విజయవాడ నగరానికి వచ్చిన గర్భిణికి వైరస్‌ సోకింది. ఆమెకు నాలుగో నెల గర్భం కావడంతో చికిత్స చేయించారు. ఇదే నగరానికి చెందిన మరో గర్భిణి ప్రసవానికి 20 రోజుల ముందు వైరస్‌కు చిక్కి

Updated : 23 Jan 2022 04:28 IST

అమరావతి ఫీచర్స్‌, న్యూస్‌టుడే

హైదరాబాద్‌లో సంక్రాంతి వేడుకలు చేసుకుని విజయవాడ నగరానికి వచ్చిన గర్భిణికి వైరస్‌ సోకింది. ఆమెకు నాలుగో నెల గర్భం కావడంతో చికిత్స చేయించారు. ఇదే నగరానికి చెందిన మరో గర్భిణి ప్రసవానికి 20 రోజుల ముందు వైరస్‌కు చిక్కి కార్పోరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం ప్రాంతాల్లోనూ పలువురు గర్భిణులు వైరస్‌ బారినపడ్డారు.

మాతృత్వం ఓ వరం. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో అమ్మకు ఎదురయ్యే సవాళ్లు.. ఇబ్బందులు వర్ణనాతీతం. రక్తహీనత, పోషకాహారలేమితో సతమతమయ్యే అమ్మలు కొవిడ్‌ రూపంలో గత రెండేళ్ల నుంచి సరికొత్త సవాలుకు ఎదురీదుతున్నారు. కరోనా ఉధృతి పెరుగుతుండటంతో గర్భిణులు త్వరగా వైరస్‌ బారినపడుతున్నారు. నెలవారీ పరీక్షల కోసం వెళ్తున్న క్రమంలో మహమ్మారికి చిక్కుతున్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల నేపథ్యంలో సొంతూళ్లు, బంధువుల వద్దకు చాలామంది వెళ్లి వచ్చారు. జన సమూహాలతో కలసి సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మరికొందరు అజాగ్రత్తతో వైరస్‌ బారినపడి ఇబ్బందిపడుతున్నారు.

మారిన నిబంధన.. గర్భిణులకు అవస్థ..

కొవిడ్‌ మొదటి, రెండోదశలో ప్రసవానికి 15 రోజుల ముందు తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్ని కాబోయే అమ్మలకు చేసేవారు. కొవిడ్‌ నిర్ధారణ అయితే ప్రత్యేక వార్డుల్లో వారికి చికిత్స అందించేవారు. పాజిటివ్‌తో ప్రసవమైనా శిశువుల నమునాల్ని వెంటనే సేకరించి తల్లీబిడ్డకు ఏం జరగకుండా చూసేవారు. ప్రస్తుత దశలో ఉన్న నిబంధన గర్భిణులకు కాస్తంత చికాకుపెట్టేదిలా ఉంది. కొవిడ్‌ లక్షణాలు ఉంటేనే పరీక్ష చేయాలని లేకుంటే చేయవద్దని మార్గదర్శకాలు అందాయి. ఒమిక్రాన్‌తోపాటు మూడోదశలో కరోనా లక్షణాలు పెద్దగా బయటపడట్లేదు. బయటకు ఆరోగ్యవంతంగా కనిపించినా లోలోపల మానసిక, శారీరక రుగ్మతలు ఉంటున్నాయని పాజిటివ్‌ వ్యక్తులు చెబుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి..

కొవిడ్‌ బారినపడి గుంటూరు సమగ్రాసుపత్రిలో 20 మంది గర్భిణులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జె.యాస్మిన్‌ తెలిపారు. ఇంకా ఏంచెప్పారంటే...

* పండుగలకు దూర ప్రాంతాలకు వెళ్లడం, పెళ్లిళ్లు, సీమంతాలు, బంధువుల ఇళ్లకు వెళ్లడం తగ్గించుకోవాలి.

* ఇంట్లో కూడా గర్భిణులు ప్రత్యేక గదిలో ఉండటం ఆరోగ్యరీత్యా శ్రేయస్కరం.

* కొవిడ్‌ కారణంగా పరీక్షల పేరుతో ఎక్కువసార్లు ఆసుపత్రికి వెళ్లినా ఇబ్బందులే. ముందే వైద్యులతో మాట్లాడి చికిత్స పొందాలి.

*మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఏ లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. రి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చికెన్‌, చేపలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి

* కరోనా బారినపడి నిర్లక్ష్యంచేస్తే న్యూమోనియా సోకే ప్రమాదం ఉంటుంది. ఇది తల్లీబిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వైరస్‌ సోకిన వారికి మెరుగైన చికిత్సను గుంటూరు సమగ్రాసుపత్రితోపాటు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలు, సామాజిక వైద్యశాలల్లో అందిస్తున్నాం. వాటిలోచేరి సరైన చికిత్స పొందాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని