ప్రోత్సాహమనె.. పొగబెట్టె!

దేశంలో రాష్ట్రాల్లో...  అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి.

Published : 27 Apr 2024 06:05 IST

రాయితీలు ఇస్తానని అదనపు భారాల మోత
విపరీతంగా పెరిగిన అన్నిరకాల ఛార్జీలు, ధరలు
పరిశ్రమలకు ఐదేళ్లలో చుక్కలు చూపిన జగన్‌ సర్కారు
తట్టుకోలేక పారిపోయిన పారిశ్రామికవేత్తలు


దేశంలో రాష్ట్రాల్లో...  అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి...

కానీ...

ఆంధ్రావని రివర్స్‌ వీరుడి తీరే వేరు... మ్యానిఫెస్టోలో రాయితీలని ఆశపెట్టారు... గద్దెనెక్కాక రాచిరంపాన పెట్టారు... గతంలో కొన్న భూమికీ ధరలు పెంచి, ఇప్పుడు మళ్లీ కట్టమన్నారు... ఆయనగారి ఛార్జీల మోతను    తట్టుకోలేక... పరిశ్రమలు కాస్తా... పక్క రాష్ట్రాల బాటపట్టాయి...


పరిశ్రమల స్థాపనకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలకుతోడు ఏపీఐడీసీని పునరుద్ధరించి... నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం! ఈ మాటలు ఎక్కడో చదివినట్లు అనిపిస్తోందా?  పోనీ.. ఎవరినోటనో విన్నట్లైనా గుర్తుందా? ఉండకపోవచ్చు! ఎందుకంటే... ఈ మాటలు చెప్పిన ఆయనే వాటిని మరచిపోయారు.  
ఐదేళ్ల కిందట 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోలోని హామీ ఇది! పార్టీ తరఫున పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన భరోసా ఇది. ఏటా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇస్తానని చెప్పి రెండుసార్లే బటన్‌ నొక్కి 2020లో  రూ.962 కోట్లు, 2021లో స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.684 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత మూడేళ్లలో చెల్లించాల్సిన రూ.2,500 కోట్ల రాయితీల సంగతి మరచిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామంటూ చెప్పిన మాటలు కూడా అమలు చేయకుండా మూడోసారీ మాట తప్పారు... జగన్‌!


చెప్పింది: భూములపై రాయితీ
చేసింది: ధరాభారం

పారిశ్రామికవేత్తలకు రాయితీపై భూములు ఇస్తామని వైకాపా మ్యానిఫెస్టోలో చెప్పింది. కానీ... రాయితీపై కొత్తగా భూములిచ్చే మాట దేవుడెరుగు... పారిశ్రామిక వాడల్లో స్థలాల ధరలను జగన్‌ సర్కారు అమాంతం పెంచింది. అప్పటికే భూములు పొందిన పారిశ్రామికవేత్తలూ పెంచిన ధర మేరకు మిగిలిన మొత్తాన్ని కట్టాలంది. ఆ మొత్తాన్ని చెల్లించకుంటే ఇచ్చిన భూములు వెనక్కు తీసుకుంటామని బెదిరించింది. పరిశ్రమలకు భూముల్విడంలో ‘లీజు కమ్‌ బై’ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో భూములకు పూర్తి ధర చెల్లించినా యాజమాన్య హక్కులు మాత్రం పరిశ్రమలకు బదిలీ కాలేదు.

  • కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడలో ఎకరా ధరను   రూ.88 లక్షల చొప్పున వైకాపా ప్రభుత్వం నిర్దేశించింది. గత ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇక్కడ ఎకరా రూ.8 లక్షల చొప్పున పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. వైకాపా ప్రభుత్వం ఏకంగా 11 రెట్లు ధర పెంచి పారిశ్రామికవేత్తలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపింది.
  • కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక పార్కులో గత తెదేపా ప్రభుత్వం ఎకరా  రూ.16.5 లక్షల లెక్కన పరిశ్రమలకు భూమి కేటాయించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఎకరా ధర రూ.80 లక్షలకు పెంచింది. అంతేగాకుండా గతంలో భూములు పొందిన పారిశ్రామికవేత్తలకూ నోటీసులు పంపింది. పెంచిన మొత్తాన్ని చెల్లించకుంటే గత కేటాయింపులను రద్దు చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో చాలామంది చిన్న పరిశ్రమల నిర్వాహకులు పెట్టుబడుల   ప్రతిపాదన విరమించుకుని, పొరుగు రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోయారు.
  • తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని  అత్తివరం పారిశ్రామిక పార్కులోనూ ఇదే  పరిస్థితి. ఇక్కడ గత ప్రభుత్వం ఎకరా  రూ.14 లక్షల చొప్పున భూములను పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది. జగన్‌ సర్కారు రాగానే ఆ మొత్తాన్ని రూ.58.68 లక్షలకు పెంచింది. ఇదే తీరులో ఏపీఐఐసీలో అందుబాటులో ఉన్న సుమారు 45 వేల ఎకరాలను ధరలు పెంచి విక్రయిస్తుండటంతో కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వారికి భూముల కొనుగోలుకే పెట్టుబడి మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రెండు (2020-23, 2023-27) పారిశ్రామిక పాలసీలను తీసుకొచ్చింది. తెదేపా సర్కారు 2015-20 పారిశ్రామిక    పాలసీలో ప్రకటించిన పరిశ్రమలకు అవుట్‌ రైట్‌ సేల్స్‌ (ఓఆర్‌ఎస్‌) కింద భూములను కేటాయించే నిబంధనకు వైకాపా ప్రభుత్వం మూర్పులు చేసింది. ముందుగా లీజు విధానంలో కేటాయించి.. పదేళ్ల నిర్వహణ తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసే(లీజు కం బై) పద్ధతిని తీసుకొచ్చింది. ఈ లీజు విధానంతో భూముల కొనుగోలుకు చేసే ఖర్చు పారిశ్రామికవేత్తలకు మిగులుతుందని ప్రభుత్వం చెప్పింది. పూర్తి మొత్తాన్ని అప్‌ఫ్రంట్‌ పేరుతో వసూలు చేసుకుని పదేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్‌ చేస్తామంది. దీనికి వ్యతిరేకత రావడంతో ఎన్నికలకు ముందు గత ఏడాది నవంబరులో లీజు విధానానికి బదులుగా ఓఆర్‌ఎస్‌   పద్ధతినే అమలు చేస్తున్నట్లు సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. భూముల    ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో భూములు తీసుకునేవారు లేక 44,767 ఎకరాలు మిగిలిపోయాయి.

చెప్పింది... విద్యుత్‌ ఛార్జీల రాయితీ
చేసింది... అదనపు వాయింపు

  • పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌ వినియోగదారుల నుంచి యూనిట్‌కు 6 పైసల చొప్పున వసూలు చేసే విద్యుత్‌ సుంకాన్ని రూపాయికి పెంచుతూ (1,667 శాతం) జగన్‌ సర్కారు 2022 ఏప్రిల్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై ఏటా రూ.2,600 కోట్ల అదనపు భారం పడింది.
  • 2014-19లో అప్పట్లో వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా యూనిట్‌కు 0.22 పైసల చొప్పున ట్రూఅప్‌ కింద వసూలు చేస్తోంది. ఐదేళ్లలో వాడిన విద్యుత్‌ను లెక్కించి.. ఆ మొత్తాన్ని పరిశ్రమల నుంచి 36 నెలల్లో రాబడుతోంది.
  • 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద యూనిట్‌కు 0.63 పైసల చొప్పున వసూలు చేస్తోంది.
  • 2023-24లో వినియోగించిన విద్యుత్‌కు యూనిట్‌కు 40 పైసల చొప్పున వసూలు చేసింది. యూనిట్‌కు రూ.1.10 చొప్పున వసూలుకు అనుమతించాలని ఏపీఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. ఈ ప్రకారం మరో 70 పైసల భారం పడే అవకాశం లేకపోలేదు.
  • టారిఫ్‌ ప్రకారం యూనిట్‌కు వసూలు చేసే మొత్తం రూ.5.85కు ఈ అదనపు బాదుడు కలిపితే మొత్తం రూ.8.10 (ఇందులో గతంలో వసూలు చేసే 6 పైసలు తగ్గించాలి) అవుతుంది. ఇంకా పెండింగ్‌లో ఉన్న 70 పైసలు కూడా కలిపితే.. జగన్‌ సర్కారు ఐదేళ్లలో పరిశ్రమలపై యూనిట్‌కు రూ.2.89 చొప్పున భారాన్ని వేసింది.
  • ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీల ప్రకారం యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇవ్వాల్సిన విద్యుత్‌ రాయితీలను కూడా ఐదేళ్లలో చెల్లించిన పాపాన పోలేదు.

వైకాపా ఉపాధి కేంద్రంగా ఏపీఐడీసీ

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఏపీఐడీసీ)ను పునరుద్ధరించి నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతామని జగన్‌ చెబితే నిజమేనని ఆశావహులు అప్పట్లో నమ్మేశారు. ఐదేళ్లయ్యే సరికి జగన్‌ తెచ్చే కొత్త అధ్యాయం ఏంటో వారికి అనుభవమైంది. ఏపీఐడీసీని పునరుద్ధరించి జగన్‌ సాధించిందేంటి? విజయవాడ నగర డిప్యూటీ మేయర్‌ పదవిని ఇవ్వలేకపోయిన కార్పొరేటర్‌ను ఆ సంస్థకు ఛైర్మన్‌గా, మరో 11 మందికి డైరెక్టర్లుగా ‘రాజకీయ ఉపాధి’ కల్పించడమే జగన్‌ చేసిన ఉద్ధరణ! రాష్ట్రంలో మధ్యతరహా, భారీ పరిశ్రమల ప్రణాళికాబద్ధ అభివృద్ధి.. సమగ్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం వ్యవస్థాపక ప్రతిభావంతులను   ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేయాల్సిన సంస్థను... రాజకీయ పునరావాసంగా మార్చిన ఘనత జగన్‌కే చెల్లుతుంది. కనీసం సంస్థ కార్యకలాపాలు తెలుసుకుందామంటే... ఆ సంస్థ పేరిట ఉన్న వెబ్‌సైట్‌ కూడా   పనిచేయడం లేదు. పారిశ్రామికాభివృద్ధిపై జగన్‌ చిత్తశుద్ధికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం!


చెప్పింది: పన్నుల్లో రాయితీ
చేసింది: ఫీజుల వాత

జగన్‌ సర్కార్‌ రివర్స్‌ పాలనతో ఐదేళ్లలో పరిశ్రమలపై ఆస్తి పన్ను, నీటి పన్ను, వార్షిక లైసెన్సు ఫీజుల పేరుతో భారాన్ని మోపింది. గతంలో భవనాల వరకే పన్ను లెక్కించే
విధానానికి బదులు పూర్తి విస్తీర్ణానికి (ఖాళీ ప్రదేశానికి కూడా) పన్ను లెక్కించే విధానాన్ని తెచ్చింది. అది చాలదన్నట్లు ఏటా 5 శాతం పన్ను పెంపు వర్తించేలా నిబంధన విధించింది. దీనివల్ల ఒక మోస్తరు పరిశ్రమపై ఏటా రూ.30 వేలకు పైగా అదనపు భారం పడింది. దీంతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెల్లించాల్సిన వార్షిక లైసెన్సు ఫీజులనూ భారీగా పెంచేసింది.

  • పరిశ్రమల నుంచి వసూలు చేసే వార్షిక లైసెన్సు ఫీజులను పెంచుతూ 2023లో జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీవోలు ఇచ్చిన తేదీ నుంచి కాకుండా.. 2019 నుంచి లెక్కగట్టి మరీ (రెట్రాస్పెక్టివ్‌) వసూలు చేసింది. కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ, బాయిలర్‌, ఫ్యాక్టరీ, కార్మికశాఖతో పాటు వివిధ విభాగాల లైసెన్సు ఫీజులు గతంతో పోలిస్తే దాదాపు మూడురెట్లు పెరిగాయి.
  • అగ్నిమాపక శాఖ నుంచి కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ కోసం తీసుకునే అనుమతికి ఏడాదికి రూ.లక్ష చొప్పున చెల్లించే ఫీజు మొత్తాన్ని  రూ.8 లక్షలకు పెంచింది. ఒకేసారి 8 రెట్లు పెంచి ఏటా రూ.7 లక్షల అదనపు భారాన్ని పరిశ్రమలపై వేసింది. ఈ లైసెన్సు ఉంటేనే మిగిలిన శాఖలు లైసెన్సులు రెన్యూవల్‌ చేస్తాయి.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని