icon icon icon
icon icon icon

Chhattisgarh: కేవలం 94 ఓట్లతో ఓడిపోయిన డిప్యూటీ సీఎం..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ తాజా ఎన్నికల్లో అత్యల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో భూపేశ్ బఘేల్ సర్కారుకు గట్టి షాక్‌ తగిలిన విషయం తెలిసిందే.

Updated : 04 Dec 2023 10:51 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Assembly Election Results) కాంగ్రెస్‌ (Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఈ పార్టీ దారుణంగా ఓటమిపాలైంది. డిప్యూటీ సీఎం సహా భూపేశ్ బఘేల్‌ సర్కారులో 9 మంది మంత్రులకు పరాజయం తప్పలేదు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ (TS Singh Deo) అయితే, కేవలం వంద కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

ఈసీ గణాంకాల ప్రకారం.. అంబికాపుర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సింగ్‌ దేవ్‌కు తాజా ఎన్నికల్లో 90,686 ఓట్లు వచ్చాయి. ఇక్కడ భాజపా అభ్యర్థి రాజేశ్‌ అగర్వాల్‌కు 90,780 ఓట్లు పోలయ్యాయి. అంటే కేవలం 94 ఓట్ల తేడాతో సింగ్‌ దేవ్‌ ఓడిపోయారు. ఇక, ఈయనతో పాటు హోంమంత్రి తమ్రాధ్వజ్‌ సాహు, వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబే సహా మొత్తంగా 9 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు.

అత్యల్ప మెజార్టీ.. 16 ఓట్లు..

ఇక, తాజా ఫలితాల్లో మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. రాయ్‌పుర్‌ దక్షిణ నియోజకవర్గంలో తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 67,179 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు, కాంకేర్‌ అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశారాం నేతమ్‌ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై కేవలం 16 ఓట్ల తేడాతో గెలిచారు.

కారుకు బ్రేకులు ఎందుకు పడ్డాయబ్బా..!

ఆదివారం వెలువడిన ఫలితాల్లో భాజపా ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. 90 సీట్లున్న అసెంబ్లీలో 2003లో 50, 2008లో 50, 2013లో 49 సీట్లు గెలుచుకొని సాధారణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాషాయదళం మునుపెన్నడూ లేనంతగా మెజార్టీని సొంతం చేసుకుంది. ఇక, గత నాలుగు ఎన్నికల్లో ఎన్నడూలేనంత తక్కువకు కాంగ్రెస్‌ సీట్లు పడిపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img