icon icon icon
icon icon icon

BRS: కారుకు బ్రేకులు ఎందుకు పడ్డాయబ్బా..!

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత పదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వచ్చే సానుకూల ఓటుతో తప్పక విజయం సాధిస్తామనే ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి.

Updated : 04 Dec 2023 06:57 IST

39 స్థానాలకే పరిమితం
ఉత్తర, దక్షిణ తెలంగాణలో అధిక స్థానాల్లో పరాజయం
పార్టీలో అంతర్మథనం

ఈనాడు, హైదరాబాద్‌: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితికి(BRS) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత పదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వచ్చే సానుకూల ఓటుతో తప్పక విజయం సాధిస్తామనే ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించాలనే పట్టుదలతో ఉన్న ఆ పార్టీ లక్ష్యాన్ని ఓటర్లు దెబ్బతీశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో భారాసకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలు ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోపాలతోపాటు ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఫలితంగా 119 స్థానాలకు 39 స్థానాలకే పరిమితమైన భారాస రెండోస్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో గెలిచిన 49 స్థానాలను ఆ పార్టీ కోల్పోయింది. సీఎం కేసీఆర్‌(KCR) రెండుచోట్ల పోటీచేసి కామారెడ్డిలో ఓడిపోగా, ఆరుగురు మంత్రులకు పరాజయం ఎదురయింది. ఊహించని ఈ ఫలితాలపై ఆ పార్టీ అధిష్ఠానం, శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది.

బలం అనుకున్న పథకాలే..

ప్రభుత్వ పథకాలు, విధానాలు లాభిస్తాయనే భారాస నమ్మకం ఈ దఫా వమ్మయింది. పైగా వాటిపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రధానంగా దళితబంధు తీవ్ర ప్రభావం చూపిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దీని ద్వారా కొద్దిమందికే లబ్ధిచేకూరడం, సాయం అందని వారిలో అసంతృప్తి పెంచింది. పైపెచ్చు ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులతో సన్నిహితంగా ఉండే వారికి మాత్రమే ప్రయోజనం కల్పించారనే ఆరోపణలు, కొన్నిచోట్ల నాయకులు చేతివాటం ప్రదర్శించారనే విమర్శలు వ్యతిరేకతను పెంచాయని తెలుస్తోంది. బీసీబంధును ప్రకటించినా..దాన్నీ కొద్దిమందికే ఇచ్చారు. ఇదీ మిగిలిన వారిలో ఆగ్రహానికి కారణమయిందనే విమర్శలున్నాయి.


‘డబుల్‌’ ట్రబుల్‌

భారాస ప్రభుత్వం అమలుచేసిన మరో ముఖ్య పథకం రెండు పడక గదుల ఇళ్లు. ఇవీ కొద్దిమందికే దక్కాయి. ఇందులోనూ నాయకుల జోక్యం, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దరఖాస్తులకు, కేటాయించిన ఇళ్ల సంఖ్యకు పొంతనలేకపోవడం వంటివి పార్టీపై వ్యతిరేకత గూడుకట్టుకునేలా చేశాయి. బీసీబంధు ప్రకటించాక చాలామంది సొంత స్థలాల్లో ఇంటి నిర్మాణాలు ప్రారంభించినా డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

  • రైతుబంధుతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరినప్పటికీ..గ్రామాల్లో వ్యవసాయంచేయని భూస్వాములకు అధిక మొత్తం అందుతుండటం సన్న, చిన్నకారు రైతులకు రుచించలేదు. మరోవైపు రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడం, రుణమాఫీ కింద ఇచ్చిన మొత్తం వడ్డీకే ఎక్కువగా సరిపోయిందనే అభిప్రాయం బలంగా నాటుకుంది. ఇలా రకరకాల అసంతృప్తులు భారాస ఓటమికి కారణమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రైతుబంధు నిధులు విడుదలయితే కొంత ఊరట దక్కుతుందని భావించినా, అది నిలిచిపోవడం శరాఘాతమయింది. ధరణి పోర్టల్‌ సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోవడమూ ప్రజల్లో అసంతృప్తిని పెంచింది.
  • పీఆర్‌సీ జాప్యంచేయడం, 5శాతమే మధ్యంతర భృతి ప్రకటించడం, డీఏలు విడుదల చేయకపోవడం, వైద్య బిల్లులు, పీఎఫ్‌ వంటివి చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరగడంతో ఉద్యోగుల్లోనూ అసంతృప్తి నెలకొంది.

నిరుద్యోగులు, యువతలో అసంతృప్తి

ఉద్యోగ నియామకాల్లో జాప్యం, టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీల వల్ల పోటీ పరీక్షలకు సిద్ధపడిన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా గ్రూపు-1 పరీక్ష రెండుసార్లు రద్దు కావడం ఇతరత్రా పరిణామాలతో వారు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. పోటీ పరీక్షలకు హాజరైన వారిలో ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాల వారు కావడం వల్ల గ్రామీణ జిల్లాల్లోని ఫలితాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కన్పించింది. మరోవైపు విపక్ష కాంగ్రెస్‌ జాబ్‌ కాలెండర్‌ను ప్రకటించడం వారిలో ఆశలు రేపింది. ‘మా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని, టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేస్తామని’ హామీ ఇచ్చినా ఫలితం ఇవ్వలేదు.

సిట్టింగులపై వ్యతిరేకత

మొదటి దఫా అధికారంలో ఉన్నప్పుడు 2018లో కేసీఆర్‌ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పుడున్న సిట్టింగుల్లో అయిదుగురు మినహా అందరికీ సీట్లు ఇవ్వడం అధికార పార్టీకి లాభించింది. దీంతో మూడోసారి ఎన్నికలకు వెళ్లే సమయంలోనూ సీఎం కేసీఆర్‌ అదే సూత్రాన్ని అమలుచేశారు. పన్నెండు మంది మినహా సిట్టింగులందరికీ టికెట్లు కేటాయించారు. వీరిలో చాలా మందిపై వ్యతిరేకత ఉంది. ఇసుక, మట్టిదందాలు, పోలీసు సహా ఇతరుల పోస్టింగుల్లో లాబీయింగ్‌, భూకబ్జాలు వంటి ఆరోపణలతోపాటు వారి వ్యవహారశైలిపైనా విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేల అనుచరులు, ద్వితీయశ్రేణి నేతలు దళితబంధు తదితర పథకాల్లో చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. ఇలాంటి వారికి టికెట్లు ఇవ్వవద్దని పార్టీ ముఖ్య నేతలు కొందరు అధిష్ఠానాన్ని కోరినట్టు సమాచారం. అయితే పదేళ్లుగా వారు నియోజకవర్గాల్లో పట్టు సాధించినందున మళ్లీ గెలుస్తారనే భావన, వారికి టికెట్లు ఇవ్వకపోతే ఇతర పార్టీల్లోకి వెళతారనే అనుమానంతో అధిష్ఠానం వారివైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


కాళేశ్వరంపై వ్యతిరేక ప్రచారం

కాళేశ్వరం ఎత్తిపోతల గురించి విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశమున్నా మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో ఆ అవకాశాన్ని భారాస కోల్పోయింది. పైపెచ్చు వ్యతిరేక ప్రచారం జరిగింది. ఎన్నికల సమయంలో ఈ అంశం తీవ్ర నష్టం కలిగించిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.


జీహెచ్‌ఎంసీ ఫలితాలతో ఊరట

త్తర, దక్షిణ తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాకపోయినా, హైదరాబాద్‌ మహానగర పరిధిలో(GHMC) మెజారిటీ సీట్లు దక్కించుకోవడం ఆ పార్టీకి ఊరట కలిగించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అభివృద్ధి పనులు, శాంతిభద్రతల పరిరక్షణ, రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, మౌలిక వసతుల కల్పన, పార్కుల ఆధునికీకరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం ఇలా పలు కారణాలు భారాస అభ్యర్థుల విజయానికి దోహదం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img