icon icon icon
icon icon icon

Rahul Gandhi: ‘కలిసి కన్పించడం కాదు.. కలిసే ఉన్నాం’.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌పై రాహుల్‌ గాంధీ వ్యాఖ్య

రాజస్థాన్‌ (Rajasthan)లో కాంగ్రెస్‌ నేతలంతా ఐకమత్యంగానే ఉన్నారని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. తాజాగా ఆయన సీఎం అశోక్‌ గహ్లోత్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌తో కలిసి కన్పించారు.

Published : 16 Nov 2023 16:13 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajasthan)లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్‌ దగ్గరపడుతున్న వేళ పార్టీలో అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ (Congress) గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot).. మరో సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot)తో కలిసి చర్చిస్తున్న ఫొటోను షేర్‌ చేసి పార్టీ ఐక్యంగానే ఉందని సంకేతాలిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కూడా మరోసారి ఐక్యతా రాగం వినిపించారు. గహ్లోత్‌, పైలట్‌తో కలిసి కన్పించిన ఆయన.. తాము కలిసే ఉంటామని, ఐక్యంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం రాహుల్ గురువారం జైపుర్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి చురు జిల్లాకు వెళ్తుండగా ఆయన వెంట అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌తో పాటు రాజస్థాన్‌ పీసీసీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ డోట్సారా కన్పించారు. ఈ సందర్భంగా రాహుల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కలిసి కన్పించడం కాదు.. మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. కలిసికట్టుగా రాజస్థాన్‌ ఎన్నికల్లో క్వీన్‌ స్వీప్‌ చేస్తాం. ఘన విజయం సాధిస్తాం’’ అని చెప్పారు.

పోలింగ్‌కు గంటల ముందు.. భాజపా అభ్యర్థి కారులో నగదు కలకలం

భాజపా సర్కార్‌ వస్తే.. ఆ పథకాలన్నీ ఆగిపోతాయ్‌..

ఇక, చురు జిల్లాలోని తరంగర్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ నేడు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా భాజపా (BJP)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లో భాజపా అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రస్తుతం తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేస్తుందని అన్నారు. భాజపాను గెలిపిస్తే ప్రస్తుతం అశోక్‌ గహ్లోత్‌ సర్కార్‌ అమలు చేస్తోన్న ఓపీఎస్‌, ఆరోగ్య బీమా, రాయితీపై సిలిండర్‌, మహిళలకు ఏటా రూ.10వేల వంటి పథకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు. అదే.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పేదలు, రైతులు, చిన్న వ్యాపారులకు మేలు జరుగుతుందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇక, తమ ప్రభుత్వం పేదలకు డబ్బులు బదిలీ చేస్తుంటే.. ఆ డబ్బును భాజపా అదానీ జేబుల్లోకి నెడుతుందని రాహుల్‌ విమర్శించారు. ‘‘మీకు అదానీ ప్రభుత్వం కావాలా? రైతులు, కార్మికులు, యువత కోసం పనిచేసే ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోండి. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు డబ్బులు ఇస్తుంటే.. భాజపా మాత్రం అదానీ విదేశాల్లో కంపెనీలు కొనేందుకు సహకరిస్తుంది’’ అని రాహుల్‌ మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img