icon icon icon
icon icon icon

Ashok Gehlot: మెజీషియన్‌ని కదా.. నా ‘మ్యాజిక్‌’ పనిచేస్తుంది: విజయంపై అశోక్‌ గహ్లోత్‌ ధీమా

Ashok Gehlot: గహ్లోత్‌ ఓ ఇంద్రజాలికుడంటూ భాజపా చేస్తున్న విమర్శలకు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి కౌంటర్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన మ్యాజిక్‌ పనిచేస్తుందని తెలిపారు. 

Published : 22 Nov 2023 15:58 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) మరోసారి కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) ధీమా వ్యక్తం చేశారు. ‘గహ్లోత్‌ మెజీషియన్‌’ అంటూ భాజపా (BJP) నేతలు చేస్తున్న విమర్శలకు సీఎం దీటుగా బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన ‘మ్యాజిక్‌’ పనిచేస్తుందన్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న వేళ తాజాగా ఆయన పీటీఐతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భాజపాపై మరోసారి విమర్శలు గుప్పించారు.

‘‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, భాజపా నేతలు తరచూ నాపై  మెజీషియన్‌ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ చూమంతర్‌ (మాయం) అని అంటున్నారు. కానీ ఎవరు మాయం అవుతారో ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో నా మ్యాజిక్‌ పనిచేస్తుంది. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది’’ అని గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. గహ్లోత్‌ తండ్రి ఇంద్రజాలికుడు. సీఎం కూడా తన చిన్నతనంలో తండ్రితో కలిసి మ్యాజిక్‌ షోలు చేసేవారు.

దర్యాప్తు సంస్థలకు ఆ డైరీ ఇస్తా..

ఇక, రాజస్థాన్‌లో ఇటీవల కలకలం రేపిన రెడ్‌ డైరీ గురించి కూడా గహ్లోత్‌ స్పందించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని, ఎన్నికల వేళ భాజపా కావాలనే ఆ అంశాన్ని లేవనెత్తుతోందని దుయ్యబట్టారు. ‘‘వారు చేసే ఆరోపణలకు ఆధారాలుంటే.. ఆ రెడ్‌ డైరీని నేను ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులకు అప్పగిస్తా’’ అని గహ్లోత్‌ తెలిపారు.

కేంద్ర పథకాలు అమలు కావాలంటే.. కాంగ్రెస్‌ను సాగనంపాల్సిందే: ప్రధాని మోదీ

ఇక, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దర్జీ కన్హయ్య లాల్‌ హత్య ఘటనను కూడా భాజపా తమ స్వార్థం కోసం ఎన్నికల అంశంగా మార్చిందని గహ్లోత్‌ దుయ్యబట్టారు. ఆ కేసు నిందితులకు భాజపా నేతలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ‘‘ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. నిందితులకు ఈ పాటికే ఉరిశిక్ష పడాల్సింది. కానీ, ఎన్నికల కోసమే ఆ దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని అనిపిస్తోంది’’ అని అనుమానం వ్యక్తం చేశారు.

ఇవేమీ పార్లమెంట్‌ ఎన్నికలు కాదు..

ఇక, మోదీ పేరుతో భాజపా ఎన్నికలకు వెళ్లడంపై గహ్లోత్‌ విమర్శలు గుప్పించారు. ‘‘ఇవేమీ పార్లమెంట్‌ ఎన్నికలు కాదు. శాసనసభ ఎన్నికలు. అయినా వారు ప్రధాని పేరుతో పోటీకి దిగారు. నవంబరు 23 వరకు ఆయన (మోదీ) రాష్ట్రంలో కన్పిస్తారు. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్ల వరకు ఆయన రాష్ట్రానికి రారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఎలాంటి గ్యారంటీలు ఇవ్వగలరు’’ అని దుయ్యబట్టారు.

200 శానసనభ నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో 199 స్థానాలకు నవంబరు 25న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. శ్రీగంగానగర్‌లోని కరణ్‌పూర్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మీత్ సింగ్‌ ఆకస్మిక మరణంతో అక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. ఎన్నికల ప్రచారానికి నవంబరు 23 వరకు గడువు ఉంది. డిసెంబరు 3న ఫలితాలను ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img