icon icon icon
icon icon icon

Assembly Polls: క్యాంపు రాజకీయాలకు సిద్ధమైన కాంగ్రెస్‌: భాజపా

రాజస్థాన్‌ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులను తరలించేందుకు బెంగళూరులో రెండు రిసార్టులను కాంగ్రెస్‌ ముందస్తుగా బుక్‌ చేసిందని భాజపా ఆరోపించింది.

Published : 01 Dec 2023 20:39 IST

జైపుర్‌: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls) అంచనాలు పలు పార్టీలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ కాంగ్రెస్‌ క్యాంపు రాజకీయాలకు (Camp politics) సిద్ధమైందని భాజపా ఆరోపించింది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులను తరలించేందుకు బెంగళూరులో రెండు రిసార్టులను కాంగ్రెస్‌ ముందస్తుగా బుక్‌ చేసిందని పేర్కొంది.

‘అభ్యర్థులను సమీకరించేందుకు బెంగళూరులో రెండు రిసార్టులు బుక్‌ చేసినట్లు స్పష్టమైన సమాచారం ఉంది. బేరసారాలు ఆడే అలవాటు వారికి (కాంగ్రెస్‌కు) ఉంది. ఇప్పుడు కూడా వాళ్లు అదే చేస్తారు’ అని భాజపా రాజ్యసభ ఎంపీ, సవాయ్‌ మాధోపుర్‌ అభ్యర్థి కిరోడి లాల్‌ మీనా ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యేలను హోటళ్లు, రిసార్టులకు తరలించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఒపీనియన్‌ పోల్స్‌పై మాట్లాడిన ఆయన.. కొన్ని తమకు అనుకూలంగా ఇచ్చాయని, మరికొన్ని తక్కువ అంచనాలు వేశాయన్నారు. కానీ, రాజస్థాన్‌లో తమ పార్టీకి 120కుపైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199చోట్ల ఎన్నిక జరిగింది. ఒక చోట ఓ పార్టీ అభ్యర్థి చనిపోవడంతో వాయిదా పడింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకారం, రాజస్థాన్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య విజయావకాశాల్లో స్వల్ప తేడానే కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీపై ఇరు పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు రాజకీయాలకు సిద్ధమవుతోందంటూ భాజపా ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img