icon icon icon
icon icon icon

మచిలీపట్నం

Updated : 24 Apr 2024 16:36 IST

లోక్‌సభ నియోజకవర్గం

మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం (Machilipatnam Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్‌ కేటగిరీలోనే ఉంది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ, పెనమలూరు, పామర్రు (ఎస్సీ), గన్నవరం శాసనసభా నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి.

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం మొత్తం 15,18,826 మంది ఓటర్లు ఉండగా, 7,37,936 మంది పురుషులు.. 7,80,825 మంది మహిళలు 65మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఎనిమిది సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, ఐదుసార్లు తెదేపా, ఒకసారి వైకాపా విజయం సాధించాయి. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కొనకళ్ల నారాయణపై వైకాపా అభ్యర్థి వల్లభనేని బాలశౌరి 60,238 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని బాలశౌరి ఇటీవల జనసేనలో చేరగా, కూటమి అభ్యర్థిగా ఆయన పోటీలోకి వచ్చారు. బందరు ఎంపీగా బాలశౌరి గత ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టారు. దశాబ్దాలుగా నెలకొన్న చాలా సమస్యలకు పరిష్కారం చూపించారు. కృష్ణా జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఓ వర్గాన్ని తయారుచేసుకున్నారు. బాలశౌరి వైకాపాను వీడిన తర్వాత.. ఆయన వర్గం నేతలు కూడా జనసేనలోకి వచ్చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం లోక్‌సభ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి శ్రేణుల్లో మరింత ఉత్తేజం వచ్చింది.

ఇక వైకాపా నుంచి సింహాద్రి చంద్రశేఖరావు పోటీలో ఉన్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ వైద్య వృత్తిలో మంచి ఉన్నత స్థితిలో ఉన్న చంద్రశేఖర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు విముఖత చూపారు. పేరును ప్రకటించాక కూడా కొంతకాలం ఆయన స్పందించలేదు. పార్టీ పెద్దలు ఆయనతో పలుమార్లు మాట్లాడారు. చివరకు ఆయన కుమారుడు రాంచరణ్‌ను బరిలోకి దింపేందుకు ఒప్పించారు. తర్వాత చంద్రశేఖర్‌ తన తనయుడిని వెంటబెట్టుకుని సీఎం జగన్‌ను కలిశారు. అవనిగడ్డలో తన కుమారుడు పోటీ చేయబోతున్నట్లు సీఎంను కలిసిన అనంతరం చంద్రశేఖర్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. అయితే తెదేపా-జనసేన పొత్తు, సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి వచ్చాక మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో... మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ను వైకాపా నిలబెట్టింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గొల్లు కృష్ణ పోటీలో నిలబడ్డారు.

 • ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీరే!
 • 1952: సనక బుచ్చికోటయ్య (సీపీఐ(ఎం)
 • 1957: మండలి వెంకట కృష్ణారావు (కాంగ్రెస్)
 • 1962: ఎమ్.వి.స్వామి (ఇతరులు)
 • 1967: వై.అంకినీడు ప్రసాద్ (కాంగ్రెస్)
 • 1971: మేడూరి నాగేశ్వరరావు (కాంగ్రెస్)
 • 1977: మాగంటి అంకినీడు (కాంగ్రెస్)
 • 1980: మాగంటి అంకినీడు (కాంగ్రెస్)
 • 1984: కావూరి సాంబశివరావు (కాంగ్రెస్)
 • 1989: కావూరి సాంబశివరావు (కాంగ్రెస్)
 • 1991: కావూరి సాంబశివరావు (కాంగ్రెస్)
 • 1996: కైకాల సత్యనారాయణ (తెదేపా)
 • 1998: కావూరి సాంబశివరావు (కాంగ్రెస్)
 • 1999: అంబటి బ్రాహ్మణయ్య (తెదేపా)
 • 2004: బాడిగ రామకృష్ణ (కాంగ్రెస్)
 • 2009: కొనకళ్ల నారాయణరావు (తెదేపా)
 • 2014: కొనకళ్ల నారాయణరావు (తెదేపా)
 • 2019 వల్లభనేని బాలశౌరి (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని