icon icon icon
icon icon icon

Priyanka gandhi: తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్‌కు తెలుసు: ప్రియాంకా గాంధీ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ అన్నారు. ఖానాపూర్‌లో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు.

Updated : 19 Nov 2023 15:41 IST

ఖానాపూర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో ఆమె మాట్లాడారు. తొలుత నాందేడ్‌ నుంచి హెలికాప్టర్‌లో ప్రియాంక ఖానాపూర్‌కు చేరుకున్నారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ భారాస, భాజపాలపై విమర్శలు చేశారు.

ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

‘‘జల్‌, జంగల్‌, జమీన్‌ సంస్కృతి ఆదివాసీలది. అది ప్రపంచంలోనే అత్యున్నత సంస్కృతి. ఇందిరాగాంధీ హయాంలో గిరిజనులు, ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పించే చట్టాలు చేశారు. అందుకే ఆమె మరణించి 40 ఏళ్లు గడిచినా.. చేసిన మంచి పనులను ఇప్పటికీ తలచుకుంటున్నారు. ఇందిరాగాంధీ స్థానం మీ మనసులో పదిలంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్‌కు తెలుసు. సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ కాంగ్రెస్‌. ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వారికి ఉద్యోగాలు రాలేదు కానీ కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. నియామకాలు చేపడుతున్నామని చెప్పి పరీక్షలు నిర్వహించినా పేపర్‌ లీక్‌లు జరిగాయి. అందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నియామకాలు చేపడతామని మాటిస్తున్నాం.  ప్రత్యేక రాష్ట్రంలో తమ జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం.

ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం

రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరిట దోపిడీ జరిగింది. ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము వేర్వేరు కాదు. కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపార వేత్తలకు రుణమాఫీ చేసింది. కానీ, రైతులకు రుణమాఫీ చేయడానికి మాత్రం నిధులు లేవని చెబుతోంది. ప్రధాని నరేంద్రమోదీ భారాస ప్రభుత్వ అవినీతిపై దృష్టి సారించకుండా కాంగ్రెస్‌ నేతల ఇళ్లపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు. భాజపా, భారాస ఒక్కటి కాబట్టి అలా చేస్తున్నారు. పార్లమెంటులో భారాస ఎంపీలు కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు మద్దతుగా ఓటేశారు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ రాష్ట్రంలో కేసీఆర్‌కు, కేంద్రంలో భాజపాకు సహకరిస్తున్నారు. ఈ మూడు పార్టీలు ఒక్కటే. మహిళలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారి కష్టాన్ని గుర్తించే మ్యానిఫెస్టోలో పలు అంశాలను చేర్చాం. ప్రతి నెలా రూ.2500 వారి ఖాతాలో వేయాలని నిర్ణయించాం. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, బస్సుల్లో ఉచిత రవాణా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు, రూ.15వేల రైతు బంధు, రూ.10లక్షల ఆరోగ్య బీమా, పంటలకు మద్దతు ధర ఇలాంటి పథకాలతో కూడిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం’’ అని ప్రియాంక అన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు

అనంతరం ఆసిఫాబాద్‌ సభలో ప్రియాంక మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ‘‘ధరణి ద్వారా రైతులను, ప్రజలను భారాస మోసం చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తాం. పరీక్ష తేదీలు, ఫలితాల ప్రకటన తేదీలు జాబ్‌ క్యాలెండర్‌లో ఉంటాయి. తెలంగాణ యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ఆసిఫాబాద్‌ ప్రజలకు భారాస ఏం చేసిందో చెప్పాలి?’’ అని ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img