icon icon icon
icon icon icon

ఇది పచ్చిమోసం కాదా?.. మ్యానిఫెస్టోలో అబద్ధాలు వల్లెవేసిన జగన్‌

‘మోసాలు, మతలబులు కానీయ్‌.. దేశానికి రాజైపోతావోయ్‌’ అన్న సినిమా పాటను ముఖ్యమంత్రి జగన్‌ వంద శాతం ఒంటబట్టించుకున్నట్లున్నారు.

Published : 28 Apr 2024 07:19 IST

ఇచ్చేది రూ.50 వేలే అయినా  రూ.లక్ష అంటూ గోల్‌మాల్‌
గత ఐదేళ్ల సొమ్మునూ కలిపేసి రెండింతల లెక్కలు

ఈనాడు, అమరావతి: ‘మోసాలు, మతలబులు కానీయ్‌.. దేశానికి రాజైపోతావోయ్‌’ అన్న సినిమా పాటను ముఖ్యమంత్రి జగన్‌ వంద శాతం ఒంటబట్టించుకున్నట్లున్నారు. వివిధ పథకాల కింద ఇచ్చే మొత్తాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసినట్లు చెబుతూ మోసానికి తెరతీశారు. వాస్తవానికి ఏ పథకానికీ లబ్ధిని రెట్టింపు చేయకపోయినా, భారీగా పెంచేస్తున్నట్లు మ్యానిఫెస్టోలో ప్రకటించారు. వచ్చే ఐదేళ్లు ఈ పథకాల కింద రెండింతల సొమ్ము వస్తుందేమోనని సామాన్యుల్లో భ్రమ కల్పించారు. సాధారణంగా ఏ పార్టీ అయినా ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రానున్న ఐదేళ్లలో ఏం చేస్తుందో చెబుతుంది. కానీ జగన్‌ గత ఐదేళ్లలో అందించిన లబ్ధిని కూడా కలిపి లెక్కలేసి నయామోసానికి తెరతీశారు. చేయూత పథకానికి ఐదేళ్లలో రూ.1.50 లక్షలు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. వాస్తవంగా వచ్చే ఐదేళ్లలో ఇచ్చేది రూ.75 వేలే. అయినా 2019-24 మధ్య ఇచ్చిన రూ.75 వేలను కూడా కలిపి ఈ లెక్కలేశారు. ప్రజల కళ్లకు గంతలు కట్టారు. చేయూత కింద కొత్తగా రూపాయి కూడా పెరగదు. అయినా ఏ మాత్రం శషభిషలు లేకుండా షిక్కటి షిరునవ్వుతో మైకు పట్టుకుని మోసాల చిట్టా చదివారు. శనివారం విడుదల చేసిన 2024 ఎన్నికల వైకాపా మ్యానిఫెస్టోలో జగన్‌ చెప్పినవన్నీ గోల్‌మాల్‌ మాటలు, పచ్చి అబద్ధాలే. కొన్ని పథకాల లోగుట్టు పరిశీలిస్తే.. ఐదేళ్లలో నాలుగు విడతలే అమలు చేస్తానని ప్రకటించేశారు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలను ఎత్తేసి, ఉప ప్రణాళిక నిధులకు పాతరేసింది చాలక ఇంకా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ కల్లబొల్లి మాటలే వల్లెవేశారు.

ఆశపడొద్దు.. అసలు గుట్టు ఇదీ!

  • నేతన్న నేస్తం కింద ఇకపై రూ.2.40 లక్షలని జగన్‌ ప్రకటించారు. ఆ లెక్కన వచ్చే ఐదేళ్లలో రూ.2.40 లక్షలు వస్తాయేమోనని అనుకుంటారు. వాస్తవానికి రాబోయే ఐదేళ్లలో ఇచ్చేది ఇందులో సగమే. గత ఐదేళ్లలో ఇచ్చిందీ కలిపి రాసుకున్నారు. అంటే మళ్లీ గెలిస్తే ఐదేళ్లలో మరో రూ.1.20 లక్షలు ఇస్తారనేది అసలు సంగతి.
  • వైఎస్‌ఆర్‌ కాపునేస్తం పథకం కింద ఇకపై రూ.1.20 లక్షల వరకూ అని ప్రకటించారు. ఇప్పటికే రూ.60 వేలు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో మరో 4 విడతల్లో రూ.60 వేలు ఇస్తారనేది అసలు సంగతి.

లక్ష అనుకోవద్దు.. అందులో సగమే!

వాహనమిత్రలు ఒక్కొక్కరికీ రూ.లక్ష లబ్ధి కల్పిస్తామన్నారు. నాయీబ్రాహ్మణులు, దర్జీలు, రజకులకు కూడా రూ.లక్ష వరకు అని హామీ ఇచ్చారు. నిజానికి ఐదేళ్లలో ఇచ్చిన మొత్తాన్ని తీసేస్తే.. వచ్చే ఐదేళ్లలో అందేది ఏడాదికి రూ.10 వేల చొప్పున మాత్రమే. ఇదీ కొనసాగింపు కార్యక్రమమే.

అమ్మ ఒడికి అదనంగా చేరేదేమీ లేదు

బడి పిల్లల అమ్మలనూ అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేశారు. అమ్మఒడి కింద రూ.17 వేలకు పెంచి కొనసాగిస్తామని చెప్పినా, ఇందులో వారికి దక్కేది రూ.15 వేలు మాత్రమే. మిగిలిన రూ.2 వేలు పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణకు కోత పెడతారు. అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామని గతంలో ప్రకటించిన పథకమే. ఇన్నాళ్లూ అందులో కోతపెట్టి రూ.13 వేల చొప్పున ఇచ్చారు.

మాయమైన మద్య నిషేధం

ఎన్నికల మేనిఫెస్టో అంతా వెదికినా ఎక్కడా మద్యనిషేధం అన్న మాటే లేదు. మద్యనిషేధం చేశాకే వచ్చి ఓట్లడుగుతానని జగన్‌ 2019 మ్యానిఫెస్టోలో ప్రకటించారు. దాన్ని అమలు చేయలేదు. ఓటర్లకు ఆ విషయం చెప్పటానికి ముఖం చెల్లలేదో? సిగ్గుపడ్డారో? లేదంటే వంద శాతం అమలు చేశామని నమ్మించాలనుకున్నారో? ఈ దఫా ఆ హామీని పూర్తిగా ఎత్తేశారు.

మత్స్యకారులకు రాయితీ పథకాలేవీ?

మత్స్యకార భరోసా రూ.లక్ష వరకు అంటూ దాన్నేదో రూ.20 వేలకు పెంచామన్నట్లుగా ప్రకటించారు. వాస్తవానికి ఏటా రూ.10 వేల చొప్పున వేట నిషేధ సమయంలో ఇచ్చేదే. గత ఐదేళ్లలో ఇచ్చిన సొమ్మును కూడా కలిపి పదేళ్లకు కలిపి రూ. లక్ష అని లెక్కలేశారు. నిజానికి ఈ ఐదేళ్లలో మత్స్యకారులకు రాయితీ పథకాలను దూరం చేశారు. వలలు, పడవలు, ద్విచక్ర వాహనాలేవీ ఇవ్వలేదు. మత్స్యకారుల్లోనూ 30% మందికి భరోసా దక్కడం లేదు.

అవ్వాతాతలకు ‘చివరి ప్రాధాన్యమా?’

అవ్వాతాతల పింఛన్‌ను రూ.3,500 చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అదీ తదుపరి ఎన్నికలు సమీపించే వేళ.. 2028, 2029 సంవత్సరాల్లో! అప్పటికి ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతామని ప్రకటించారు. అంటే ఇంతకాలం వృద్ధులపై మీరు చూపించింది కపట ప్రేమేనా? 2019లో పింఛను రూ.2 వేలు ఉండగా, జగన్‌ సీఎం అయ్యాక ఏడాదికి రూ.250 చొప్పున పెంచారు. చివరకు రూ.3 వేలు చేశారు.

యువత.. ఇప్పుడు గుర్తొచ్చిందట

క్రమం తప్పకుండా గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లు ప్రకటించి, నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ నిరుద్యోగుల్ని మరోసారి వంచించేందుకు జగన్‌ సిద్ధపడ్డారు. విశాఖలో స్టార్టప్‌ హబ్‌, ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్‌ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌ ఇప్పుడు గుర్తొచ్చినట్లున్నాయి! జాబ్‌ క్యాలెండర్‌ ఎప్పుడంటూ ఐదేళ్లుగా యువత ప్రశ్నిస్తుంటే.. పోలీసులతో అణచివేశారు. పరిశ్రమల్ని తరిమేసి యువతకు ఉపాధిని దూరం చేసి, నైపుణ్య శిక్షణకు సమాధి కట్టిన నాయకుడిగా జగన్‌ నిలిచిపోయారు. తగుదునమ్మా అంటూ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తామని, అక్కడ శిక్షణ పొందే యువతకు పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ కింద నెలకు అబ్బాయిలకు రూ.2,500, అమ్మాయిలకు రూ.3వేలు ఇస్తామని గొప్పగా ప్రకటించారు.

నిరుద్యోగుల్ని మోసం చేయడం కాదా?

18 విశ్వవిద్యాలయాల్లో కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్న 3,295 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని మరో మోసపు హామీ ఇచ్చారు. కొందరు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో.. రీనోటిఫికేషన్‌ ఇవ్వడమో, సవరణ చేయడమో చేయాల్సి వస్తుందని తానిచ్చిన నోటిఫికేషన్‌నే ప్రభుత్వం అంగీకరించింది. ఇది నిరుద్యోగుల్ని మోసం చేయడం కాదా?

మళ్లీ మూడు ముక్కలాటే?

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటను కొనసాగిస్తామని మ్యానిఫెస్టోలో జగన్‌ మరోసారి చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నా, విశాఖను పాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని పేర్కొన్నారు. ఐదేళ్లలో విశాఖను అన్ని వైపులా దోచేశారు. రుషికొండకు గుండుకొట్టి పైన ప్యాలెస్‌ కట్టారు. ప్రశాంత నగరాన్ని అరాచకాల నిలయంగా మార్చేసింది చాలలేదేమో! మళ్లీ అక్కడ తిష్ఠ వేస్తామంటున్నారు?


సంక్షేమం అంతా బూటకమే!

స్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం పేరుతో ఒక పేజీ నింపేశారు. అందులో కొత్త పథకం ఒక్కటీ లేదు. అదనపు ప్రయోజనాలూ లేవు. ఐదేళ్లలో ఎత్తేసిన పథకాల ప్రస్తావనా లేదు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ నిత్యం పెదాలపై ప్రేమ ఒలకబోయడం మినహా.. వాస్తవంగా వారంటే ఎంత ప్రేమో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? గత ప్రభుత్వాల హయాంలో అమలైన స్వయం ఉపాధి పథకాలన్నీ ఎత్తేశారు. మరోసారి అధికారిమిస్తే కోతల సంక్షేమాన్ని కొనసాగిస్తానని చెప్పకనే చెప్పారు.

  • సిద్ధం సభల్లో ఎక్కడ చూసినా.. 17 వైద్య కళాశాలలు తెచ్చామని జగన్‌ చెబుతున్నారు. మ్యానిఫెస్టోలో మాత్రం వచ్చే ఐదేళ్లలో 5 వైద్య కళాశాలలు పూర్తి చేస్తామని, మిగిలిన 12 అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అంటే 17 కళాశాలలు తెచ్చామని చెప్పేదంతా అబద్ధమేనని అంగీకరించారు.
  • పోలవరం ప్రాజెక్టును వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. నిర్దేశిత సమయమంటూ చెప్పలేదు. గత ఐదేళ్లలో చేసింది ఐదారు శాతం పనులేనని మాత్రం చెప్పలేదు.  
  • రహదారుల మరమ్మతులకు ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పారు. ఎంత నిధులిస్తారో ప్రకటించలేదు. గత ఐదేళ్లూ రోడ్ల మరమ్మతులను పూర్తిగా వదిలేశారు.
  • వచ్చే ఐదేళ్లలో 32.5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామంటే నిరుపేదలు నమ్మేదెలా? ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కడతామని చెప్పి.. పూర్తి చేసింది పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో కలిపి 6.5లక్షలే. గ్రామాల్లో 2లక్షల మంది లబ్ధిదారుల్ని గుర్తించినా.. ఒక్కరికీ ఇల్లు మంజూరు చేయలేదు. మ్యానిఫెస్టోను నమ్మేదెలా?
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం