icon icon icon
icon icon icon

మల్కాజిగిరి

2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మల్కాజిగిరి శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గాలు అవతరించాయి. 

Published : 10 May 2024 15:12 IST

దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గంగా పేరొందింది మల్కాజ్‌గిరి (Malkajgiri Lok Sabha constituency). భిన్న రాష్ట్రాల సంస్కృతులు, సామాజిక, రాజకీయ చైతన్యం గల ఓటర్లు ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో (2014) అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 30 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో విద్యావేత్తలు, పదవీ విరమణ చేసిన సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులూ ఉండటం విశేషం. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లున్న(31.83 లక్షలు) నియోజకవర్గాల్లోనూ ఇదే మొదటి స్థానం. గతంలో సిద్ధిపేట నియోజకవర్గంలో మల్కాజిగిరి ఉండేది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: మల్కాజిగిరి, ఉప్పల్‌, మేడ్చల్‌, కంటోన్మెంట్‌, ఎల్బీనగర్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి దీని పరిధిలో ఉన్నాయి.

ప్రధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు..

గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకమే. భాజపా నుంచి ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ నుంచి పట్నం సునీత, భారాస నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్‌ గట్టి పట్టుదలతో ఉంది. భాజపా, భారాసలు కూడా అందుకు తగినట్లే పావులు కదుపుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు ఆ పార్టీ విజయం సాధించింది. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం.. గత ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే పట్నం సునీతా మహేందర్‌రెడ్డిని పోటీలో నిలిపింది.

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను గెలుచుకున్న భారాస తన పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన ఆయన స్థానిక నినాదం ఎత్తుకున్నారు. కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు స్థానికేతర నేతలని.. తాను లోకల్ అంటూ వాడీవేడీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు భాజపా కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాటు చేసి ఉత్తర భారత దేశానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేలా స్కెచ్ వేసింది. మల్కాజిగిరి స్థానాన్ని కైవసం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించవచ్చని చూస్తోంది. అందుకే పార్టీలో ప్రధాన నేతగా మారిన ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపింది. మూడు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజిగిరి ఎన్నిక లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది.

  • గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే!
  • 2009: సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్‌)
  • 2014: మల్లారెడ్డి (తెదేపా)
  • 2019 - రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img