icon icon icon
icon icon icon

వైకాపా మ్యానిఫెస్టో ఫట్‌.. కూటమి సూపర్‌-6 బ్లాక్‌బస్టర్‌ హిట్‌

‘నాయకుడికి పరిపాలనా దక్షత ఉండాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద సృష్టించాలి. దాంతో ప్రజలకు సంక్షేమం అందించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థలో రహస్యం. కానీ, జగన్‌ ఎక్కడ చదువుకున్నారో తెలియదు.

Updated : 28 Apr 2024 07:39 IST

ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక జగన్‌రెడ్డి చేతులెత్తేశారు
నేను అభివృద్ధికి.. జగన్‌ నేరాలు, ఘోరాలకు బ్రాండ్‌
ఆత్మకూరు, కోవూరు ప్రజాగళం సభల్లో చంద్రబాబు

ఈనాడు, నెల్లూరు: ‘నాయకుడికి పరిపాలనా దక్షత ఉండాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద సృష్టించాలి. దాంతో ప్రజలకు సంక్షేమం అందించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థలో రహస్యం. కానీ, జగన్‌ ఎక్కడ చదువుకున్నారో తెలియదు. నేరాలు, ఘోరాలు చేయడంలో పీహెచ్‌డీ చేశారు. మాట తప్పి.. మడమ తిప్పారు. మ్యానిఫెస్టో భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ అన్నారు.
99.05% హామీలు చేశానని చెప్పారు. అదే జరిగితే ప్రజల ఆదాయం పెరగాలి. మీలో ఎవరి ఆదాయమైనా పెరిగిందా? ఖర్చులు పెరిగాయి. కూటమి మ్యానిఫెస్టో సూపర్‌ సిక్స్‌.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. అంతకంటే ఏమీ చేయలేనని జగన్‌రెడ్డి చేతులెత్తేశారు’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం నిర్వహించిన ‘ప్రజాగళం’ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘‘ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి, మన భవిష్యత్తును మార్చబోతున్నాయి. ఇప్పటివరకు 54 సభల్లో పాల్గొన్నాను. ప్రతిచోటా రాతియుగం పోయి స్వర్ణయుగం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో చాలామంది జీవితాలు తారుమారయ్యాయి. జగన్‌, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల తప్ప మరెవ్వరూ బాగుపడలేదు’’ అని విమర్శించారు.

ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?

‘మద్యపాన నిషేధం చేస్తానన్నారు. ఆ హామీ ఏమైంది? నాడు క్వార్టర్‌ బాటిల్‌ రూ.60 ఉంటే.. నేడు రూ.200 అయ్యింది. రూ.140 ఎవరి జేబులోకి పోతున్నాయి? మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? యువతకు ఉద్యోగాలు వచ్చాయా? పరిశ్రమలు వచ్చాయా? జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్‌ ఉండాలి. ఏం కావాలో ప్రజలే నిర్ణయించాలి. గులకరాయి డ్రామాతో ఎన్నికల వరకు బ్యాండేజి తీయొద్దని అనుకున్నారు. ఇప్పుడు అందరూ బ్యాండేజి పెట్టడంతో అది తీసేశారు. కనపడని గులకరాయితో దాడి చేయించానట!  కోడికత్తి డ్రామాలాడతారు. దాన్ని నేను గుచ్చానంట? ఈ డ్రామాల రాయుడిని ఏం చేద్దాం? అందరూ ఓటేసి తరిమికొట్టాల్సిన సమయం వచ్చింది’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

గనుల మీదున్న శ్రద్ధ..  వ్యవసాయశాఖపై ఏదీ?

‘సోమశిల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 36 నుంచి 78 టీఎంసీలకు పెంచిన వ్యక్తి ఎన్టీఆర్‌. కండలేరు ప్రాజెక్టు నిర్మించి.. పెన్నా డెల్టాతో పాటు నెల్లూరు జిల్లాను సుస్థిరం చేసిన పార్టీ తెదేపా. కండలేరు నిండిన తర్వాతే చెన్నైకి నీటిని తీసుకెళ్లేలా ఎన్టీఆర్‌ చొరవ చూపారు. నేను శ్రీశైలం నుంచి 45 టీఎంసీలు తీసుకొచ్చాను. వైకాపా ప్రభుత్వంలో నీళ్లొచ్చాయా? కనీసం వరదలకు కొట్టుకుపోయిన సోమశిల ఆప్రాన్‌కు మరమ్మతులు చేయలేకపోయారు. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి గనులపై ఉన్న శ్రద్ధ సేద్యంపై లేదు. కొవిడ్‌ సమయంలోనూ 860 కిలోల పుట్టికి 160 కిలోల ధాన్యాన్ని మంత్రి దోచుకున్నారు. తెదేపా అధికారంలోకి రాగానే రైతులకు రూ.20వేలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని చంద్రబాబు తెలిపారు. రైతులకు ఏం చేస్తారో జగన్‌ కనీసం మ్యానిఫెస్టోలో చెప్పలేదన్నారు.

జగన్‌రెడ్డి నెత్తిన రూపాయి పెడితే.. ఎవరైనా కొంటారా.?

‘ఆత్మకూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వెంకటరమణమ్మ పార్టీ మారితే వైకాపా నాయకులు అవమానించారు. నెత్తిన రూపాయి పెడితే 5 పైసలకు పనికిరారంటూ సామాజికవర్గాన్ని ప్రస్తావిస్తూ మరీ కించపరిచారు. అసలు జగన్‌రెడ్డి నెత్తిన రూపాయి పెడితే ఎవరైనా కొంటారా? తల్లికే అన్నం పెట్టని జగన్‌.. దేశాన్ని ఏం ఉద్ధరిస్తారు?’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధి చేసి చూపిన వ్యక్తి ఆనం రామనారాయణరెడ్డి, సేవాభావంతో ప్రజలకు మేలుచేసిన వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులకు ఓటేసి గెలిపిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బొల్లినేని కృష్ణయ్య, విజయరామిరెడ్డి, పోలంరెడ్డి దినేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం