icon icon icon
icon icon icon

వైకాపా ‘మాయ’ఫెస్టో!

2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో 99 శాతం అమలు చేసేశారా? పోలవరం ప్రాజెక్టు అంగుళం కదల్లేదు, మిగతా జలయజ్ఞం ప్రాజెక్టులూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి.

Updated : 28 Apr 2024 10:02 IST

అబద్ధాలు అంత అతికినట్టుగా ఎలా చెప్పగలరు జగన్‌?
ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలు అంత అమాయకులని మీ ఉద్దేశమా?
మద్య నిషేధం, సీపీఎస్‌ రద్దు, పోలవరం ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయి?
కీలకమైన హామీలు నెరవేర్చకుండానే 99 శాతం పూర్తయ్యాయని ఎలా చెబుతారు?
ఈనాడు - అమరావతి

‘మనం చేయనివి కూడా చేసినట్లుగా ఇంత స్ట్రాంగ్‌గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది సార్‌. ఒక వర్గానికి మీరు ఇన్‌స్పిరేషను.. ఇన్‌స్పిరేషన్‌ అంతే!’.. ఓ సినిమాలో అల్లు అర్జున్‌ డైలాగ్‌ ఇది.
తెల్లారిలేస్తే అబద్ధాలపైనే బతికేస్తూ, బయటకు మాత్రం ‘అబద్ధాలంటే నాకసహ్యం’ అని చెబుతూ తిరిగే వ్యక్తితో అర్జున్‌ చెప్పే ఈ డైలాగ్‌ విశేషంగా ప్రాచుర్యం పొందింది!
2024 ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటలు విన్నవారికీ ఆ డైలాగే గుర్తొచ్చింది.
‘అసలు మీరేమనుకుంటున్నారు జగన్‌? జనం మీకు మరీ అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా?’ అనీ అడగాలనిపించింది.
చేయనివి చేసినట్టూ, అరకొరగా జరిగినవి పూర్తిగా జరిగిపోయినట్టూ..
జగన్‌ చెప్పిన కబుర్లు, చేసిన విన్యాసాలూ చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏంటి సీఎం గారూ.. మ్యానిఫెస్టో అంటే మీకు భగవద్గీత, బైబిలు, ఖురానూనా?

2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో 99 శాతం అమలు చేసేశారా? పోలవరం ప్రాజెక్టు అంగుళం కదల్లేదు, మిగతా జలయజ్ఞం ప్రాజెక్టులూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ప్రత్యేక హోదావంటి ప్రధాన హామీలే పూర్తికానప్పుడు ఇక మ్యానిఫెస్టోని 99 శాతం అమలు చేసేశామని చెప్పడమేంటి జగన్‌? శెభాష్‌.. శెభాష్‌ అంటూ ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటూ, మ్యానిఫెస్టో అమలు విషయంలో తొంభైతొమ్మిది శాతం మార్కులు వేసేసుకోవడంపై అనేక వ్యంగ్య వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఎప్పుడూ పరీక్షల్లో తప్పే కుర్రాడికి ఈసారికి మార్కులు నువ్వే వేసేసుకోమని చెబితే ఎలా ప్రవర్తిస్తాడో.. ముఖ్యమంత్రి తీరు కూడా అలాగే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మద్య నిషేధం మాటే లేదు

2019 మ్యానిఫెస్టోలో జగన్‌ హామీ: ‘కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. 5 నక్షత్రాల హోటళ్లలో మాత్రమే మద్యం దొరికేలా చేస్తాం’

మద్య నిషేధం చేశాకే 2024 ఎన్నికల్లో ఓట్లడుగుతానని చెప్పిందీ మీరే కదా? దశలవారీగా మద్యనిషేధం అని మాట మార్చి.. దాన్ని కూడా అమలు చేయలేదు సరి కదా.. ఊరికి నాలుగైదు బెల్ట్‌షాప్‌లతో మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చారు. ఐదేళ్లలో ‘జే బ్రాండ్ల’ మద్యం విక్రయాల ద్వారా అధికారికంగా, అనధికారికంగా ప్రజల నుంచి రూ.1.54 లక్షల కోట్లు కొల్లగొట్టారు. ప్రస్తుత మ్యానిఫెస్టోలో మద్య నిషేధం ప్రస్తావనే తేలేదు. అంత ముఖ్యమైన హామీ పైనే నాలుక మడతేసిన మీరు... భగతవద్గీత, బైబిలు, ఖురాన్‌ అని చెప్పే మ్యానిఫెస్టోకి ఏం విలువ ఇచ్చినట్టు? 99 శాతం మార్కులు ఎలా వేసుకుంటారు? ఇది రాష్ట్ర ప్రజల్ని వంచించడం కాదా?

పోలవరం భవిష్యత్‌ అగమ్యగోచరం చేసేశారుకదా?

‘‘వైఎస్సార్‌ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులూ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం’’- అని 2019 మ్యానిఫెస్టోలో ఊదరగొట్టారు.
యుద్ధం మాట దేవుడెరుగు.. మీ అస్తవ్యస్త విధానాలతో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తునే అగమ్యగోచరంలోకి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో 72 శాతం పూర్తయిన ప్రాజెక్టు పనుల్ని... ఈ ఐదేళ్లలో మరో ఐదారు శాతం మాత్రమే చేశారు. రాష్ట్రంలో జలయజ్ఞం కింద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం కొత్తగా తీసుకున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి కావలసిన నిధులు మీ లెక్కల ప్రకారమే రూ. 1,64,815 కోట్లు కదా? కానీ ఉద్యోగుల జీతాలు కూడా కలిపి గత ఐదేళ్లలో మీరు చేసిన ఖర్చు రూ. 35,265 కోట్లు మాత్రమే కదా? ఈ ఐదేళ్లలో మీరు సాధించిందేంటి? 2019 నాటికే 70 శాతం పనులు జరిగిపోయిన నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేసి గొప్పలు చెప్పుకోవడమా? వెలిగొండ రెండో టన్నెల్‌ పూర్తి చేసి ఏకంగా ప్రాజెక్ట్‌ నిర్మాణమే పూర్తయినట్లు హడావుడి చేయడమా?

ప్రత్యేక హోదాకు పాతరేసిందెవరు?

దేవుడి దయతో ప్రత్యేక హోదా సాధిస్తామని, ఉద్యోగాల విప్లవం తెస్తామని 2019 మ్యానిఫెస్టోలో జగన్‌ ఊదరగొట్టారు.
25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకొస్తామని బీరాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి దిల్లీ పర్యటనలోనే కాడి కింద పడేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుగుతూ ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేశారు. పార్లమెంటులో కీలకమైన బిల్లులు ఆమోదం పొందే క్రమంలో కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వానికి జగన్‌ బేషరతుగా మద్దతిచ్చారే తప్ప.. ఎప్పుడూ ప్రత్యేక హోదా డిమాండ్‌ను తెరపైకి తేలేదు.  

పరిశ్రమలు ఎక్కడ?

‘2019 మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా.. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహమిచ్చాం. మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా.. ఎంఎస్‌ఎంఈలకు రూ. 2,087 కోట్ల ప్రోత్సాహకాలు అందించాం. ఈ 5 ఏళ్లలో రూ. 85,543 కోట్ల పెట్టుబడులు వచ్చాయి’ అని జగన్‌ గొప్పలు చెప్పారు.

వైకాపా అధికారంలోకి వచ్చీరాగానే గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న ఒప్పందాల సమీక్ష పేరుతో వారిపై వేధింపులకు పాల్పడింది. వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన భూముల్ని వెనక్కు తీసుకుంది. వీళ్ల తీరు చూసి రిలయన్స్‌ సంస్థ రూ. 15 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకుంది. విశాఖ నుంచి లులు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ వంటి సంస్థల్ని ప్రభుత్వ తరిమేసింది. అమరరాజ బ్యాటరీస్‌ సంస్థను రాజకీయ కక్షతో వేధింపులకు గురిచేయడంతో.. ఆ సంస్థ తమ విస్తరణ ప్రాజెక్టును తెలంగాణకు తరలించింది. మొత్తం మీద రూ. 1.24 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి.  

ఉద్యోగుల్ని ముంచింది కాకుండా.. అబద్ధాలా?

‘సీపీఎస్‌ రద్దు చేస్తాం. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరిస్తాం’ అని 2019 మ్యానిఫెస్టోలో హామీ.  
జగన్‌.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్నికల సమయంలో అవగాహన లేక ఆ హామీ ఇచ్చామంటూ సీపీఎస్‌ రద్దుపై మాట మార్చారు. జీపీఎస్‌ పేరుతో మరో విధానం తెరపైకి తెచ్చారు. దీన్ని ఉద్యోగులంతా వ్యతిరేకించినా, మొండిగా చట్టం చేశారు.

రైతులకు కేంద్రం ఇస్తున్నదీ మీ ఖాతాలోనేనా?

రైతు భరోసా కింద రూ. 50 వేలు ఇస్తామని 2019 మ్యానిఫెస్టోలో చెప్పినా.. ఏటా రూ. 13,500 చొప్పున అయిదేళ్లలో రూ. 67,500 ఇచ్చామని జగన్‌ గొప్పలు చెప్పారు.
పీఎం-కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6 వేలు కూడా కలిపి... రూ. 13,500 ఇస్తున్నారు. ఒక్కో రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నికరంగా ఇస్తున్నది ఏటా రూ. 7,500 మాత్రమే. కేంద్రం ఇస్తున్న దాన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోనే వేసేసుకుని అబద్ధాలు చెప్పడం రైతుల్ని మోసం చేయడం కాదా?

సంక్షేమంలో కోతలు వేయడమేనా.. హామీల అమలంటే?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని వివిధ కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో జగన్‌ హామీ ఇచ్చారు.
కార్పొరేషన్లయితే ఏర్పాటు చేశారుగానీ, ప్రత్యేకంగా నిధులు, విధులు కేటాయించలేదు. నవరత్న పథకాల నిధుల్నే కార్పొరేషన్ల ద్వారా ఖర్చు చేస్తున్నట్టు చూపించారు. స్వయం ఉపాధి రాయితీ రుణాల్ని ఎత్తేశారు. కేవలం వైకాపా నాయకులకు పదవులు కట్టబెట్టేందుకు, రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లను మార్చేశారు.

  • వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్లకు అర్హులను గుర్తించేందుకు ఎక్కడా లేని నిబంధనలూ పెట్టారు. ఆరంచెల వెరిఫికేషన్‌ పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టారు.
  • అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లపాటు పెళ్లికానుక అమలు చేయలేదు. 2022 అక్టోబరు నుంచి అమలు చేసినా నిబంధనల కొర్రీలు వేసి అర్హుల సంఖ్య పెరగకుండా చేశారు.

ఇళ్ల నిర్మాణం పైనా నాలుక మడతేయలేదా?

ఐదేళ్లలో పేదలకు 25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, 18.64 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు. వాటిలో 6.50 లక్షలే పూర్తి చేశారు. ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ. 1.80 లక్షల సాయాన్ని కూడా.. రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టుగా చెబుతున్నారు.

మూడో వంతుకు ఇస్తే హామీ అమలైనట్టేనా?

సొంత ఆటో, ట్యాక్సీ నడిపే వారికి ఏటా రూ.10 వేల ఆర్థికసాయం చేస్తామని 2019 మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు 7.5 లక్షల వరకు ఉండగా, ఇందులో ఏటా సగటున 2.60 లక్షల మందికే రూ.10 వేల చొప్పున సాయం అందించారు. ఒక చేత్తో రూ.10 వేలు ఇస్తూనే... ఐదేళ్లలో భారీగా జరిమానాలు విధిస్తూ ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల నడ్డి విరిచారు.

ఇదేనా ఆరోగ్యరంగాన్ని ఉద్ధరించడమంటే?

నాడు-నేడు కింద 8,534 ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేస్తామని చెప్పగా.. ఇప్పటికీ 50 శాతం పూర్తి కాలేదు. ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల భవన నిర్మాణ పనులూ 50 శాతం నిలిచిపోయాయి. 40 పట్టణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు ఆగిపోయాయి. రూ.3 వేల కోట్లతో ప్రతి బోధనాసుపత్రిలో అదనపు భవనాల నిర్మాణం ప్రాథమిక దశలోనే ఉంది. 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తామని ప్రకటించగా.. ఇప్పటి వరకు ఐదు మాత్రమే వచ్చాయి.

యువతకు ఉద్యోగాల కల్పనంటే ఒక్క డీఎస్సీ కూడా వేయకపోవడమేనా?

  • ఐదేళ్లల్లో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. ఎన్నికల దృష్టిలో యువతను ఆకట్టుకునే ఎత్తుగడలో భాగంగా ఇటీవల 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ కూడా వాయిదా పడింది.
  • అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని గత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని అటకెక్కించారు. ఆప్కాస్‌ ఏర్పాటుతోనే పనైపోయినట్లు జగన్‌ చేతులు దులిపేసుకున్నారు.
  • ఐదేళ్ల పాలనలో అమ్మఒడి నాలుగేళ్లే ఇచ్చారు. ఒక ఏడాది కోత పెట్టారు. రూ. 15 వేలు ఇస్తానని చెప్పి, పాఠశాల నిర్వహణ, మరుగుదొడ్ల పేరుతో రూ.2 వేలు మినహాయించి, రూ. 13 వేలే ఇచ్చారు.

లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో తీవ్ర గందరగోళం..

రాష్ట్రంలోని భూములన్నింటినీ సమగ్ర రీ-సర్వే చేయించి, భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలగజేస్తామని 2019 మ్యానిఫెస్టోలో జగన్‌ హామీ ఇచ్చారు. రీసర్వే మాటేమోగానీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తెచ్చి తీవ్ర భయాందోళనలు రేకెత్తించారు. రీ సర్వే పేరుతో మొత్తం అస్తవ్యస్తం చేశారు. చాలామంది రైతులు 10 నుంచి 15 సెంట్ల వరకు భూమి కోల్పోయి లబోదిబోమంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం