icon icon icon
icon icon icon

వైకాపా నామినేషన్‌ ర్యాలీకి రాలేదని.. ఎస్టీ కాలనీకి నీటి సరఫరా బంద్‌

వైకాపా అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లలేదనే కారణంగా ఎస్టీ కాలనీకి రెండు రోజుల పాటు తాగునీటిని నిలిపివేసిన ఉదంతమిది.

Published : 28 Apr 2024 09:10 IST

సి.ఎస్‌.పురం, న్యూస్‌టుడే: వైకాపా అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లలేదనే కారణంగా ఎస్టీ కాలనీకి రెండు రోజుల పాటు తాగునీటిని నిలిపివేసిన ఉదంతమిది. ప్రకాశం జిల్లా సి.ఎస్‌.పురం మండలం నల్లమడుగుల గ్రామస్థుల కథనం మేరకు.. ఈ నెల 24న కనిగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నామినేషన్‌ వేయగా, ఈ కాలనీవాసులు ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లారు. 25న వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్‌కు వెళ్లలేదనే నెపంతో ఆ రోజు నుంచి డీప్‌ బోరు ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరాను ఆపేశారు. గత్యంతరం లేని స్థితిలో సుమారు 80 యానాది కుటుంబాల వారు డబ్బులు వేసుకొని, తెదేపా మద్దతుదారైన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి ట్యాంకర్‌తో నీళ్లు సరఫరా చేయించుకుంటున్నారు. మరింత కక్ష పెంచుకున్న వైకాపా నాయకులు.. ఆ వైద్యున్ని శనివారం పోలీసుల ద్వారా స్టేషన్‌ పిలిపించారు. ఈ విషయం తెలిసి ఎస్టీలు కూడా ఠాణాకు వెళ్లి తామే ట్యాంకర్‌ ఏర్పాటు చేసుకున్నామని ఎస్సైకి వివరించారు. ‘మేం తెదేపా, వైకాపా.. రెండు పార్టీల నామినేషన్ల కార్యక్రమాలకు వెళ్లాం. తెదేపా వాళ్ల ర్యాలీ కంటే వైకాపా ర్యాలీలో జనం తక్కువగా ఉన్నారు. దీంతో మాపై కక్ష గట్టారు. కాలనీలో రెండు డీప్‌ బోర్లున్నాయి. ఒకటి దెబ్బతినగా, దానిలోని మోటారును బయటకు తీశారు. మరోటి బాగానే ఉన్నప్పటికీ, పని చేయడం లేదని సాకులు చెప్పి రెండు రోజులు నీళ్లివ్వలేదు. ఆందోళన చేయడంతో ఇవ్వాళ నీళ్లు వదిలారు’ అని కాలనీవాసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం