icon icon icon
icon icon icon

బాబ్బాబు.. జర తప్పుకోండి..!

నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది.. అన్ని పత్రాలు సరిగా ఉన్న అభ్యర్థులెవరో తేలింది.. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు.

Updated : 21 Nov 2023 14:22 IST

పలుచోట్ల బుజ్జగింపుల జోరు
ఈనాడు, కరీంనగర్‌

నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది.. అన్ని పత్రాలు సరిగా ఉన్న అభ్యర్థులెవరో తేలింది.. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. స్వతంత్రులుగా నామినేషన్లు వేసిన వారు కొన్ని ఓట్లు ప్రభావితం చేస్తారని భావించిన వారిని పోటీ నుంచి తప్పుకొమ్మని కోరుతున్నారు. దీంతోపాటు తమ పార్టీలో అసంతృప్తులుగా ఉన్న వారెవరైనా వారి వెనకున్నారా ఆరా తీస్తూ అటు అభ్యర్థులను.. ఇటు అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు.

ఓట్లు చీలకుండా...

అన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ కనిపిస్తుండటంతో స్వతంత్రులతోపాటు చిన్న పార్టీల తరఫున బరిలో ఉన్న వారిలో సత్తా ఉన్న వారు నామినేషన్‌ ఉపసంహరింపజేసేలా ఎక్కడికక్కడే రహస్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలకు కొంత సమయం తగ్గించి మరీ తమకు పోటీగా రంగంలోకి దిగిన వ్యక్తులు ఎవరెవరు  వారు పోటీలో ఉంటే తమకు జరిగే నష్టం ఎంత అని అంచనా వేస్తూ.. కొంతమేర నష్టం కలిగించే వారైనా వారిని తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో బరిలో ఉండాలనే ఉత్సాహాన్ని చూపుతున్న కొందరు తమకు గుర్తింపు ముఖ్యమని భావిస్తూ ససేమిరా..! అంటూ మొండికేస్తున్నారని కొన్ని నియోజకవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి వారి విషయంలో నయానో.. భయానో  ఒప్పించి తమ వైపునకు వారిని తీసుకొచ్చే ప్రయత్నాల్ని చేస్తున్నారు. ఇందుకోసం పలువురిని అభ్యర్థులు మధ్యవర్తులుగా ఉపయోగించుకుని పావులు కదుపుతున్నారు. వాస్తవానికి ప్రధాన పార్టీలైన భారాస, కాంగ్రెస్‌, భాజపాలతోపాటు బీఎస్పీ అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో పోటీలో ఉంటారని వీరు కాకుండా నియోజకవర్గానికి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు పోటీ చేయాలన్న ఉత్సాహం ఉన్నవారు రంగంలో ఉండే అవకాశం ఉందని భావించారు. కానీ 20 మంది వరకు ఉండటంతో ఓటర్లు తికమకపడితే కష్టమని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు సమయం ఉండటంతో ఈలోపు పోటీదారులను తప్పించేందుకు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. మరి వారు ఏమేరకు సఫలీకృతం అవుతారు.. వారిని ఉపసంహరించుకునేలా చేయగలుగుతారా అనేది చర్చనీయాంశం అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img

    నియోజకవర్గ సమాచారం