icon icon icon
icon icon icon

Gangula kamalakar: ప్రజాహితమే నా పథం

ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ నగరంతోపాటు నియోజకవర్గ రూపురేఖల్ని మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానని రాష్ట్ర మంత్రి, కరీంనగర్‌ భారాస అభ్యర్థి గంగుల కమలాకర్‌ అన్నారు.

Published : 20 Nov 2023 07:59 IST

చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది
రాష్ట్ర మంత్రి, కరీంనగర్‌ భారాస అభ్యర్థి గంగుల కమలాకర్‌

ఈనాడు, కరీంనగర్‌: ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ నగరంతోపాటు నియోజకవర్గ రూపురేఖల్ని మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానని రాష్ట్ర మంత్రి, కరీంనగర్‌ భారాస అభ్యర్థి గంగుల కమలాకర్‌ అన్నారు. ప్రజల అవసరాలు ఏంటనేది తెలిసిన వ్యక్తిగా.. కార్పొరేటర్‌ నుంచి మంత్రి దాకా నిత్యం ప్రజల మధ్యలో ఉన్న నాయకుడిగా ఇక్కడి అభివృద్ధి బాధ్యత తీసుకున్నానని ధీమాను వ్యక్తం చేశారు.. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారని.. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కరీంనగర్‌ రూపురేఖలే మారిపోయాయంటున్నారని చెప్పారు. అన్నివర్గాల ప్రజల హితమే తన పథమని.. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపడమే తనముందున్న లక్ష్యమంటున్న మంత్రి గంగుల కమలాకర్‌తో ఈనాడు ‘ముఖాముఖి’

ప్రశ్న : ప్రజలు మరోసారి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకునేందుకు ఏయే అంశాలు ఉపకరిస్తాయని మీరు భావిస్తున్నారు..?

జవాబు : ముమ్మాటికి నేను చేపట్టిన అభివృద్ధి పనులే నన్ను నాలుగోసారి కరీంనగర్‌ ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతాయి. అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిగా నాకు గుర్తింపు ఉంది. అన్నివేళల్లో అందరికీ అందుబాటులో ఉంటున్నా. ప్రతి ఒక్కరూ ఏ సమయంలో ఫోన్‌ చేసినా నేను స్పందిస్తున్న సందర్భాలున్నాయి. ఇదే నా విజయ మంత్రం. ఇదేకాకుండా ఇప్పటివరకు చేపట్టిన పనులతో నాపై జనాల్లో నమ్మకం పెరిగింది. ఈయనని గెలిపిస్తేనే పనులు ఆగకుండా ముందుకు సాగుతాయనే భరోసా వాళ్లకు నా పనితీరుతో లభించింది. అందుకనే పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసే బాధ్యత నాదేనని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కచ్చితంగా నన్నే భారీ మెజారిటీతో గెలిపిస్తారు.

ప్ర : నియోజకవర్గ ప్రజలకు మేలు చేసే విధంగా ఈ ఎన్నికల్లో మీ ప్రధాన ఎజెండా ఏమిటి?

జ : ఇప్పటి వరకు మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని విశ్వసించమని ప్రజల్ని కోరుతున్నాం. ఇదే సమయంలో వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలో హైదరాబాద్‌ తరవాత అభివృద్ధిలో కరీంనగర్‌ను నిలబెట్టాలన్న ఎజెండానే ప్రజల ముందుంచుతున్నా. ఇక్కడ సమకూర్చిన మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం, సామాజిక అవసరాల కోసం ఆహ్లాదకరమైన పార్కులు ఇలా కార్పొరేషన్‌ రూపురేఖల్ని మార్చాం. రూ.224 కోట్లతో తీగల వంతెనను పూర్తి చేశాం. మానేరు రివర్‌ ఫ్రంట్‌ను రూ.410 కోట్లతో పూర్తి చేసి కరీంనగర్‌ను పర్యాటక ప్రదేశంగా మారుస్తాం. దీని ద్వారా స్థానికులు 5 వేల మందికి ఉపాధి అందుతుంది. ఇదేకాకుండా బహుళజాతి కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేయించి 10 వేల మందికి ఉద్యోగాల్ని కల్పించాలన్న ఎజెండా నాకుంది. ఇప్పటికే నిర్మించిన ఐటీ టవర్‌లో ఉద్యోగాలు, పరిశ్రమల ఏర్పాటు పరంగా సంస్కరణలు చేపట్టి స్థానిక యువతకు దీన్ని ఒక వరంగా మారుస్తాను.

ప్ర: మంత్రిగా మీరు చూసే శాఖల పరంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ఎలాంటి లబ్ధి చేకూరింది?

జవాబు : కరోనా సంక్షోభ సమయంలో, కేంద్రం ధాన్యాన్ని కొనమని కిరికిరి పెట్టిన తరుణంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా నేను రైతన్నలకు ఎక్కడా కష్టం కలగకుండా పండించిన ప్రతి ధాన్యం గింజను కొని శభాష్‌ అనిపించుకున్నా. ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రం ఉండాలనే విధంగా పర్యవేక్షణను ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా కొనసాగించా. మిల్లర్లతో మాట్లాడి ఎదురయ్యే కల్లాల వద్ద రైతులు పడిగాపులు పడకుండా అవరోధాల్ని ఎప్పటికప్పుడు తొలగించాను. ఓబీఎంఎంఎస్‌ (ఆన్‌లైన్‌ బెనిఫిషరీ మేనేజ్‌మెంట్‌ ఆండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) ద్వారా క్షేత్ర స్థాయిలో ధాన్యాన్ని అమ్ముకునే రైతుల విషయంలో ఎదురయ్యే అవినీతిని పూర్తిగా అరికట్టాం. దీంతో అన్నదాతల్లో సర్కారు పనితీరుపై భరోసా పెరిగింది. బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బీసీలకు వందశాతం రాయితీలతో బీసీ బంధుని అందించిన సంతోషం నాకుంది. నియోజకవర్గంలో పలు దఫాలుగా మూడు వేల మందికి ఇచ్చాం. ఇది నిరంతర ప్రక్రియ. మరింతగా ఈ కోటాను పెంచి అర్హులందరికీ ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా చూస్తా. వ్యవసాయ డిగ్రీ కళాశాలను కరీంనగర్‌లో ప్రారంభించుకున్నాం.

ప్ర: గత అయిదేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన  అభివృద్ధి పనులు?

జ : కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఊహించని అభివృద్ధి జరిగింది. నగరంలో వంద అడుగుల మేర ప్రధాన రహదారులను 14.5 కి.మీ.ల మేర విస్తరించాం. రూ.116 కోట్లతో మిషన్‌ భగీరథ పనులతో భారీ ట్యాంకుల నిర్మాణంతో నగరానికి ప్రతి రోజు తాగునీరు అందించే విధంగా ప్రజల దాహార్తిని తీర్చాం. రూ.615 కోట్లతో నియోజకవర్గంలో రోడ్లన్నీ బాగు చేశాం. శాంతిభద్రతలకు చిరునామాగా కరీంనగర్‌ను మార్చాం. 12 చౌరస్తాలను అందంగా తీర్చిదిద్దాం. కరీంనగర్‌ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. ప్రభుత్వ దవాఖానా సామర్థ్యాన్ని 500 పడకలకు పెంచి మెరుగైన వైద్య సేవలందిస్తుండటంతో ప్రజలకు ఊహించని మేలు జరిగింది. తీగల వంతెనతో నగరానికి కొత్త శోభ చేకూరింది. నగరం నలువైపులా రూ.7.75 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశాం. అన్నింటికన్నా ముఖ్యంగా బీసీ గురుకులాలతో బోధనకు మేలు చేసే చర్యల్ని తీసుకున్నాం.

ప్ర: మరోసారి గెలిస్తే చేపట్టాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలేమిటి?

జ : హైదరాబాద్‌ తరవాత కరీంనగర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామాగా మారాలన్నదే నా లక్ష్యం. ఇందుకోసం మంచి ప్రణాళికల్ని రూపొందించుకున్నా. ముఖ్యంగా యువతకు ఉపాధిని కల్పించడంపైనే తొలి ఏడాది ప్రత్యేకమైన దృష్టిని పెడతా. నగరాన్ని విద్య, వైద్య హబ్‌గా మారుస్తా. జనవరి నుంచి కొత్త రేషన్‌ కార్డులను అందరికి ఇప్పించే బాధ్యత తీసుకుంటా. నా నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఆదర్శంగా ఉండాలన్నదే నా ప్రధాన సంకల్పం. ఇందుకోసం భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు సాగుతా. ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వనివి కూడా వారి దరి చేరుస్తాను. గెలిచిన కొన్ని రోజుల్లోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ ఇప్పిస్తాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img