icon icon icon
icon icon icon

Priyanka Gandhi: అధికారంలోకి వచ్చాక 2 లక్షల కొలువులు

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారు. ఇది కేవలం ఎన్నికల సమయంలో చెప్పే మాట కాదని.. రాజస్థాన్‌లో ఇప్పటికే 2 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.

Updated : 25 Nov 2023 08:31 IST
జాబ్‌ క్యాలెండరూ ప్రకటిస్తాం
తొర్రూరు, హుస్నాబాద్‌ సభల్లో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ
దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఇక్కడేనని విమర్శ
రాష్ట్ర ప్రజలు బైబై కేసీఆర్‌ అంటున్నారని వ్యాఖ్య
భారాస, భాజపా, ఎంఐఎంలు ‘నాటు నాటు’ నృత్యం చేస్తున్నాయని ఎద్దేవా
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) హామీ ఇచ్చారు. ఇది కేవలం ఎన్నికల సమయంలో చెప్పే మాట కాదని.. రాజస్థాన్‌లో ఇప్పటికే 2 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని తెలిపారు. శుక్రవారం ఆమె మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. ‘‘పదేళ్లుగా భారాస ప్రభుత్వాన్ని చూశారు. రాష్ట్రంలో పేదలకు పోడు పట్టాలు, ఇళ్లు, భూములు దక్కలేదు. ఇసుక, నీరు, భూమి, ఉద్యోగాలు.. ఇలా అన్నింటా కుంభకోణాలే. కాళేశ్వరం ప్రాజెక్టులో, మిషన్‌ భగీరథలో కుంభకోణాలు జరిగాయి. రైతుల భూములను లాక్కొని.. దోపిడీకి పాల్పడుతున్నారు. దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం తెలంగాణలోనే ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమె పరీక్షే రాయలేదని ప్రభుత్వం చెప్పింది. ఆ కుటుంబం గురించి వ్యంగ్యంగా మాట్లాడింది. యువత విషయంలో కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో ఉంది. రాబోయే రోజుల్లో వారి భవిష్యత్తు గురించి రూట్‌మ్యాప్‌ రూపొందిస్తోంది. తెలంగాణ అంతటా కాంగ్రెస్‌ గాలి వీస్తోంది. పార్టీ సభల్ని ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజా తెలంగాణను ఏర్పాటు చేయబోతున్నాం. ఈసారి ప్రజలు బైబై కేసీఆర్‌ అంటున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లా రుణమాఫీ..
కర్ణాటకలోలా మహిళలకు ఉచిత రవాణా

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోపు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాం. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటకల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేశాయి. రైతు రుణమాఫీ గురించి ఎప్పుడు చర్చకొచ్చినా మోదీ, కేసీఆర్‌లు మరుగునపెట్టేందుకు యత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి రక్షణ లేకుండా పోతోంది. మహిళలకు కాంగ్రెస్‌ అండగా నిలబడుతుంది. వారు స్వశక్తిపై నిలబడాలని ఆకాంక్షిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం కల్పించింది. తెలంగాణలోనూ ఇదే తరహాలో చేయబోతున్నాం. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఖాతాలో వేస్తాం. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. రైతు భరోసా కింద ఎకరానికి ఏటా రూ.15,000 చొప్పున ఇవ్వబోతున్నాం. వరి ధాన్యానికి కనీస మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్‌ ఇస్తాం. రూ.10 లక్షల ఆరోగ్యబీమా.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతోపాటు 24 గంటలూ సరఫరా చేస్తాం. వృద్ధులకు రూ.4 వేల పింఛను ఇస్తాం. ఇందిరమ్మ పథకం కింద అర్హులకు ఖాళీ స్థలాలు కేటాయించడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తాం. యువవికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల రుణం ఇవ్వడంతోపాటు మండలానికో అంతర్జాతీయ పాఠశాల అందుబాటులోకి తెస్తాం. హుస్నాబాద్‌లో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం.

భారాసకు మేలు కోసమే 9 స్థానాల్లోనే ఎంఐఎం పోటీ

భాజపా, భారాస రెండూ ఒక్కటే. సాధారణ ప్రజల కష్టాలను అవి పట్టించుకోవు. పెద్దల కోసం మాత్రమే పనిచేస్తాయి. పార్లమెంటులో చట్టాల ఆమోదం సమయంలో భాజపాకు భారాస మద్దతు ఇచ్చింది. తెలంగాణలో భారాసకు భాజపా మద్దతిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పోటీ భారాసతోనే. భారాస, భాజపా, ఎంఐఎంలు కలిసి ‘నాటు నాటు’ నాట్యం చేస్తున్నాయి. ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో 40-50 సీట్లలో పోటీ చేస్తోంది. తెలంగాణలో మాత్రం భారాసకు మేలు చేయడానికి 9 చోట్లే పోటీ చేస్తోంది. దేశ ఐక్యత కోసం కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కి.మీ. మేర పాదయాత్ర చేసిన రాహుల్‌ గాంధీని ఒవైసీ విమర్శిస్తున్నారు. అదానీకి మోదీ దేశ సంపదను దోచిపెడుతున్నారు. అదానీ ఒక్కరోజుకు రూ.1,600 కోట్లు సంపాదిస్తున్నారంటేనే దేశసంపద ఎలా లూటీ అవుతుందో అర్థమవుతోంది. ఎన్నికల సందర్భంలో భాజపా మతం, కులం లాంటి అంశాల్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని ప్రియాంకా గాంధీ కోరారు. తొర్రూరు సభలో పాల్కురికి సోమనాథుడికి జై అంటూ ప్రియాంకా గాంధీ ప్రసంగం ప్రారంభించారు. ఇది వీరులను కన్నభూమి అని.. ఇక్కడి యువశక్తి, నారీశక్తిని చూస్తే గర్వం కలుగుతోందని అన్నారు.
మహిళ ఇంటికి వెళ్లి.. ఆప్యాయంగా పలకరించి
హుస్నాబాద్‌, హుస్నాబాద్‌ గ్రామీణం-న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభ అనంతరం ప్రియాంకా గాంధీ రోడ్డు మార్గాన వెళ్తూ.. సమీపంలోని కిషన్‌నగర్‌లో ఆగారు. రహదారి పక్కనే ఉన్న జాగిరి రమాదేవి ఇంట్లోకి వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరగడంతో.. వ్రతం గురించి రమాదేవిని, ఆమె భర్త రాజయ్యను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇంటిని చూసి ఎందుకు పూర్తి చేసుకోలేదని అడిగారు. ఇందిరా గాంధీని తాను చూడాలనుకున్నా చూడలేకపోయానని.. ప్రియాంకను చూశానని రమాదేవి సంతోషం వ్యక్తం చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img