KCR: వచ్చేది మా సర్కారే

మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని.. డిసెంబరు 6న రైతుబంధు నగదు యథావిధిగా పడుతుందని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

Updated : 28 Nov 2023 07:15 IST

రైతుబంధు డిసెంబరు 6న పంపిణీ చేస్తాం
దుష్ట కాంగ్రెస్‌.. అన్నదాతల నోటి కాడి ముద్ద లాక్కుంది
రైతులు ఆందోళన పడొద్దు.. నేను బతికున్నంత కాలం ఈ పథకం ఆగదు
మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఎసైన్డ్‌ భూముల పట్టాలకు పచ్చజెండా
షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోలు, సంగారెడ్డి సభల్లో సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌ - షాద్‌నగర్‌, చేవెళ్ల, సంగారెడ్డి టౌన్‌, సంగారెడ్డి అర్బన్‌, జోగిపేట, జోగిపేట టౌన్‌, న్యూస్‌టుడే: మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని.. డిసెంబరు 6న రైతుబంధు నగదు యథావిధిగా పడుతుందని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) ప్రకటించారు. కేసీఆర్‌ బతికి ఉన్నంత కాలం రైతుబంధు ఆగే ప్రసక్తేలేదన్నారు. రైతులు ఆందోళన పడొద్దన్నారు. పథకాన్ని దుష్ట కాంగ్రెస్‌ అడ్డుకుందని.. ఆ పార్టీకి పిచ్చి పట్టిందని దుయ్యబట్టారు. ఇది పాత పథకమేనని ఎన్నికల కమిషన్‌కు వివరిస్తే మంగళవారం ఒక్కరోజు నిధులు జమ చేసేందుకు అనుమతించిందని.. అయితే, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఫిర్యాదు చేసి మళ్లీ ఆపించారన్నారు. రైతుబంధు తీసుకునేవాళ్లలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారని.. రైతుల నోటికాడ ముద్దను లాక్కుంటుంటే ఆ పార్టీకి ఎలా మద్దతు పలుకుతున్నారని.. గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించాలన్నారు. ధరణి తీసేసి కౌలుదారు కాలమ్‌ పెడ్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారని.. రైతుల మెడలకు దూలంలెక్క కౌలుదారులను కడతారట అని విమర్శించారు. ఎసైన్డ్‌ భూములను గుంజుకుంటారని కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని.. అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఎసెన్డ్‌ భూముల పట్టాలకు పచ్చజెండా ఊపుతూ నిర్ణయం తీసుకుంటామన్నారు. షాద్‌నగర్‌, చేవెళ్ల, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గ కేంద్రం జోగిపేటలలో సోమవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. రైతులకు 24 గంటల కరెంట్‌, రైతుబంధు, రైతు బీమా, ధరణి ఉండాలంటే భారాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పదేళ్ల్ల భారాస పాలన.. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను బేరీజు వేసుకుని ఆలోచించి ఓటు వేయాలన్నారు.

కాంగ్రెస్‌ ఇంకా పాత మోడల్‌లోనే..

కాంగ్రెస్‌ పార్టీ ఇంకా 1940(పాత) మోడల్‌లోనే ఉందని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులు, మత కల్లోలాలు, కర్ఫ్యూలు, అత్యవసర పరిస్థితులన్నారు. అంత గొప్ప పాలన అయితే ఎన్టీఆర్‌ ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్‌ 58 ఏళ్ల పాలనలో అరిగోస పడ్డాం. సిటీ కళాశాలలో ఇడ్లి-సాంబార్‌ గోబ్యాక్‌ అంటే పిల్లల్ని కాల్చి చంపారు. ఆ తర్వాత 1956లో వద్దు అన్నా ఆంధ్రాలో కలిపారు. 1969 ఉద్యమంలో 400 మందిని కాల్చి చంపారు. 2004లో తెలంగాణ ఇస్తామంటే నమ్మి పొత్తు పెట్టుకుంటే మోసం చేశారు. 2005, 2006లోనే అన్నమాట ప్రకారం తెలంగాణ ఇవ్వకపోగా పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో, అని ఆమరణదీక్షకు పూనుకుంటే.. ఎక్కడికక్కడ తెలంగాణ సమాజం ఉద్యమం చేస్తే తెలంగాణ ప్రకటించారు. ఆ తర్వాత కూడా సకల జనుల సమ్మె, పిల్లల ఆత్మబలిదానాలతో దిక్కులేక కాంగ్రెస్‌.. తెలంగాణ ఇచ్చింది’ అని కేసీఆర్‌ నాటి పరిస్థితులను గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాక భారాస పాలనలో జరిగిన అభివృద్ధి మీ కళ్ల ముందే ఉందని పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవో 111 ఆంక్షల్ని తొలగించామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. మళ్లీ అధికారంలోకి రాగానే రెండు నెలల్లో ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదటి నీళ్లు వచ్చేది చేవెళ్లకేనన్నారు. షాబాద్‌, చందన్‌వల్లిలో పరిశ్రమలు, శంకర్‌పల్లిలో రైల్వే కోచ్‌ పరిశ్రమ భారాస ప్రభుత్వ హయాంలో వచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఎస్సీ నియోజకవర్గాలైన చేవెళ్ల, అందోలులలో దళిత సోదరులందరికీ దళితబంధు ఇస్తామన్నారు. దళితబంధు ద్వారా దళితవాడల్లోంచి దారిద్య్రాన్ని పీకి అవతల పారేద్దామన్నారు. షాద్‌నగర్‌ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత తనదని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.

పైసా ఖర్చు లేకుండా కరెంటు

కంటి వెలుగు పథకం ద్వారా 3 కోట్ల మందికి పరీక్షలు చేసి 80 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. రైతులకు పైసా ఖర్చులేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని, ప్రభుత్వానికి నష్టమైనా ధాన్యం సేకరణ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల కరెంటు ఇవ్వడం వారికి చేతకాలేదని.. ఇప్పుడు తాము ఇస్తుంటే ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తే నిజమైన యజమానులకు చిప్ప చేతికి వస్తుందన్నారు. 2-3 ఏళ్లలో కౌలురైతుల పేరు మీదికే భూమి మారే ప్రమాదం ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసే ప్రక్రియను చేపట్టామని.. గవర్నర్‌ వల్ల ఆలస్యమైందని మరోసారి ప్రభుత్వం రాగానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. లంబాడా సోదరులకు గౌరవం తెచ్చిపెట్టింది భారాస ప్రభుత్వమేనని, మైనారిటీల సంక్షేమానికి పదేళ్లలో రూ.12 వేల కోట్లకుపైగా ఖర్చు చేసిందన్నారు. గిరిజనుల కోరిక మేరకు సేవాలాల్‌ జయంతిని సెలవుగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక భారాస ప్రభుత్వ పాలనను 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనతో బేరీజు వేసుకోండి. తెలంగాణకు నిధులు కావాలని అసెంబ్లీలో అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఏమైనా చేసుకోండి అని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భారాస అధికారంలోకి వచ్చాక జాగ్రత్తగా వ్యవహరించాం. 2014 ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పన సమయంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారులతో పింఛన్లపై చర్చించాం. విధి వంచితులకు రూ.200 పింఛను ఏం సరిపోతుందని నేను అధికారులను ప్రశ్నించా. పేదలకు ఇస్తున్న పింఛను మొత్తాన్ని పెంచాలని అప్పుడే నిర్ణయించాం. రాష్ట్ర సంపద పెరిగే కొద్దీ పింఛను మొత్తాన్ని కూడా పెంచుకుంటూపోతున్నాం. ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశాం. గతంకంటే రెండు ఎక్కువ సీట్లతో బ్రహ్మాండంగా గెలుస్తున్నాం.

కేసీఆర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని