icon icon icon
icon icon icon

ఎట్టకేలకు గెలుపు తలుపు తట్టింది

శాసనసభ్యులుగా గెలిచేందుకు ఏళ్ల తరబడి వేచిచూసిన ఆ నేతల కల ఇన్నేళ్లకు ఫలించింది.

Updated : 04 Dec 2023 06:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ్యులుగా గెలిచేందుకు ఏళ్ల తరబడి వేచిచూసిన ఆ నేతల కల ఇన్నేళ్లకు ఫలించింది. ఇప్పటి వరకు ఓటములు తప్ప విజయం ఎరుగని ఆ నేతలకు ఈసారి అపురూప విజయం సొంతమైంది. సానుభూతి పవనాలు బలంగా వీచడంతో జయకేతనం ఎగురవేశారు.

ఆది శ్రీనివాస్‌

వేములవాడలో 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి తెదేపా అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు చేతిలో 1821 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం భారాస(తెరాస)లో చేరి 2010 ఉపఎన్నికల్లో రమేశ్‌ చేతిలోనే పరాజయం పాలయ్యారు. 2014లో భాజపా నుంచి, 2018లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసినా విజయం వరించలేదు. ఎట్టకేలకు ఈసారి భారాస అభ్యర్థి చలిమెడ లక్ష్మీనర్సింహారావుపై 14 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో ఆది శ్రీనివాస్‌ గెలుపొందారు.

అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి నియోజకవర్గంలో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై కాంగ్రెస్‌ తరఫున సుదీర్ఘంగా పోరాడుతున్నారు. తొలిసారి 2009లో 1484 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2014లో 18,679 ఓట్లతో, 2018లో 441 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈసారి మాత్రం సుమారు 22 వేల ఓట్ల ఆధిక్యంతో లక్ష్మణ్‌కుమార్‌ విజయబావుటా ఎగురవేశారు.

కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూరులో 2009లో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు. 2014లో తెదేపా తరఫున 23,570 ఓట్లు సాధించి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. 2018లో టికెట్‌ దక్కలేదు. ఈసారి కాంగ్రెస్‌ టికెట్‌తో పోటీకి దిగి భారాస అభ్యర్థి రసమయి బాలకిషన్‌పై 32 వేలకుపైగా ఆధిక్యంతో విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img