Byju's: పూర్వ వైభవానికి బైజూస్‌ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!

బైజూస్‌ సంస్థ పూర్వ వైభవం కోసం కృషి చేస్తోంది. ఇందులోభాగంగా కోర్సు ఫీజులను తగ్గించింది. సేల్స్‌ టీమ్‌కు ప్రోత్సాహకాలను పెంచింది.

Published : 10 May 2024 00:17 IST

Byju's | దిల్లీ: ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి వెళ్లిన ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ (Byju's).. మళ్లీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇటీవల కాలంలో వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ.. ఇప్పుడు విద్యార్థులను ఆకట్టుకునేందుకు కోర్సు ఫీజులను భారీగా తగ్గించింది. అదే సమయంలో సేల్స్‌ టీమ్‌ను ఉత్సాహపరిచేందుకు వాళ్లకిచ్చే ప్రోత్సాహకాలను భారీగా పెంచింది. కోర్సు సబ్‌స్క్రిప్షన్‌ ఫీజును 30-40 శాతం తగ్గించగా.. సేల్స్‌ విభాగం ప్రోత్సాహకాలను 50-100 శాతం పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

బైజూస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన బైజూ రవీంద్రన్‌ కంపెనీకి చెందిన 1500 మంది సేల్స్‌ అసోసియేట్లు, మేనేజర్లతో ఇటీవల భేటీ అయినట్లు తెలిసింది. ఈసందర్భంగా ప్రణాళికను పంచుకున్నట్లు తెలిసింది. బైజూస్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌ వార్షిక సభ్యత్వ రుసుము రూ.12 వేలు (ట్యాక్సులతో కలిపి), బైజూస్‌ క్లాసెస్‌ ఫీజు రూ.24 వేలు, బైజూస్‌ ట్యూషన్‌ సెంటర్స్‌ ఫీజు ఏడాదికి రూ.36 వేలకు తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంతో పోలిస్తే ఈ ఫీజులను దాదాపు 30-40 శాతం మేర తగ్గించినట్లు పేర్కొన్నాయి.

మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు

సేల్స్‌ టీమ్‌లో పనిచేస్తున్న వారికి వేతనంతో పాటు బకాయిలన్నింటినీ వీలైనంత త్వరగా చెల్లిస్తానని భేటీ సందర్భంగా రవీంద్రన్‌ వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు సేల్స్‌ను పూర్తి చేసిన మరుసటి రోజే ప్రోత్సాహకాలను ఖాతాల్లో జమ చేస్తామని చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో మేనేజర్లకు కంపెనీ నుంచి 20 శాతం ఇన్సెంటివ్స్‌ లభిస్తాయని కంపెనీ తెలిపింది. సేల్స్‌ టీమ్‌లో పనిచేసే వారికి సగటున నెలకు రూ.40వేలు చొప్పున ప్రస్తుతం బైజూస్‌ చెల్లిస్తోంది. కొత్త విధానం వల్ల సీటీసీ కంటే అధికంగా వేతనం పొందడానికి వీలవుతుందని బైజూస్‌ చెబుతోంది. అలాగే, సేల్స్‌ టీమ్‌పై మేనేజర్లు ఒత్తిడి తీసుకురాకూడదని సూచించినట్లు తెలిసింది. దీనిపై బైజూస్ అధికారికంగా స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు