KCR: హామీల అమలుకు కాంగ్రెస్‌కు సమయమిద్దాం

రెండుసార్లు మనల్ని గెలిపించిన ప్రజలు.. ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి పాలించే అవకాశమిచ్చారని, ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కనీసం ఆర్నెల్ల సమయమిద్దామని భారాస అధినేత కేసీఆర్‌ తమ పార్టీ నాయకులతో అన్నట్లు తెలిసింది.

Updated : 05 Dec 2023 09:36 IST

నెరవేర్చకపోతే అప్పుడు నిలదీద్దాం
ఎమ్మెల్యేలు, నేతలతో భారాస అధినేత కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రెండుసార్లు మనల్ని గెలిపించిన ప్రజలు.. ఈసారి కాంగ్రెస్‌(Congress) పార్టీకి పాలించే అవకాశమిచ్చారని, ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కనీసం ఆర్నెల్ల సమయమిద్దామని భారాస అధినేత కేసీఆర్‌(KCR) తమ పార్టీ నాయకులతో అన్నట్లు తెలిసింది. ప్రజల తీర్పును గౌరవించి హుందాగా వైదొలిగామని.. త్వరలోనే పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తామని ఆయన వారికి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ హామీలను అమలు చేయని పక్షంలో అప్పుడు నిలదీద్దామని, అప్పటి వరకూ వేచి చూద్దామని ఆయన చెప్పినట్లు సమాచారం. మాజీ మంత్రులు, ఎన్నికల్లో గెలిచిన వారితోపాటు ఓడిన అభ్యర్థులు, పార్టీ నేతలతో సోమవారం గజ్వేల్‌ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన నివాసంలో కేసీఆర్‌ సమావేశమయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకోగా.. వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఓడిన ఎమ్మెల్యేలను ఓదార్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడినందుకు కుంగిపోవాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్‌కు సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి అందజేశారు.

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉందాం: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతిభవన్‌ కేంద్రంగా విధులు నిర్వహించిన తాము.. ఇకపై పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉందామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. భారాస తరఫున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు సోమవారం ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిసే ముందు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో భారాస ప్రభుత్వ పాలనలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాం. అయినా ప్రజలు మరో పార్టీకి అవకాశమిచ్చారు. మనకూ గౌరవప్రదమైన స్థానాలిచ్చారు. ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దాం. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వంపై సానుకూల స్పందన వస్తోంది. భారాస అధికారం కోల్పోతుందని అనుకోలేదని పేర్కొంటూ.. సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందల సంఖ్యలో మెసేజ్‌లు వస్తున్నాయి. త్వరలోనే పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాం’’ అని కేటీఆర్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని