icon icon icon
icon icon icon

నిగూఢ సైన్యం!

సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీలకు, నేతలకు నిరుద్యోగ ఇంజినీర్లు, ఎంబీఏ పట్టభద్రులు నిగూఢ సైన్యంగా పని చేస్తున్నారు. తమ డేటా నైపుణ్యాలతో అతి తక్కువ సమయంలో నేతల ప్రచారంలోని రాజకీయ సమస్యలను పరిష్కరిస్తున్నారు.

Published : 29 Apr 2024 04:13 IST

ఎన్నికల వ్యూహాల్లో ఐఐటియన్లు, ఎంబీఏ పట్టభద్రులు
కన్సల్టెన్సీల సేవలో నిరుద్యోగులు
యువ న్యాయవాదులకూ అవకాశం
ఈనాడు  ప్రత్యేక విభాగం

సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీలకు, నేతలకు నిరుద్యోగ ఇంజినీర్లు, ఎంబీఏ పట్టభద్రులు నిగూఢ సైన్యంగా పని చేస్తున్నారు. తమ డేటా నైపుణ్యాలతో అతి తక్కువ సమయంలో నేతల ప్రచారంలోని రాజకీయ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇందులో ఐఐటియన్లు, ఎంబీఏ పట్టభద్రులు, యువ న్యాయవాదులు తెర వెనుక ప్రచార వ్యూహాల్లో పాలు పంచుకుంటున్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాలయాల నుంచి పట్టాలు అందుకున్న పలువురు యువత ఈ క్రతువులో పాల్గొంటున్నారు. ఈ యువ నిరుద్యోగుల పని పార్టీలకు ఓటెయ్యాలని అభ్యర్థించడం కాదు. సర్వేలు నిర్వహించడం, ఓటర్ల డేటాను  విశ్లేషించడం. భాజపాకు పని చేస్తున్న ఓ యువకుడి మాటల్లో చెప్పాలంటే.. భాజపాకు ఓటేయని వారిని గుర్తించడం. అటువంటి వారిని వయసు, కులం, మతం, తెగ ఆధారంగా వర్గీకరించడం. వారిని భాజపాకు దగ్గర చేసేలా వ్యూహాలను రచించడం.

క్షేత్ర స్థాయిలో వందల మంది

కార్యాలయాల్లో కూర్చుని డేటాను విశ్లేషించే వీరికి క్షేత్ర స్థాయిలో పని చేసే వందల మంది సహకరిస్తుంటారు. వారంతా ఓటర్ల అభిప్రాయం, సమస్యలను డేటా కేంద్రానికి చేరవేస్తుంటారు.

ఐఐటీలు, ఐఐఎంల నుంచి..

కన్సల్టెన్సీల్లో పని చేసే వారిలో 20శాతం నుంచి 30శాతం మంది ఐఐటీల నుంచి, 5శాతం మంది ఐఐఎంల నుంచి వస్తున్నారు. వీరంతా ఎన్నికల సమయంలో కంప్యూటర్లు, పెద్ద ఎల్‌ఈడీ తెరలతో  కుస్తీ పడుతుంటారు. కన్సల్టెన్సీలు ఫలానా డిగ్రీ ఉండాలని కోరుకోవు. కానీ గణితంలో ప్రతిభ ఉండాలని కోరుకుంటాయి. కోడింగ్‌లో నైపుణ్యంతోపాటు సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉండాలని అభిలషిస్తున్నాయి. ఇందులో ఐఐఎంలో చదివిన వారిని టీంలకు నాయకత్వం వహించడానికి, ఐఐటీల వారిని టెక్నాలజీలో వినియోగించుకోవడానికి సంస్థలు తీసుకుంటున్నాయి. ఇందులో చేరినవారు నిగూఢంగా పని చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో 24 గంటలూ   పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల    ఈ రంగంలో మహిళలకు అవకాశాలు తక్కువనే చెప్పాలి.

జేఈఈలో అత్యున్నత ప్రతిభ

ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులే ఎక్కువ మంది ఈ కన్సల్టెన్సీ సంస్థల్లో పని చేస్తున్నారు. వారంతా లక్షల మందితో పోటీ పడి అత్యున్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొంది చదివినవారే. అటువంటి వారిలో కిశోర్‌ ఒకరు. ఆయనతోపాటు వందల మంది ఈ రాజకీయ వ్యూహ రచనలో భాగస్వాములయ్యారు.

30 కోట్ల డాలర్ల మార్కెట్‌

భారత్‌లో ఎన్నికల వ్యూహ రచన కన్సల్టెన్సీల మార్కెట్‌ 30 కోట్ల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇటువంటి సంస్థలను తప్పనిసరిగా తీసుకుంటున్నాయి. ఇందులో పని చేసే పట్టభద్రులు.. ఓటర్ల డేటాను విశ్లేషించి విలువైన సమాచారం అందించడంలో వేగంగా, కచ్చితత్వంతో పని చేస్తున్నారు. కన్సల్టెన్సీలు కూడా అత్యున్నత స్థాయి విద్యాసంస్థల్లో చదివిన వారిని ఆకట్టుకునేందుకు అత్యధిక వేతనాలను ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతోపాటు అధికార వ్యవస్థలకు దగ్గరగా ఉండే అవకాశం కూడా పట్టభద్రులను ఆకర్షిస్తోంది.


ప్రతి ఓటుపైనా దృష్టి

న్సల్టెన్సీల్లో పని చేసే ఉద్యోగులు ప్రతి ఓటుపైనా దృష్టి సారిస్తారు. ఉదాహరణకు త్రిపురలోని కొండ ప్రాంతాల్లో ఉండే 80 మంది ఓటర్లను కలుసుకోవడానికి ఒక ఉద్యోగి 3 రోజులపాటు ప్రయాణించాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా చేసి ఆ ఓట్లను సాధించగలిగారు.


రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు

తెర వెనుక పనిచేసే ఈ యువతకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. వారికి కావాల్సిందల్లా వేతనం, గెలిచాక ఆనందం. అందుకే వారిని ‘రాజకీయ తటస్థ సమస్య సాధకులు’ అని పిలుస్తారు. ‘మేం మా పార్టీ తరఫున ఓట్లను సాధించడానికి చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కానీ మేం మాకిచ్చిన సమస్యను పరిష్కరించడానికే పని చేస్తాం’ అని ఇందులో పాలుపంచుకుంటున్న కొందరు ఉద్యోగులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img