icon icon icon
icon icon icon

ఎందుకీ నిరాసక్తి?

సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది.

Published : 17 May 2024 03:59 IST

పోలింగ్‌ పూర్తయిన 3 విడతల్లో సంతృప్తిగా లేని ఓటింగ్‌
నాలుగో విడతలో కొంత మెరుగు
మొత్తంగా సగటున 1.32 శాతం తగ్గుదల

సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. వీటితోపాటు పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్య ప్రాంతంలోని మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఈశాన్య ప్రాంతం మొత్తం ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయింది. అయితే కొన్ని మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం గతం కంటే తగ్గింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపినట్లు కనిపించడం లేదు. పోలింగ్‌ పెంచేందుకు ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇంకా ఉత్తరాదిన పంజాబ్‌, దిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో పోలింగ్‌ జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో మహిళల పోలింగ్‌ శాతమూ తగ్గింది.

పెద్ద రాష్ట్రాలకేమైంది?

3 కోట్లకు పైగా జనాభా ఉన్న గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పోలింగ్‌ తగ్గింది. ఈ రాష్ట్రాల్లో 2.5శాతం, అంతకంటే ఎక్కువ తగ్గుదల నమోదైంది. వీటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 2019 కంటే పోలింగ్‌ శాతం భారీగా పెరిగింది. అస్సాం, ఝార్ఖండ్‌లలో స్వల్పంగా పెరుగుదల నమోదైంది.

  • బహుళ పార్టీల మధ్య పోటీ ఉన్న రాష్ట్రాల్లో 2.5శాతం కంటే ఎక్కువ తగ్గుదల నమోదైంది. విడతల వారీగా చూస్తే పోలింగ్‌ శాతం పెరుగుతూ వచ్చింది. తొలి, రెండు విడతల్లో భారీగా తగ్గుదల నమోదుకాగా తదుపరి విడతల్లో పరిస్థితి కొంత మెరుగైంది.
  • బిహార్‌లో తొలి రెండు విడతల్లో సగటున 2019తో పోలిస్తే 3.9శాతం పోలింగ్‌ తగ్గగా.. 3, 4 విడతల్లో సగటున తగ్గుదల 1.6గా నమోదైంది.
  • మధ్యప్రదేశ్‌లో తొలి రెండు విడతల్లో సగటున 8.1శాతం తగ్గగా.. అది 3, 4 విడతలకు వచ్చే సరికి 1.8శాతానికి పరిమితమైంది.
  • ఉత్తర్‌ ప్రదేశ్‌లో తొలి రెండు విడతల్లో సగటున 6.2శాతం తగ్గగా.. 3, 4 విడతల్లో 1.4 శాతానికి పరిమితమైంది.
  • పశ్చిమ బెంగాల్‌లో తొలి రెండు విడతల్లో సగటున 3.4 శాతం తగ్గగా.. 3, 4 విడతలకు వచ్చేసరికి 3.1 శాతం తగ్గింది.

గతంలో పార్టీలు గెలిచిన నియోజకవర్గాల్లో..

2019 ఎన్నికలతో పోలిస్తే.. ఎన్డీయే అప్పుడు గెలిచిన నియోజకవర్గాల్లో సగటున 2.2 శాతం పోలింగ్‌ తగ్గింది. అదే ఇండియా కూటమి గెలిచిన చోట్ల 2.4 శాతం తగ్గింది. వైకాపా, బిజూ జనతాదళ్‌, ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం పెరిగింది.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూసినా..

  • అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమైన రెండు పార్టీలు గెలిచిన చోట్ల సగటున 1శాతం పోలింగ్‌ తగ్గింది. ఇందులో పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌ ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీలు గెలిచిన నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్‌ శాతం పెరిగింది.

మహిళల్లో నిరాసక్తి

ఈసారి పురుషులతో పోలిస్తే మహిళల్లో పోలింగ్‌పై ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మహిళల పోలింగ్‌ శాతం పురుషుల కంటే అధికంగానూ ఉంది.

  • గతంతో పోలిస్తే పురుషులు, మహిళల పోలింగ్‌ శాతం మధ్య గ్యాప్‌ పెరిగింది. గతంలో 0.6శాతం ఉండగా.. ఈసారి అది 1.1శాతానికి పెరిగింది.  
  • 2019లో తొలి 3 విడతల్లోని 282 నియోజకవర్గాలను తీసుకుంటే.. 115 చోట్ల మహిళల పోలింగ్‌ శాతం పురుషుల కంటే అధికంగా ఉంది.
  • ఈసారి కేవలం 91 నియోజకవర్గాల్లోనే మహిళల ఓటింగ్‌ శాతం పురుషుల కంటే అధికంగా ఉంది.

స్థానిక అంశాలే..

ఆయా రాష్ట్రాల్లో పోలింగ్‌ తగ్గడానికి, పెరగడానికి జాతీయ అంశాలేవీ ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు. స్థానిక అంశాలే ప్రాధమ్యాలుగా మారినట్లు తెలుస్తోంది. లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనూ పోలింగ్‌ శాతం పెరిగింది.


2019తో పోలిస్తే..

గత ఎన్నికలతో పోలిస్తే నాలుగు విడతల్లో కలిపి 1.32 శాతం పోలింగ్‌ తగ్గింది. ఈసారి నాలుగు దశల్లో సగటున 66.92% పోలింగ్‌ నమోదైంది. దేశవ్యాప్తంగా ఉన్న 97 కోట్ల మంది ఓటర్లలో ఈ నాలుగు దశల్లో 45.10 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో నాలుగు విడతల్లో సరాసరి పోలింగ్‌ శాతం 68.24. ఇప్పటిదాకా 379 నియోజకవర్గాల్లో పోలింగ్‌ పూర్తయింది. మిగిలిన నియోజకవర్గాల్లో పోలింగ్‌ను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం చెబుతున్నా ఓటర్లు ఎంతవరకు స్పందిస్తారనేది చూడాలి. ఈసారి మొదటి 3 విడతల్లో పోలింగ్‌ శాతం తగ్గగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణసహా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ పెరగడంతో నాలుగో విడతలో పెరిగింది.


పోలింగ్‌ పెంచేందుకు కృషి: ఈసీ

మిగిలిన దశల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓట్లు వేయాలని ఎన్నికల సంఘం (ఈసీ) పిలుపునిచ్చింది. ఆ దిశగా చైతన్యం కల్పించాల్సిందిగా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులను కోరినట్లు తెలిపింది. మొదటి 3 దశలకు భిన్నంగా.. ఈ నెల 13న నాలుగో దశలో గతం కంటే 3.65 శాతం ఎక్కువ పోలింగ్‌ నమోదైందని వెల్లడించింది. ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు తాము పిలుపునివ్వగానే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు వేర్వేరు సంస్థలు ముందుకు వస్తున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇంతవరకు 23 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 379 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయని చెప్పారు. పోలింగ్‌ శాతం పెరిగితే భారతీయ ప్రజాస్వామ్య బలోపేతంపై ప్రపంచానికి సందేశం వెళ్తుందన్నారు.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img