icon icon icon
icon icon icon

అటో.. ఇటో.. ఉత్కంఠే!

ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్‌లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు.

Updated : 16 May 2024 06:10 IST

లోక్‌సభకు ఒకలా.. అసెంబ్లీకి మరోలా తీర్పు
ఝార్ఖండ్‌లోని 3 స్థానాలకు 20న పోలింగ్‌

ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్‌లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. ఈ రాష్ట్రంలోని 3 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఈ రాష్ట్రంలో భాజపా, ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యూ) కలిసి పోటీ చేస్తున్నాయి. అటు ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ కలిసి ఇండియా కూటమిగా బరిలోకి దిగాయి. గతంలో మాదిరిగానే ఈ రాష్ట్రంలో ఫలితాల్ని అంచనా వేయడం కష్టం. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, మౌలిక వసతుల లేమి ప్రధాన సమస్యలు. ప్రభుత్వం ఈ సమస్యలపై ఎలా స్పందిస్తుందన్న అంశాలను బట్టే ఓటింగ్‌ సరళి ఉంటుంది. తాజాగా ఎన్డీయే, ఇండియా కూటములు అభివృద్ధి, ఉద్యోగ కల్పన ఎజెండాగానే ప్రచారం చేస్తున్నాయి.


గ్రామీణ పేదరికం

ఎస్సీలు, ఎస్టీలు, అత్యంత వెనుకబడిన వర్గాల వారు అధికంగా ఉండే చత్రా నియోజకవర్గం ఝార్ఖండ్‌ ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది గ్రామీణ పేదలు. వారిలో ఎక్కువ మంది ఎస్సీలే. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు ఆర్జేడీకి పట్టుండేది. ఇక్కడ ఎస్సీలు 27%, ఎస్టీలు 21%, ముస్లింలు 10శాతం ఉంటారు.

2014, 2019లలో భాజపా రికార్డు మెజారిటీతో గెలిచింది. ఈసారి 22 మంది బరిలో ఉన్నారు. భాజపా తరఫున కాళీ చరణ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ తరఫున కృష్ణానంద్‌ త్రిపాఠీ పోటీ చేస్తున్నారు.


నల్ల బంగారం

  • అపార బొగ్గు నిల్వల కేంద్రం హజారీబాగ్‌. ఇక్కడ ఉత్తర కరణ్‌పుర, చార్హి, కుజు, ఘటోటాండ్‌, బర్కాగావ్‌ ప్రాంతాలు బొగ్గు గనులకు ప్రసిద్ధి. ఇవే ఇక్కడి ప్రజలకు జీవనాధారం. హజారీబాగ్‌ ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. పర్యాటక ప్రాంతంగానూ పేరుంది. వెనుకబడిన ప్రాంతమైనా ఈ నియోజకవర్గంలో 70శాతానికి పైగా అక్షరాస్యత ఉంది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాకు ఇది పట్టున్న ప్రాంతం.
  • 2014, 2019లలో భాజపా నేత, యశ్వంత్‌ సిన్హా కుమారుడు జయంత్‌ సిన్హా భారీ మెజారిటీలతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 15శాతం, ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 12శాతం ఉంటారు. ఈసారి జయంత్‌ సిన్హాకు భాజపా టికెట్‌ ఇవ్వలేదు. మనీశ్‌ జైశ్వాల్‌ను పార్టీ అభ్యర్థిగా భాజపా నిర్ణయించింది. కాంగ్రెస్‌ తరఫున జై ప్రకాశ్‌ భాయ్‌ పటేల్‌ పోటీ చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న జయంత్‌ సిన్హా ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు ఝార్ఖండ్‌ అసెంబ్లీలో విప్‌గా ఉన్న జై ప్రకాశ్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి బరిలోకి దిగారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవి రెండు భాజపాపై ప్రభావం చూపించే అవకాశముంది.


మైకా గని

  • కోడర్మా ప్రాంతంలో ప్రపంచంలోనే పేరొందిన రూబీ మైకా దొరుకుతుంది. దేశంలోనే తొలి సైనిక పాఠశాల ఈ ప్రాంతంలోనే ఏర్పాటైంది. కోడర్మా కలాకంద్‌ అత్యంత ప్రసిద్ధి చెందింది. దీనిని దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ నియోజకవర్గాన్ని ఝార్ఖండ్‌కు గేట్‌వేగా కూడా పిలుస్తారు. కోడర్మాకు మైకా సిటీ అని పేరు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంగా ఉంది.
  • ఈ నియోజకవర్గంలో 17 లక్షల మంది ఓటర్లున్నారు. 1977లో ఇది ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం సంప్రదాయకంగా భాజపాకు అండగా నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఏడుసార్లు ఆ పార్టీ గెలిచింది. కాంగ్రెస్‌ రెండుసార్లు, ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (జేవీఎం) ఒకసారి విజయం సాధించాయి.
  • 2019లో ఇక్కడి నుంచి అన్నపూర్ణాదేవి 4.5 లక్షలకుపైగా మెజారిటీతో గెలిచారు. 2014లో రవీంద్ర కుమార్‌ రే విజయం సాధించారు. ఈసారి భాజపా నుంచి సిటింగ్‌ ఎంపీ అన్నపూర్ణాదేవి, ఇండియా కూటమి తరఫున సీపీఐ (మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌, లిబరేషన్‌) అభ్యర్థి వినోద్‌ కుమార్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో 19శాతం మంది ముస్లింలు, 14 శాతం మంది ఎస్సీలు, 8శాతం మంది ఎస్టీలు ఉన్నారు. ఉద్యోగాల కల్పన, ధరల నియంత్రణ, అభివృద్ధిపై భాజపా ఇచ్చిన హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి ఈ ప్రాంతంలో ఉంది. సంప్రదాయ బలంపై భాజపా ఆధారపడుతుండగా.. హేమంత్‌ సోరెన్‌పై సానుభూతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ఇండియా కూటమి నమ్ముకుంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img