icon icon icon
icon icon icon

Assembly Polls: ప్రచారానికి తెర.. పోలింగ్‌కు సిద్ధమైన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌

మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌ రెండో విడతలో 70 నియోజకవర్గాలకు నవంబర్‌ 17న ఒకే రోజు పోలింగ్‌ జరగనుంది.

Updated : 15 Nov 2023 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. చివరి రోజున అధికార, విపక్షాలు ముమ్మరం ప్రచారం చేశాయి. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న ఒకేరోజు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడతలో భాగంగా 70స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లో భాజపా, కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, బీఎస్పీతోపాటు కమ్యూనిస్టు పార్టీలు బరిలో ఉన్నప్పటికీ భాజపా-కాంగ్రెస్‌ మధ్యే కీలక పోరు కొనసాగనుంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఈ రెండు పార్టీల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది.

మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17 ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 5.6కోట్ల ఓటర్లు పాల్గొననున్నారు. ఇందులో 2.88 కోట్ల మంది పురుషులు కాగా 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 22.36లక్షల మంది యువతీ యువకులు తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చివరి రోజు ముమ్మర ప్రచారం చేసిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు కాంగ్రెస్‌ తరఫున ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు.

రెండు పార్టీలకు కీలకమే..

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ఈ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ నుంచి 29 మంది సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలపై ఈ అసెంబ్లీ ఎన్నికలు ప్రభావం ఏమేరకు ఉంటుందనే విషయం పక్కనపెడితే.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, స్థానికంగా అభివృద్ధి వంటి అంశాలు రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కమల్‌ నాథ్‌, విక్రమ్‌ మస్తాల్‌, గోవింద్‌ సింగ్‌లు పోటీలో ఉండగా.. భాజపా నుంచి కైలాస్‌ విజయ్‌వర్గీయ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నరోత్తమ్‌ మిశ్రా, అంబరీష్‌ శర్మ వంటి నేతలు బరిలో దిగారు. ఛింద్వాఢ, ఇందౌర్‌-1, బుధ్నీ, నర్సింగ్‌పుర్‌, లహర్‌, దతియా నియోజకవర్గాల్లో పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు.

‘కలిసికట్టుగా మరోసారి గెలుస్తాం’.. పైలట్‌తో ఫొటో షేర్‌ చేసిన గహ్లోత్‌

గతేడాది ఫలితాల విషయానికొస్తే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 114 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ మెజార్టీ మార్కును సాధించలేకపోయింది. భాజపాకు 109 సీట్లు వచ్చాయి. అయితే, బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమల్‌నాథ్‌.. ఏడాదిపాటు సీఎంగా కొనసాగారు. చివరకు జ్యోతిరాదిత్య సింధియాతో సారథ్యంలో 22మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.

ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు..

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి సంబంధించి తొలిదశలో 20 స్థానాలకు నవంబర్‌ 7న పోలింగ్‌ పూర్తయ్యింది. మరో 70 సీట్లకు నవంబర్‌ 17న ఓటింగ్‌ జరగనుంది. రెండో దశలో మొత్తంగా 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 827 మంది పురుషులు, 130 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. రెండో దశలో మొత్తం 1.63కోట్ల మంది ఓటర్లు ఈ అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఇందుకోసం 18,883 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. భాజపా మాత్రం అధికార పార్టీపై తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణలతో ఇరుకున పడేసే ప్రయత్నం చేసింది. రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, ప్రియాంక గాంధీ వాద్రాలు ముమ్మరంగా ప్రచారం చేశారు. భాజపా తరఫున అమిత్‌ షా, జేపీ నడ్డా, హిమంత బిశ్వశర్మ, అనురాగ్‌ ఠాకూర్‌తోపాటు ఇతర నేతలు చివరి రోజు ప్రచారంలో పాల్గొనగా.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బెమెతరా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కులగణనను మరోసారి డిమాండు చేశారు. దీని వల్ల ఓబీసీలు, దళితులు, గిరిజన ప్రజలకు తమ వాస్తవ జనాభా ఎంతో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు.

ఇదిలాఉంటే, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకు గాను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. 68 సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు పదిహేనేళ్లు పాలించిన భాజపా మాత్రం క్రితం ఎన్నికల్లో 15 స్థానాలకే పరిమితమయ్యింది. జేసీసీ ఐదు, బీఎస్పీ రెండుచోట్ల గెలుపొందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img