icon icon icon
icon icon icon

KTR: పనిచేసే నాయకుడిని ప్రోత్సహించండి: మంత్రి కేటీఆర్‌

రెండుసార్లు ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మొయినాబాద్‌లో నిర్వహించిన భారాస రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.

Updated : 16 Nov 2023 17:27 IST

మొయినాబాద్‌: పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకుడిని ప్రోత్సహించడం ప్రజల బాధ్యతని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. రెండుసార్లు ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కళ్ల ముందే ఉన్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. చేవెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తేశామని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఆ జీవోలో ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని చెప్పారు.

రైతుబంధు కావాలా.. రాబందు కావాలా ప్రజలే తేల్చుకోవాలి: కేసీఆర్‌

చేవెళ్ల భారాస అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన శాసనసభ్యుల్లో ఒకరని కేటీఆర్‌ అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి సీఎంకు ఆయన చెప్తూనే ఉంటారన్నారు. చీమకు కూడా హానిచేయని మనస్తత్వం యాదయ్యదని చెప్పారు. తెలంగాణతో పాటు చేవెళ్ల ప్రశాంతంగా ఉండాలంటే కారు గుర్తుపై ఓటు వేసి భారాసను గెలిపించాలని కేటీఆర్‌ కోరారు. చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

డిసెంబరు 3 తర్వాత కొత్త రేషన్‌కార్డులు

గంగా జమునా తెహజీబ్‌ తరహాలో కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వికారాబాద్‌ రోడ్‌ షోలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇచ్చిన నేత కేసీఆర్‌ ఒక్కరేనని అన్నారు. బతుకమ్మ పండగ, రంజాన్‌, క్రిస్మస్‌ ఇలా ఏ పండగ వచ్చినా భారాస ప్రభుత్వం కానుకలు అందజేసిందని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రశాంత నగరంగా మార్చి పాలించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

‘‘పాలమూరు-రంగారెడ్డిపై కాంగ్రెస్‌ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీ గతంలో వికారాబాద్‌లో జూనియర్‌ కళాశాల కూడా పెట్టలేదు. డిసెంబరు 3 తర్వాత కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తాం. భారాస పాలనలో విద్యుత్, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. కరెంట్‌ కావాలో కాంగ్రెస్‌ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్‌ పాలనలో 24 గంటల కరెంటు ఇస్తున్నారు. 24 గంటల కరెంట్‌పై రేవంత్‌కు అనుమానం ఉంటే తీగలను పట్టుకొని చూడాలి. కరెంట్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదు. గత కాంగ్రెస్‌ హయాంలో తాగునీటి సమస్య ఉండేది. కాంగ్రెస్‌కు గతంలో 11 ఛాన్సులు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడొచ్చి ఒక ఛాన్స్‌ అడుగుతున్నారు’’ అని కేటీఆర్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img