icon icon icon
icon icon icon

BRS: రైతుబంధు కావాలా.. రాబందు కావాలా ప్రజలే తేల్చుకోవాలి: కేసీఆర్‌

దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేశామని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 16 Nov 2023 17:43 IST

ఆదిలాబాద్‌: ప్రజాస్వామ్య పరిణతి వచ్చిన అనేక దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం ఆ పరిణతి భారతదేశంలో కూడా రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు.

‘‘దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేశాం. ఒక పాలసీ ప్రకారం పథకాలను అమలు చేస్తూ వచ్చాం. తెలంగాణ సాధించిన తర్వాత ఎన్నెన్నో సమస్యలు చుట్టుముట్టాయి. సంక్షేమంతోనే ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చాం. కచ్చితమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని కీలక విధానాలు తీసుకొచ్చాం. వాటిలో ప్రధానమైనది వ్యవసాయ స్థిరీకరణ. రైతులు బాగుపడాలని వారి కోసం నీటి పన్ను రద్దు చేశాం. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతులు పండించిన పంటను నష్టం వచ్చినా సరే ప్రభుత్వమే కొనడం లాంటివి అమలు చేశాం. ఇవాళ అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.

పనిచేసే నాయకుడిని ప్రోత్సహించండి: మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో వందల రూపాయలు ఉన్న పింఛన్‌ను వేల రూపాయలకు పెంచాం. రైతు చనిపోతే వారంలోపే బీమా వచ్చేలా చేస్తున్నాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. మరి వారు చేసే వ్యాఖ్యలకు ఓటు ద్వారా ప్రజలే సమాధానం చెప్పాలి. రైతుబంధు ఉండాలంటే మళ్లీ భారాస రావాలి. ధరణి విషయంలో కాంగ్రెస్‌ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ధరణి ఉండటం వల్లే రైతుబంధు డబ్బులు, రైతుబీమా, ధాన్యం డబ్బులు వస్తున్నాయి. మూడేళ్లు ఆలోచించి ధరణి తీసుకొచ్చాం. దాన్ని తీసేస్తే దళారుల రాజ్యం వస్తుంది. కరెంటు కావాలా? కాంగ్రెస్‌ కావాలా? ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. రైతుబంధు కావాలా? రాబందు కావాలా? ప్రజలు ఆలోచించాలి.

కాంగ్రెస్ వాళ్ల తియ్యటి మాటలు నమ్మొద్దు: మంత్రి కేటీఆర్‌

ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం.. ఓటు. ఆ ఆయుధాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పార్టీల నుంచి బరిలో నిలబడుతున్న అభ్యర్థుల గురించి మాత్రమే కాకుండా వారి వెనకున్న పార్టీల గురించి ప్రజలు ఆలోచించాలి. ఎన్నికలు అనగానే ఎంతో మంది వస్తున్నారు.. ఏవేవో మాట్లాడుతున్నారు. చైతన్యం ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఆదిలాబాద్‌. ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలి. నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. మంది మాటలు విని ఆగమైతే ఐదేళ్లపాటు కష్టాల పాలవుతాం. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం. కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా?నిజానిజాలు గమనించి ఓటు వేయాలి’’ అని ప్రజలను కేసీఆర్‌ కోరారు.

గిరిజనేతరులకూ పట్టాలు ఇస్తాం..

ప్రజలు మంచి.. చెడు ఆలోచించి ఓటు వేస్తే రాష్ట్రానికి మంచి జరిగేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్‌ అన్నారు. బోథ్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘గతంలో మంచినీళ్ల కోసం ఎంతో బాధపడ్డాం. అందుకే ఆలోచించి మిషన్‌ భగీరథను తీసుకొచ్చాం. అదే కాంగ్రెస్‌ హయాంలో చూస్తే ప్రతి విషయంలోనూ ప్రజలు బాధలే అనుభవించారు. భారాస చేసిన అభివృద్ధిని కార్యకర్తలు.. ప్రజలకు వివరించాలి. బోథ్‌ ప్రజలు మూడు కోరికలు కోరుతున్నారు. బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తాం. డిగ్రీ కళాశాల మంజూరు చేస్తాం. ఈ ప్రాంతంలో కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. ఇందుకోసం కోల్డ్‌ స్టోరేజీ మంజూరు చేస్తాం. గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చాం. గిరిజనేతరులకు కూడా వచ్చే దఫాలో పట్టాలు ఇస్తాం. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి’’ అని కేసీఆర్‌ తెలిపారు.

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌: సీఎం కేసీఆర్‌ 

నిజామాబాద్‌: అభ్యర్థుల గురించి ప్రజలు ఆలోచించాలి.. ఆలోచించి ఓటు వేస్తేనే ప్రజలు గెలుస్తారని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారాస ప్రజాఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ‘‘ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో పాలన చేస్తున్నాం. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుటుంది. పదేళ్ల పాలనలో మేము చేసిన అభివృద్ధి మీ ముందు ఉంది. పెట్టుబడులు పెరిగాయి, రాష్ట్ర ఆదాయం పెరిగింది. రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. రైతు బంధు రూ.10వేల నుంచి రూ.16వేలకు పెరగాలంటే భారాసకు ఓటు వేయాలి’’ అని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img