icon icon icon
icon icon icon

Mizoram: మూడున్నర దశాబ్దాల తర్వాత కొత్త ముఖం.. ఐపీఎస్‌ నుంచి సీఎం వరకు ‘లాల్‌దుహోమా’..!

మిజోరంలో అధికార ‘ఎంఎన్‌ఎఫ్‌’కు గట్టి షాక్‌ ఇస్తూ.. లాల్‌దుహోమా ఆధ్వర్యంలోని ‘జడ్పీఎం’ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో లాల్‌దుహోమా రాజకీయ జీవిత ప్రయాణాన్ని గమనిస్తే..

Updated : 04 Dec 2023 21:32 IST

ఆయిజోల్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరం (Mizoram)లో మూడున్నర దశాబ్దాలుగా వస్తోన్న రాజకీయ సంప్రదాయాన్ని స్థానిక ఓటర్లు ఈసారి పక్కనపెట్టారు. 1989లో రాష్ట్రంగా అవతరించినప్పటినుంచి మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF), కాంగ్రెస్‌ (Congress)లే పాలించిన మిజోరంలో.. తొలిసారి ‘జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM)’ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో ఎంఎన్‌ఎఫ్‌, కాంగ్రెస్‌ల ఆధిపత్యానికి తెరదించుతూ.. ‘జడ్పీఎం’కు అధికారాన్ని కట్టబెట్టిన నేతగా లాల్‌దుహోమా (Lalduhoma) పేరు మార్మోగుతోంది.

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం..

మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన లాల్‌దుహోమా.. ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి. ఆమె స్ఫూర్తితోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన లాల్‌దుహోమా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలు చవిచూశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రెండుసార్లు అనర్హతకూ గురయ్యారు. గెలుపోటములను తట్టుకున్నారు. ఎట్టకేలకు మిజోరంలో 1989 నుంచి వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే సంప్రదాయానికి తెరదించుతూ.. జడ్పీఎంను అధికారానికి చేరువ చేశారు. మిజోరం సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మిజోరంలో ZPM జయకేతనం.. సీఎం, డిప్యూటీ సీఎం ఓటమి

1949లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన లాల్‌దుహోమా.. నలుగురు సంతానంలో చిన్నవాడు. బీఏలో డిగ్రీ పట్టా పొందారు. మిజోరం తొలి ముఖ్యమంత్రి ఛూంగా వద్ద ప్రిన్సిపల్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన.. 1977లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. 1982లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకి సెక్యూరిటీ ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితో.. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించారు. 1984లో కాంగ్రెస్‌ తరఫున మిజోరం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంఎన్‌ఎఫ్‌ తిరుగుబాటుతో రాష్ట్రంలో దెబ్బతిన్న శాంతిపూర్వక వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు ముందుకు రావడం లేదంటూ 1986లో కాంగ్రెస్‌ సభ్యత్వం వదులుకున్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి..

 ఆ తర్వాత జోరం నేషనలిస్ట్‌ పార్టీ (జడ్‌ఎన్‌పీ)ని స్థాపించారు. 2018 ఎన్నికల సమయంలో ‘జడ్పీఎం’ సంకీర్ణ పార్టీలో చేరారు. కానీ.. ‘జడ్పీఎం’కు పార్టీగా గుర్తింపు లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రెండు నియోజకవర్గాల్లో (ఆయిజోల్‌-1, సెర్ఛిప్‌) పోటీ చేసి గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్‌ సీఎంగా పనిచేసిన లాల్‌ థాన్‌హవలాను సెర్ఛిప్‌ నుంచి ఓడించడం విశేషం. 2020లో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడయ్యారు. 2021 ఉప ఎన్నికల్లో అదే స్థానం నుంచి గెలిచారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.

ప్రజాజీవితంలో అంకితభావమే..

ప్రస్తుతం సెర్ఛిప్‌ నుంచి లాల్‌దుహోమా మరోసారి విజయం సాధించారు. మిజోరం విషయంలో నిబద్ధత, ప్రజాజీవితంలో అంకితభావమే ఆయన్ను రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖుడిగా నిలిపినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో భాగంగా దశాబ్దాల కాంగ్రెస్‌, ఎంఎన్‌ఎఫ్‌ పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్డీఏలో భాగమైన ఎంఎన్‌ఎఫ్ తన ప్రాంతీయతత్వాన్ని కోల్పోయిందనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అధికార ‘ఎంఎన్‌ఎఫ్‌’కు గట్టి షాక్‌ ఇస్తూ.. లాల్‌దుహోమా ఆధ్వర్యంలోని ‘జడ్పీఎం’ మిజోరం రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img