icon icon icon
icon icon icon

Mizoram Election Results: మిజోరంలో ZPM జయకేతనం.. సీఎం, డిప్యూటీ సీఎం ఓటమి

Mizoram Election Results: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జోరంథంగా సహా పలువురు మంత్రులు ఓటమిపాలయ్యాారు.

Updated : 04 Dec 2023 17:29 IST

ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్‌ (MNF)కు గట్టి షాక్‌ తగిలింది. ఏకంగా ముఖ్యమంత్రి జోరంథంగా సహా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. సోమవారం వెలువడిన ఫలితాల్లో ప్రతిపక్ష జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM) స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. దీంతో జడ్‌పీఎం అధ్యక్షుడు లాల్‌దుహోమా నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది.

రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 స్థానాలు అవసరం. ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో జడ్‌పీఎం మొత్తంగా 27 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, ఎంఎన్‌ఎఫ్‌ పార్టీ 10 చోట్ల గెలిచింది. రెండు చోట్ల భాజపా, ఒక చోట కాంగ్రెస్‌ గెలుపొందింది.

ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?

  • ఈ ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్‌ అధ్యక్షుడు, సీఎం జోరంథంగా ఐజ్వాల్‌ తూర్పు-1 స్థానం నుంచి పోటీ చేశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో జడ్‌పీఎం అభ్యర్థి లాల్తన్‌సంగా చేతిలో 2100 ఓట్ల తేడాతో సీఎం పరాజయం పాలయ్యారు.
  • ఇక, తుయ్‌చాంగ్‌ నియోజకవర్గంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తాన్‌లుయా.. జడ్‌పీఎం అభ్యర్థిపై 909 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పలువురు మంత్రులకు కూడా ఓటమి తప్పలేదు.
  • తాజా ఫలితాల్లో జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ సీఎం అభ్యర్థి లాల్‌దుహోమా సెర్చిప్‌ స్థానం నుంచి గెలుపొందారు. తన సమీప ఎంఎన్‌జే అభ్యర్థిపై దాదాపు 3వేల ఓట్లతో గెలుపొందారు.
  • ఈ ఫలితాల్లో భాజపాకు రెండు సీట్లు దక్కాయి. పాలక్‌, సైహా స్థానాల్లో భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో భాజపాకు కేవలం ఒకే సీటు రాగా.. ఇప్పుడు రెండు స్థానాలను దక్కించుకోగలిగింది.
  • ఇక తాజా ఫలితాల్లో కాంగ్రెస్‌ ఒక చోట విజయం సాధించింది. గతంలో ఇక్కడ హస్తం పార్టీకి ఐదు స్థానాలు రాగా.. ఇప్పుడు కేవలం ఒక స్థానానికి పరిమితమవడం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img