icon icon icon
icon icon icon

2024 India elections: ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ధన సునామీ దిశగా 2024 ఎన్నికలు..!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు భారత్‌లో జరుగుతున్నాయి. ఈసారి ఖర్చులు సరికొత్త రికార్డులు సృష్టించనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఎన్నికల్లో ట్రెండ్‌ ఎలా మారుతోందో చూద్దాం..!

Updated : 02 May 2024 14:16 IST

2024 India elections ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా ఎండలు కుమ్మేస్తున్నాయి. అయినా వేడిని సైతం లెక్కచేయకుండా పార్టీలు బ్యాలెట్‌ పోరు (2024 India elections)లో మునిగిపోయాయి. ఈసారి ఎండలే కాదు.. ఎన్నికల ఖర్చూ తీవ్రంగానే ఉండనుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్వయంగా దేశ ఆర్థికమంత్రే ‘నా దగ్గర అంత సొమ్ము లేదు’ అందుకే లోక్‌సభకు పోటీ చేయనని చేతులెత్తేశారంటే ఖర్చును అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఐదేళ్లకు ఖర్చు కనీసం 50 నుంచి 100 శాతానికి పైగా పెరుగుతోందని ఎన్నికల ట్రెండ్‌ స్పష్టంగా చెబుతోంది. 2004లో నాటి ప్రధాని వాజ్‌పేయి ఓ సందర్భంలో ‘జనతంత్రం.. ధనతంత్రంగా మారుతోంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన దాదాపు 1957 నుంచి ప్రజాజీవితంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటలే వాస్తవంగా మారాయి. 

ఎన్నికల కమిషన్‌కు సమర్పించే ఖర్చే పెరుగుతుంటే.. అసలెంతో..!

అభ్యర్థుల వాస్తవ వ్యయం.. ఎన్నికల కమిషన్‌కు సమర్పించే లెక్కల్లో చాలా వ్యత్యాసం ఉంటుందన్నది జగమెరిగిన వాస్తవం. ఈసీకి సమర్పించిన లెక్కల ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సగటున ఒక్కో ఎంపీ రూ.50 లక్షలు వెచ్చించారు. 2014తో పోలిస్తే ఇది 25శాతం అధికం. అదే 2009తో పోలిస్తే 67 శాతం ఎక్కువని ఏడీఆర్‌ సంస్థ చెబుతోంది. 2019 లోక్‌సభలో 474 మంది ఎంపీల ఆస్తులు రూ.కోటి కంటే ఎక్కువ. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన మొత్తాలు కాకుండా అభ్యర్థులు వెచ్చించినట్లు సమర్పించే సగటు వ్యయమే 2009లో రూ.30 లక్షలు, 2014లో రూ.40 లక్షలుగా ఉంది. ఆ ఏడాది ఈసీ విధించిన అత్యధిక పరిమితి అభ్యర్థికి రూ.95 లక్షలు. 

ముఖ్యంగా రాజకీయ పార్టీల వ్యయాలపై నియంత్రణ లేదు. దీంతో  ఆ నిబంధనను తెలివిగా వాడుకొంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో దానికింద ఎక్కువ ఖర్చులు చూపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీల డిక్లరేషన్ల ప్రకారం భాజపా రూ.755 కోట్లు వెచ్చించగా.. కాంగ్రెస్‌ రూ.488 కోట్లు ఖర్చు పెట్టింది. నాయకులు, పార్టీలు వెల్లడించే మొత్తాలు అసలు ఖర్చుతో పోలిస్తే సముద్రంలో నీటిబొట్టుతో సమానమని నిపుణులు చెబుతున్నారు. 

ప్రతిసారీ కొత్త రికార్డులే..

2019 ఎన్నికల ఖర్చు రికార్డులు ఈసారి బద్దలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత 20 ఏళ్లలో వాస్తవిక ఎన్నికల వ్యయం దాదాపు 500శాతానికి పైగా పెరిగిపోయింది. సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అంచనా ప్రకారం 1999లో రూ.10,000 కోట్లు కాగా.. అది 2019 నాటికి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు చేరింది. 

కారణాలు అనేకం..

ఎన్నికల ఖర్చులు పెరగడానికి కొన్ని సహేతుక కారణాలూ ఉన్నాయి. 1951లో తొలి ఎన్నికల వేళ ఒక్కో ఎంపీ దాదాపు 8 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించగా.. ఇప్పుడా సంఖ్య 20 లక్షలను దాటిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. 1970 నుంచి పార్లమెంట్‌ స్థానాల సంఖ్య స్థిరంగా ఉండిపోవడం కూడా దీనికి మరో కారణం. దీంతో ఓటర్లందరిని చేరడానికి అభ్యర్థి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈక్రమంలో పోటీ కూడా పెరగడంతో.. ప్రత్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ముందుండేందుకు అభ్యర్థులే విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సివస్తోంది. చేతి ఖర్చులు, పోస్టర్లు, స్పీకర్లు, వాహనాలు, భోజనాలు ఇలా చెప్పుకొంటూ పోతే ఆ జాబితా చాలా ఉంటుంది.

మరోవైపు పార్టీలు మాత్రం రాష్ట్ర శాఖలకు సొమ్ము పంపి.. మీడియా, ఇతర మాధ్యమాల్లో ప్రచారం చేస్తాయి. ఇప్పుడు ఖరీదైన పార్టీ వ్యూహకర్తలు, డిజిటల్‌ విభాగాలు దీనికి తోడయ్యాయి. 2019లో భాజపా గూగుల్‌ యాడ్స్‌కు రూ.12 కోట్లు వెచ్చించగా.. డీఎంకే రూ.4 కోట్లు, కాంగ్రెస్‌ రూ.3 కోట్లు చెల్లించాయి. ఈ ఖర్చు మెల్లగా పెరుగుతూ వస్తోంది. 2023 ఏప్రిల్‌ 1 నాటికి కమలం పార్టీ రూ. 42 కోట్లు, హస్తం పార్టీ రూ.19 కోట్లు వెచ్చించాయి. 

సోషల్‌ మీడియా యుగం..

భారత్‌లో దాదాపు 65 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. అంటే వీరిలో చాలామంది సోషల్‌ మీడియాను అనుసరిస్తుండే అవకాశాలున్నాయి. 2019 నుంచి పార్టీలు ఈ మాధ్యమాలపైనా  దృష్టిపెట్టాయి. ఆ ఎన్నికల్లో భాజపా ఫేస్‌బుక్‌కు రూ.6 కోట్ల విలువైన ప్రకటనలు ఇస్తే.. కాంగ్రెస్‌ రూ.1.45 కోట్లు చెల్లించి ప్రచారం చేసింది. 2024 నాటికి దాదాపు 36 కోట్ల మంది భారతీయులు ఫేస్‌బుక్‌ వాడుతున్నారు. దీంతో వారిని చేరడానికి పార్టీలు ఈసారి మరింత తీవ్ర ప్రయ త్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల వ్యక్తిగత సోషల్‌ మీడియా బృందాలు, పార్టీ స్థానిక, జాతీయశాఖల యూనిట్లు, పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు సోషల్‌మీడియా సైన్యాలను తయారుచేసుకొన్నాయి. ఇప్పుడివి ప్రజాభిప్రాయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరాయి. 

కోటీశ్వరులు క్రమంగా పెరుగుతున్నారా..?

లోక్‌సభలో క్రమంగా కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోంది. 2004లో రూ. కోటి ఆస్తి ఉన్నవారు 153 మంది ఉండగా.. 2009 నాటికి 302కు చేరింది. 2014లో 442, 2019లో 472 మంది ఆస్తి రూ. కోటికి పైగానే ఉంది. 2009లో తొలిసారి లోక్‌సభలో రూ.100 కోట్లు అంతకుమించి ఆస్తి ఉన్నవారు ఎన్నికయ్యారు. 2019 నాటికి వీరి సంఖ్య 26కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img