icon icon icon
icon icon icon

Pawan Kalyan: 30న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తాం: పవన్‌ కల్యాణ్‌

ఎల్లుండి (ఈనెల 30)న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 

Published : 28 Apr 2024 20:06 IST

ప్రత్తిపాడు: ఎల్లుండి (ఈనెల 30)న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌ పాల్గొని ప్రసంగించారు. ‘‘మాఫియా డాన్‌లతో పోరాడుతున్నాం.. మన దశ దిశ మార్చుకునే ఎన్నికలివి. పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి జిల్లాలోకి బయటివారిని రానివ్వరు. కానీ, వారు మాత్రం పక్క జిల్లాలకు వచ్చి దోచుకోవచ్చు. పంతాడ అక్రమ మైనింగ్‌ను క్రమబద్ధీకరిస్తాం. ఎన్డీయే ప్రభుత్వం రాగానే ఎయిడెడ్‌ విద్యాసంస్థలను పునరుద్ధరిస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.450కోట్లు దోచేశారు. మా ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం.

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు. జగన్‌ సారా అమ్ముతూ రూ.40వేల కోట్లు సంపాదించారు. ద్వారంపూడి ప్రత్తిపాడులో అడుగుపెట్టాలంటే వందసార్లు ఆలోచించాలి. జనసైనికులకు ఉన్న దమ్ము, ధైర్యం వల్లే గూండా పార్టీని తట్టుకుంటున్నాం. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కిడ్నీలు, నరాలు దెబ్బతినేలా చేస్తున్నారు. మద్యం నిషేధిస్తామని.. ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ మూలకు వెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యం. ఐదేళ్లలో రూ.200 కోట్లు సంపాదించా. నాకు డబ్బు అవసరంలేదు. కష్టాల్లో ఉన్న రైతు కన్నీరు తుడిస్తేనే నాకు అనందం. మబ్బుల్లో పరుగెత్తే పిడుగుల్లాంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం. ఓడిపోయినా దశాబ్దం పాటు రాజకీయాల్లో ఉన్నానంటే యువత భవిష్యత్‌ కోసమే. నాకు చప్పట్లు కొట్టి వెళ్లిపోతే కాదు.. ఎన్డీయే కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం. అసెంబ్లీలో జనసేన గొంతు వినిపిస్తే ఆ శక్తి వేరుగా ఉంటుంది. దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకుని ఓట్లు అడిగే హక్కు లేదని చలమలశెట్టి సునీల్‌కు చెప్పండి. ప్రధాని దగ్గర నేను ధైర్యంగా మాట్లాడగలను. మోదీ దగ్గర ఏదైనా మాట్లాడలంటే జగన్‌కు భయం. తనపై ఉన్న కేసులు కొట్టేయమని మాత్రమే అడుగుతారు’’ అని పవన్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img