icon icon icon
icon icon icon

PM Modi: కాంగ్రెస్‌ అబద్ధాల బుడగ పేలిపోయింది..!: మోదీ

దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఓబీసీ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

Updated : 13 Nov 2023 17:00 IST

మహాసముంద్‌: పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు అన్ని అధికారాలను ప్రజలు కాంగ్రెస్‌కు (Congress) అప్పగించినప్పుడు ఆ పార్టీ ఏం చేసిందని ప్రధాని మోదీ (PM Modi) ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాలకుపైగా దేశాన్ని పాలించిన హస్తం పార్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రెండో విడత ఎన్నికల సందర్భంగా మహాసముంద్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశాన్ని దోచుకొని సొంత ఖజానాలను నింపడమే కాంగ్రెస్‌కు తెలుసని విమర్శించారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తనయుడు, సీఎం బంధువులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయాలంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పుడైనా ప్రజలను కోరిందా? అని మోదీ ప్రశ్నించారు. తొలివిడతలో జరిగిన 20 అసెంబ్లీ స్థానాల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే.. కాంగ్రెస్‌ అబద్ధాల బుడగ పేలిపోయిందని అర్థమవుతోందని, ఇక మిగిలిన రెండో విడత పోలింగ్‌లోనూ ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా 4 కోట్ల పక్కా ఇళ్లను నిర్మిస్తే.. ఆ పథకాన్ని ఛత్తీస్‌గఢ్‌లో అమలు చేయకుండా ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు.

బఘేల్‌ గెలవడం కష్టమే.. కాంగ్రెస్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది: ప్రధాని మోదీ

‘‘దిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్‌ మేధావులు కొందరు.. ప్రధాని మోదీ ఓబీసీ నుంచి వచ్చారని పదే పదే చెబుతున్నారు. ఆ రకంగా తాను ఓబీసీకి చెందిన వ్యక్తినని వాళ్లే ప్రజలకు గుర్తు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఈ పార్టీ నేతలే మోదీ పేరుతో పరోక్షంగా ఓబీసీలను దొంగలుగా అభివర్ణించారు. ఓబీసీలైన సాహు సామాజిక వర్గానికి చెందిన వారికి కాంగ్రెస్‌ ఎంత మేలు చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ తీరు ఏంటో ప్రజలందరికీ తెలుసు’’ అని మోదీ విమర్శించారు.

దశాబ్దాలు గడిచినా ఓబీసీ కమిషన్‌కు కాంగ్రెస్‌ రాజ్యాంగ హోదా ఇవ్వలేదని, వైద్య కళాశాలల్లో ఓబీసీ కోటా అమలు చేయలేదని మోదీ విమర్శించారు. వీటన్నింటినీ అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. అభివృద్ధి ఫలాలను అందుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 20 చోట్ల నవంబర్‌ 7న పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 70 నియోజకవర్గాలకు నవంబర్‌ 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img