icon icon icon
icon icon icon

Rajasthan Elections: పోలింగ్‌ వేళ ఐక్యతా ‘సందేశం’..! పైలట్‌ వీడియోను పోస్ట్‌ చేసిన గహ్లోత్‌

రాజస్థాన్‌ పోలింగ్‌ వేళ ఓటర్లను ఉద్దేశించి సచిన్‌ పైలట్‌ విడుదల చేసిన ఓ వీడియోను సీఎం అశోక్‌ గహ్లోత్‌ సైతం సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది.

Published : 24 Nov 2023 14:25 IST

జైపుర్‌: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రాజస్థాన్‌ (Rajasthan Polls) సిద్ధమైంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ (Congress) పార్టీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. గతంలో ఆధిపత్య పోరు కనబర్చిన సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot), మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ (Sachin Pilot)లు.. ఎక్కడా విభేదాలు కనిపించకుండా వ్యవహరించారు. ఈ క్రమంలోనే పోలింగ్‌ వేళ ఓటర్లను ఉద్దేశించి సచిన్‌ పైలట్‌ విడుదల చేసిన ఓ వీడియోను సీఎం గహ్లోత్‌ సైతం సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ‘గహ్లోత్‌, పైలట్‌లు పరస్పరం రనౌట్‌ చేసుకునేందుకు యత్నించారు’, ‘గుజ్జర్ల బిడ్డ (సచిన్‌ పైలట్‌ను ఉద్దేశించి)ను కాంగ్రెస్‌ పార్టీ దూరం పెట్టింది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపణలు ఎక్కుపెట్టిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

గతం గతః.. మా దృష్టంతా కలిసి పనిచేయడంపైనే: సచిన్‌ పైలట్‌

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలంటే తొలుత గుర్తుకొచ్చేది గహ్లోత్‌, పైలట్‌ల మధ్య విభేదాలే! 2018లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య అధిపత్య పోరు జరుగుతోంది. 2020లో సీఎం గహ్లోత్‌పై అసమ్మతి గళం వినిపిస్తూ నాటి ఉపముఖ్యమంత్రిగా ఉన్న సచిన్‌ పైలట్‌తోపాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ.. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్‌ పాదయాత్ర కూడా చేపట్టారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ.. ఇద్దరు కలిసి ముందుకెళ్లడం గమనార్హం.  రాజస్థాన్‌లోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్‌ నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img